సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల పందిరిలో ఎదిగిన గారాలపట్టి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల కోటకు పట్టమహిషి. ఈ ఇద్దరి ప్రతిభకు తీసిపోని విధంగా అభినయ వేదంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శాస్త్రీయ నృత్యకారిణి సౌజన్య శ్రీనివాస్. భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యరీతులను సాధన చేసి తన పెదనాన్న సిరివెన్నెల చెప్పినట్టు ‘సాగిన సాధనను సార్థకం’ చేసుకున్నారు. ‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు’ అన్న త్రివిక్రమ్ మాటలు ఆమెకు అతికినట్టు సరిపోతాయి. ‘మీనాక్షీ కల్యాణం’ నృత్య రూపకంతో అందరినీ ఆశ్చర్యపరచిన సౌజన్య శ్రీనివాస్ ‘సార్’ సినిమాతో నిర్మాతగా మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ‘జిందగీ’తో తన నాట్య ప్రస్థానం, త్రివిక్రమ్‌తో సాహచర్యం గురించి ఎన్నో సంగతులు పంచుకున్నారు సౌజన్య. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
మా అత్తింటి వారి పేరు చెప్పినా, మా పుట్టింటి వారి పేరు చెప్పినా అందరికీ రచయితలే కండ్లముందు కనిపిస్తారు. కానీ, నేను మాత్రం దానికి భిన్నంగా నాట్యం వైపు అడుగులేశాను. చిన్నప్పుడు కళాతపస్వి విశ్వనాథ్ గారి సినిమాలు చూసేదాన్ని. వాటి ప్రభావంతోనే సంప్రదాయ నృత్యం మీద ఇష్టం పెరిగింది. నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. మొదట్లో రుక్మాజీరావు గారి దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నా. త్రివిక్రమ్‌తో వివాహం తర్వాత జయంతి శ్రీధర్ గారి ఇన్స్టిట్యూట్లో చేరాను. ఒకసారి మా ఆయన ‘ఏదైనా పూర్తిస్థాయిలో చేయాలి. మరింత ప్రొఫెషనల్‌గా నేర్చుకో’ అన్నారు. అప్పుడు నాట్యాచార్య పసుమర్తి రామలింగశాస్త్రి గారి దగ్గర సాధన కొనసాగించాను. ఆయన మాకు దూరపు బంధువు కూడా! ఆయన సమక్షంలో భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నాను.
పెదనాన్నతో చనువెక్కువ
నేను పుట్టింది, పెరిగింది వైజాగ్‌లో. అప్పట్లో మా పెదనాన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మద్రాస్‌లో ఉండేవారు. సెలవుల్లో పెదనాన్న దగ్గరికి వెళ్లేవాళ్లం. నాన్న శ్రీరామశాస్త్రి, బాబాయ్ వెంకటరామశాస్త్రి వైజాగ్‌లో ఉండేవారు. నా పదో తరగతి పూర్తయ్యే సమయానికి పెదనాన్న వాళ్లు హైదరాబాద్ వచ్చేశారు. దీంతో మా కుటుంబాలు కూడా ఇక్కడే స్థిరపడ్డాయి. అందరం ఒకేచోట ఉండేవాళ్లం. మా ఇంట్లో అందరికీ పెదనాన్న అంటే భయం. ఆంతా ‘మీరు’ అనే సంబోధించేవారు. నేరుగా మాట్లాడాలంటే జంకేవాళ్లు. నాకు మాత్రం చనువు ఎక్కువ. ‘నువ్వు’ అని ఏక వచనంతోనే పిలిచేదాన్ని. మా తాతయ్య ఎనిమిది భాషలు మాట్లాడేవారట. రాయడంలోనూ సిద్ధహస్తులట. ఆయనకు నాట్యమంటే చాలా ఇష్టమని చెబుతారు. అయితే, తాతయ్యకు నాట్యం నేర్చుకోవడం కుదరలేదట. నేను నాట్యరంగంలోకి రావడంతో పెదనాన్నకు నాపై ప్రేమ ఎక్కువైంది. 2021లో ‘మీనాక్షీ కల్యాణం’ పేరుతో నృత్యరూపకం చేశాం. అప్పటికే పెదనాన్న పోయారు. ఆ ప్రదర్శన చూడలేకపోయారని చాలా బాధపడ్డాను.
