మా నాన్న సాధినేని నాగేశ్వరరావు చౌదరి హరికథా కళాకారుడు. వరంగల్ దగ్గర మొగిలిచర్ల మా సొంతూరు. ప్రదర్శన కోసం ఒంగోలుకు వెళ్లినప్పుడు మా అమ్మను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం అక్కడే ఉండిపోయారు. నేను ఒంగోలులో పుట్టాను. తెనాలిలో పెరిగాను. హరికథలు వింటూ పెరగడం వల్ల కళలంటే ఇష్టం ఏర్పడింది. నా ఆసక్తిని గుర్తించి నేనే తన వారసురాలని మా నాన్న అనుకునేవారు. ఆరేళ్ల వయసులో నాకు హరికథలు నేర్పారు.
ఆంజనేయరాజు గారి దగ్గర బుర్రకథ, శ్రీరామమూర్తి గారి దగ్గర కర్ణాటక గాత్ర సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యం నేర్పించారు. బడికి వెళ్తూనే ఇవన్నీ నేర్చుకున్నాను. ఒకరోజు స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉండగా నాటక దర్శకుడు, రచయిత శాంతిబాబు గారు నన్ను చూశారు. ఆ సమయంలో ఆయన ‘మేడిపండు’ నాటకంలో బాలనటి కోసం వెతుకుతున్నారట. ఆ పాత్రకు నేను కరెక్ట్ అనుకుని జన చైతన్య నాటక సమాజం (ఒంగోలు)లోకి తీసుకున్నారు.
తొర్రూరులో చైతన్య కళా సమాఖ్య నిర్వహించిన నాటకాల పోటీల్లో తొలిసారిగా నాటకంలో పాల్గొన్నాను. ఆ పోటీల్లో ఉత్తమ బాలనటి బహుమతి గెలుచుకున్నాను. అలా ఎనిమిదేళ్లకే రంగస్థలంపై అడుగుపెట్టాను. ఆంజనేయ రాజు గారు ఇంకో ఇద్దరు అమ్మాయిలను తీసుకువచ్చి బుర్రకథ బృందం ఏర్పాటు చేశారు. నేను వంతల్లో హాస్యం చెప్పేదాన్ని. బుర్రకథల కంటే హరికథలే ఎక్కువగా చెప్పాను. సీతారామ కల్యాణం, షిరిడీ సాయిబాబా, వాసవి కన్యకాపరమేశ్వరి, తులసి జలంధర, ద్రౌపది వస్ర్తాపహరణం, శ్రీశైల మహాత్మ్యం.. ఇలా ఎన్నో హరికథలు చెప్పాను.
కొన్నాళ్ల తర్వాత మా నాన్నకు పక్షవాతం వచ్చింది. మూడేళ్లు మంచానికే పరిమితమయ్యారు. అమ్మ గృహిణి. ఇల్లు గడవడమే కష్టంగా మారింది. దీంతో చిన్నతనంలోనే ఇంటి బాధ్యతలు భుజాన వేసుకున్నాను. బుర్రకథలు, హరికథలు చెబుతూ, నాటకాలు వేస్తూ కుటుంబాన్ని పోషించాను. తర్వాత నాన్న చనిపోయారు. అప్పటికి నాకు పద్నాలుగేళ్లు. ఎక్కడ ప్రదర్శన ఉంటే అక్కడికి వెళ్లేదాన్ని.

అక్కను, అన్నను చదివించాను. కానీ, నా చదువు ఆగిపోయింది. పదో తరగతి కూడా పూర్తి చేయలేకపోయాను. పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌కు మారాం. హరికథలు తగ్గించి నాటకాలు ఎక్కువగా వేయడం మొదలుపెట్టాను. చాలామంది రంగస్థల నటులు డబ్బింగ్ చెబుతుండేవాళ్లు. నాకూ సినిమాలకు డబ్బింగ్ చెప్పే అవకాశాలు వచ్చాయి. నాలుగు వందలకుపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. టీవీల్లో న్యూస్
ప్రజెంటర్‌గా చేరాను. ప్రొగ్రామ్ హెడ్, ప్రొడ్యూసర్, సీఈఓగా పని చేశాను.
పరుచూరి బ్రదర్స్ ‘పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు’ ఏటా నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో అనేకసార్లు అవార్డులు గెలుచుకున్నాను. ఎర్ర సముద్రం సినిమా కోసం నారాయణమూర్తి గారు హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసి.. పరుచూరి గోపాలకృష్ణగారు నా పేరు సూచించారట. నారాయణమూర్తి గారి దగ్గరికి ఆడిషన్ కోసమని వెళ్లాను. ‘పరుచూరి గారే చెప్పాక ఇక ఆడిషన్స్ ఎందుకమ్మా!’ అంటూ అడ్వాన్స్ ఇచ్చి ‘షూటింగ్‌కి వచ్చేయ్’ అన్నారు. అదే ఏడాదిలో సినిమా డైరెక్టర్, రచయిత దివాకర్‌బాబు గారి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా చేరాను. గోళ్లపాటి నాగేశ్వరరావు గారి దగ్గర పని చేశాను.
ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్, దాసరి నారాయణ రావు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు రాయడంలో మెలకువలు నేర్చుకున్నాను. ‘శ్రీరామచంద్రులు- పెళ్లాల మాట వినరు’. ‘బ్రహ్మలోకం టు యమలోకం.. వయా భూలోకం’, ‘అఆఇఈ’, ‘టాప్ ర్యాంకర్స్’, ‘అంతా శుభమే.. పెళ్లి జరిపించండి’, ‘తులసి’, ‘కాశి’.. ఇలా చాలా సినిమాలకు అసిస్టెంట్ రైటర్‌గా పని చేశాను. నటిగా రాణించాలంటే కాస్టింగ్ కౌచ్ వేధింపులు తప్పేవి కావు. ఎక్స్పోజింగ్ చేయమని, లిప్‌లాక్‌లు ఇవ్వాలని ఒత్తిడి చేసేవారు. నాటకరంగంలో అలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. అందుకే, నాటకాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చాను.
