ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉన్నట్టే.. పర్యావరణవేత్తగా సోనమ్ వాంగ్‌చుక్ విజయం వెనుక ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో కూడా ఉంది. కాక్రోచ్ ఉద్యమంతో సోనమ్ వాంగ్‌చుక్‌తోపాటు ఆయన సతీమణి కూడా వార్తల్లోకెక్కారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవకు సోనమ్ వాంగ్‌చుక్‌కి ఉన్న ప్రధాన కార్యక్షేత్రం లద్దాఖ్‌లోని హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. తొమ్మిదేండ్ల క్రితం ఏర్పాటైన ఈ సంస్థకు వాంగ్‌చుక్ ఒక్కరే కాదు ఆయన భార్య గీతాంజలి కూడా వ్యవస్థాపకురాలే. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆర్థిక స్వావలంబన, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరణలో పెట్టడానికి ఆ సంస్థను స్థాపించారు.
ఆల్టర్నేటివ్స్‌లో నిరంతరం ఇద్దరూ శ్రమిస్తున్నారు. గీతాంజలి ఈ సంస్థలో పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, విద్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. ఈ సంస్థ స్థాపనకు ముందు ఆమె విండ్ ఫోర్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో డైరెక్టర్‌గా పనిచేసింది. డెలాయిట్ కంపెనీలో కెరీర్ మొదలుపెట్టిన గీతాంజలి అనేక కంపెనీల్లో రెండు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేసింది. అంతేకాదు విభిన్న రంగాల్లో అనేక డిగ్రీలు సాధించింది!
శ్రీసత్య సాయి విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషన్‌లో పీహెచ్డీ పూర్తి చేసింది. ఆమెకు ఎంబీఏ డిగ్రీ కూడా ఉంది. అంతేకాదు ఒడిస్సీ నృత్యం నేర్చుకుంది. రష్యన్ బ్యాలేలోనూ శిక్షణ పొందింది. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. తన బహుముఖ ప్రతిభతో హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడినందుకు భారత ప్రభుత్వం ఆమెకు ‘ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నేషనల్ అవార్డ్’ని ప్రదానం చేసింది.