పుస్తకాన్ని పరిచయం చేశారు
నా మీద త్రివిక్రమ్ ప్రభావం ఎక్కువ. మా పెదనాన్న దగ్గర ఆయన అసిస్టెంట్ రైటర్‌గా చేసేవారు. త్రివిక్రమ్ ప్రవర్తన, ప్రతిభ ఆయనకు బాగా నచ్చాయి. నాకు అతనే సరిజోడు అని భావించి సంబంధం కుదిర్చారు. చిన్న వయసులోనే మా పెండ్లయింది. నాకు ఏం కావాలన్నా మా వారే చూసుకునేవారు. ‘ఇది ఇలా చేస్తే బాగుంటుంది..’ అని ప్రతి విషయం నాకు తెలిసేలా చెబుతుంటారు. ప్రతిక్షణం నన్ను గైడ్ చేస్తారు. పుస్తకాలు పరిచయం చేసింది కూడా ఆయనే! ఆ అలవాటు నాలో చాలా మార్పు తెచ్చింది. ఫలానా పుస్తకం బాగుందంటూ.. అందులోని విషయాలు చెప్పి మరీ ప్రోత్సహించేవారు. మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి. సమయం దొరికితే నా చేతులు పుస్తకాన్ని అందుకుంటాయి. మనిషిని మార్చే అలవాటు ఏదైనా ఉందీ అంటే అది పుస్తక పఠనమే! మావారు ఎవరికైనా పుస్తకాలే బహుమతిగా ఇస్తారు. అలాగని తన పుస్తకాలు మాత్రం అస్సలివ్వరు. అదే పుస్తకం ఇంకోటి తెప్పించి ఇచ్చేస్తారు.
లాస్ట్ పంచ్ ఆయనదే
మాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడు మనోజ్ రిషి, చిన్నోడు నీరజ్ నందన్. మనోజ్ బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నీరజ్ ఇంటర్మీడియట్. పెద్దోడిది అచ్చంగా వాళ్ల నాన్న పోలికే. సినిమాలంటే చాలా ఆసక్తి. ఏ సీన్ ఎలా తీశారు? ఏ లెన్స్ వాడారు? కలర్ కరెక్షన్స్ ఇలా టెక్నికల్ విషయాలన్నీ వాళ్ల నాన్నతో పంచుకుంటాడు. చిన్నోడికి ఫిజిక్స్ అంటే ఆసక్తి. సమయం కుదిరితే ఇంటిల్లిపాదీ టీవీ ముందు చేరి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తాం. కులాసాగా కబుర్లు చెప్పుకొంటాం. మాటల్లో ఆయన్ను గెలవడం కష్టం. మనం ఎన్ని సెటైర్లు వేసినా.. చివరి పంచ్ మాత్రం ఆయనదే! మిగతా సమయాల్లో ఎక్కువగా పురాణాల గురించి మాట్లాడుతుంటారు. పురాణగాథలను ఈ తరానికి ఎలా చెప్పాలో ఆలోచిస్తుంటారు. పౌరాణిక చిత్రం తీయమని అడిగా.. త్వరలో నెరవేరుతుందేమో చూడాలి.
ఇన్స్టిట్యూట్ స్థాపిస్తా..
