ఎలక్ట్రానిక్ రంగంలో దిగ్గజ సంస్థగా ‘సోనీ’కి మంచి పేరున్నది. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే ప్రతీ ప్రొడక్ట్.. మ్యాగ్జిమం గ్యారెంటీతోనే వస్తుంది. అలాంటి బ్రాండ్ వ్యాల్యూ ఉన్న సోనీ.. స్మార్ట్ఫోన్ల తయారీలో మాత్రం కాస్త
వెనకబడింది. ఆ లోటును పూడ్చుకొనేందుకు సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది.
‘ఎక్స్‌పీరియా 1 VII’ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో సినిమాటిక్ కెమెరా సిస్టమ్, అద్భుతమైన ఆడియో క్వాలిటీ, 4కె డిస్ప్లే.. లాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లను పొందుపరిచింది. హైఎండ్ విభాగంలో ఆపిల్, సామ్సంగ్లాంటి సంస్థలకు ఈ మోడల్‌తో సోనీ గట్టి పోటీ ఇస్తుందని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే..
ఇందులో 6.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ + ఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 4కె రిజల్యూషన్‌లో విజువల్స్‌ను అత్యద్భుతంగా చూపిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్.. కంప్యూటర్ వేగంతో పనులు చేసిపెడుతుంది. అడ్రినో 830 జీపీయూ.. గేమింగ్, గ్రాఫిక్స్ పనిని మరో మెట్టు ఎక్కిస్తుంది. ఇక సోనీ అంటేనే.. కెమెరా! మరి తన ఫ్లాగ్షిప్ మోడల్‌ను చిన్నచిన్న కెమెరా సెటప్‌తో సెట్ చెయ్యదు కదా! ‘సోనీ ఎక్స్‌పీరియా 1 VII’ లో సినిమాటిక్ అనుభవం కోసం ప్రత్యేకమైన కెమెరాను రూపొందించింది సోనీ. ఎన్నో అత్యాధునిక ఫీచర్లు కలిగిన 48 ఎంపీ మెయిన్ కెమెరా, 48 ఎంపీ అల్ట్రావైడ్, 12 ఎంపీ టెలిఫొటో కెమెరాలను ఇందులో ఏర్పాటుచేసింది.
దీని Zeiss లెన్స్.. అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్‌తో అద్భుతమైన క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను అందిస్తుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచింది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ప్రత్యేకమైన షట్టర్ బటన్నూ ఏర్పాటుచేసింది. డ్యూయల్ స్టీరియో వాక్‌మన్ స్పీకర్లు ఏర్పాటుచేసి.. ఆడియో టెక్నాలజీలో తన ఘనమైన వారసత్వాన్ని కొనసాగించింది సోనీ.
అల్యూమినియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ విక్టస్ బ్యాక్‌తో దృఢంగా తయారైన ఈ స్మార్ట్‌ఫోన్.. కేవలం 8.2 ఎంఎం మందంతో, 197 గ్రాముల బరువుతో లుక్ పరంగానూ మేటిగా నిలుస్తున్నది. ఆండ్రాయిడ్ 15, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 30 వాట్స్ వైర్డ్ చార్జింగ్, క్యూఐ వైర్లెస్ చార్జింగ్, ఐపీ 65/ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ.. ఇలా మరెన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్ సొంతం. 12 జీబీ/ 16 జీబీ ర్యామ్, 256 బీబీ/ 512 బీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభించే సోనీ ఎక్స్‌పీరియా 1 VII.. త్వరలోనే భారత్‌లోనూ అడుగుపెట్టనుంది.