నాటకాల్లో పాల్గొంటూ, డబ్బింగ్ చెబుతూ, అసిస్టెంట్ రైటర్‌గా పనిచేస్తూనే శ్రీ జయ ఆర్ట్స్ యాక్టింగ్ స్కూల్ పెట్టాను. రెండువేల మందికి నటనలో పాఠాలు చెప్పాను. యూనివర్సిటీలో థియరీ పార్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని ‘మాస్టర్ ఆఫ్ పెర్ఫామింగ్ ఆర్టిస్ట్’ కోర్స్‌లో చదవాలనుకున్నాను. తెలుగు యూనివర్సిటీలో చేరాలని ముందు డిస్టెన్స్‌లో డిగ్రీలో పూర్తి చేశాను. ఎంపీఏ అడ్మిషన్ కోసం వెళ్తే.. ‘నువ్వు సీనియర్ ఆర్టిస్ట్‌వి. ఎక్స్పీరియన్స్ ఉంది. నీకెందుకు ఇంకా చదువు.
చాలారంగాల్లో పనిచేస్తున్నావు. నాటకాలుంటే వెళ్లిపోతావు. అటెండెన్స్ లేకపోతే పరీక్ష రాయలేవు. అడ్మిషన్ ఇవ్వలేం’ అన్నారు. వాళ్లను ఒప్పించి చేరాను. రెండేళ్లు సీరియస్‌గా చదివాను. అందుకోసం టీవీల్లో పని చేయడం మానేశాను. క్లాస్‌లకు సిన్సియర్‌గా వెళ్లేదాన్ని. ఎప్పుడైనా నాటకాలు ఉంటే.. విమానంలో వెళ్లి వచ్చేదాన్ని కానీ, క్లాస్‌లు మిస్సయ్యేదాన్ని కాదు. 85 శాతం హాజరుతోపాటు మంచిమార్కులతో గోల్డ్ మెడల్ సాధించాను.

నాటకం, టీవీ, సినిమా రంగాల్లో మహిళలకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఆడవాళ్లకూ తెలివితేటలుంటాయని గుర్తించడం లేదు. వివక్ష చూపుతున్నారు. మాకు ప్రోత్సాహం కావాలి. రంగస్థలంపై నటిస్తూనే.. 39 నాటకాలకు దర్శకత్వం వహించాను. తెలుగు రంగస్థలంపై ఏ మహిళా దర్శకురాలు ఇన్ని నాటకాలకు దర్శకత్వం వహించలేదు. కొంతమంది అమ్మాయి చెబితే వినేదేమిటన్నట్టు అహంకారం చూపేవాళ్లు. థియేటర్ డైరెక్టర్‌గా మగవాళ్లకు వందల్లో అవకాశాలు ఇస్తే నాకు పదుల్లో అవకాశాలు ఇస్తారు. నాటకం ఇష్టం కాబట్టి ఈ రంగంలో ఇంకా నిలబడ్డాను.
సినిమా డైరెక్టర్ కావాలన్నది నా కోరిక. భానుమతి, సావిత్రి, విజయనిర్మల వారసురాలు కావాలన్న కోరికే తీరాల్సి ఉంది. ఆడవాళ్లు కొత్త కథలు, కొత్త పాత్రలు క్రియేట్ చేయగలరు. కొత్తగా డిజైన్ చేయగలరు. కానీ, ఆడపిల్లలకు ఓ అవకాశం ఇద్దాం అనుకునే వాళ్లు చాలా తక్కువ. కథలు రాసుకుని, రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఆ కథ వినడానికి రాత్రి రమ్మంటారు కొందరు.
లాంగ్‌డ్రైవ్‌లో మాట్లాడుకుందామని ఇంకొందరు అంటుంటారు. అవకాశాలు ఇవ్వడం లేదని సొంతంగా సినిమా ప్రాజెక్ట్ మొదలుపెట్టాను. ప్రొడ్యూసర్, రైటర్, హీరోయిన్ నేనే. అన్ని బాధ్యతలూ అయితే కష్టమని వేరే దర్శకుడిని పెట్టుకున్నాం. మిగతావాళ్లతో ఒకమ్మాయిగా పోరాడి, గెలవలేక ఆ ప్రాజెక్ట్ వదిలేశాను. డబ్బు లక్షలు పోగొట్టుకున్నాను. అందరూ చెడ్డవాళ్లు కాదు. ఏ మహానుభావుడో ఉంటాడు కదా! అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నా. ఈ ఏడాది ఈ కల సాకారమవుతుందని నా నమ్మకం.
నాన్న మంచంపట్టినప్పుడు… నేను చిన్న వయసులో కుటుంబాన్ని పోషిస్తుంటే అమ్మ బాధపడేది. కొంతకాలానికి ఆ కష్టాలకు అలవాటుపడింది. నా తోబుట్టువు లకు పెండ్లిళ్లు నేనే చేశాను. మా అన్నయ్య హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. తన ఇద్దరు ఆడపిల్లల్ని నేనే పెంచుతున్నా. ప్రసవ సమయంలో అక్క చనిపోయింది. తన బిడ్డనూ నేనే చేరదీశాను. అమ్మ, ముగ్గురు పిల్లలు, నాటకాలు, సినిమాలతో నా జీవితం ‘అంతులేని కథ’కు రెండో భాగంగా అనిపిస్తుంటుంది.
-నాగవర్ధన్ రాయల