ఇటీవల నేను నిర్మాత అవతారమెత్తా. తమిళ స్టార్ ధనుష్ నటించిన ‘సార్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించా. ప్రొడ్యూసర్‌గా మొదటి చిత్రం ఇదే అయినా దీనికన్నా ముందు ‘బుట్టబొమ్మ’ విడుదలైంది. రెండు సినిమాలూ మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ‘సార్’ సక్సెస్ ఆనందాన్నిచ్చింది. సమాజానికి ఉపయోగపడే ఓ మంచి కథ విజయవంతం కావడం సంతృప్తిగా అనిపించింది. ఈ రెండు కథలూ నేనే విని ఓకే చేశా! నా జడ్జ్మెంట్ పర్లేదు!! ప్రస్తుతం ప్రొడక్షన్ హౌస్ వ్యవహారాలు చూసుకుంటున్నా. కొత్త తరానికి, ఉత్సాహం ఉన్నవారికి అవకాశాలు రావాలని త్రివిక్రమ్ పదేపదే చెబుతుంటారు. మంచికథతో వచ్చే కొత్తవారికి మా బ్యానర్ ద్వారా అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన ఉంది. నాట్యం విషయానికి వస్తే త్వరలో ‘మీనాక్షీ కల్యాణం’ నృత్యరూపకం పెద్దస్థాయిలో చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికైతే ప్లానింగ్ దశలోనే ఉంది. త్వరలోనే ప్రదర్శన ఉంటుంది. మన సంప్రదాయాలు, కళలు ఈ తరానికీ తెలియాలి. అభిరుచి ఉన్నవారికి కళ చేరువ కావాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఓ ఇన్స్టిట్యూట్ స్థాపించే ఆలోచనలో ఉన్నాను. ఏదో ఒకట్రెండు గంటలు వచ్చిపోయే వాళ్ల కోసం కాదిది! నిబద్ధతతో నేర్చుకునే వారిని ప్రోత్సహిస్తాం. సంగీతం, యోగా కూడా శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం.
మా ఆయన ట్యూషన్ చెప్పారు
మొదటిసారి 2010లో నాట్య ప్రదర్శన ఇచ్చాను. దానికి పెదనాన్న, విశ్వనాథ్ గారు అతిథులుగా వచ్చారు. తర్వాత కొంతకాలం నాట్యానికి దూరంగా ఉన్నాను. 2018లో రవీంద్రభారతిలో ఇచ్చిన ప్రదర్శనకు పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చారు. 2021లో శిల్పారామంలో ప్రదర్శన ఇచ్చాను. ఈ రెండు ప్రదర్శనల తర్వాతే
త్రివిక్రమ్ భార్యగా, నృత్యకారిణిగా అందరికీ పరిచయమయ్యా. ఇటీవల తరచూ ప్రదర్శనలు ఇస్తున్నాను. నాట్యం చేసినప్పుడు ప్రత్యేకంగా అలంకరించుకుంటాం. నన్ను ఆ ఆహార్యంలో చూసి ‘అచ్చం అమ్మవారిలాగే ఉన్నావ్’ అన్నారాయన. నా పెళ్లయ్యాక ఒకవైపు నాట్యం నేర్చుకుంటూనే డిగ్రీ చదివాను. నాకు ఆయనే మ్యాథ్స్ ట్యూషన్ చెప్పారు. లెక్కలు చెప్పేటప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ఆయన టీచర్ అయ్యుంటే ఎంత మొండి విద్యార్థికి అయినా ఫస్ట్ క్లాస్ గ్యారెంటీ.
ఇద్దరూ ప్రపంచాన్ని మర్చిపోతారు
మావారు, పవన్ కళ్యాణ్‌గారు మంచి స్నేహితులు అని అందరికీ తెలుసు. ఆయన మా ఇంటికి వస్తే ఇద్దరూ కబుర్లలో మునిగిపోతారు. బయట ఒక ప్రపంచం ఉందనే సంగతే మర్చిపోతారు. ఇద్దరి మధ్యా తత్వశాస్త్రం, పురాణాల గురించే చర్చ వస్తుంటుంది. కళ్యాణ్‌గారికి మా ఇంటి వంటంటే చాలా ఇష్టం. ఉదయం పూట వస్తే అడిగి మరీ ఉప్మా చేయించుకుంటారు. మధ్యాహ్న భోజనంలోకి ఆవకాయ, వెజిటేరియన్ వంటలు ఇష్టంగా తింటారు. అస్సలు సిగ్గుపడరు. ఇంట్లో మనిషిలా కలిసిపోతారు. ఊరగాయలు, రవ్వలడ్డూలు అడిగి మరీ తింటారు. వారిద్దరి స్నేహం చాలా గొప్పది. ఒకరంటే ఒకరికి చాలా గౌరవం. ఎవరికీ సొంత పుస్తకాలు ఇవ్వని త్రివిక్రమ్.. పవన్‌గారు అడిగితే మాత్రం కాదనరు. వాళ్లిద్దరూ ఇచ్చిపుచ్చుకునే బహుమతులు పుస్తకాలు, పెన్నులే!
…? సుంకరి ప్రవీణ్ కుమార్
సీఎం ప్రవీణ్‌కుమార్