ఈ సాంకేతిక యుగంలోని పిల్లలు.. చదువులపై అంతగా దృష్టిపెట్టలేక పోతున్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత.. టీవీలు, ఫోన్లకే అతుక్కుపోతున్నారు. అత్తెసరు మార్కులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అయితే, పిల్లలు చదువుపై ఫోకస్ పెట్టేలా తల్లిదండ్రులు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
మంచి వాతావరణం: స్కూల్లో చలాకీగా పుస్తకాలు తిరగేసిన పిల్లలు.. ఇంట్లో హోమ్‌వర్క్ చేయడానికి మొండికేస్తారు. అందుకే, వారు పాఠాలను శ్రద్ధగా చదవాలంటే.. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. పిల్లల కోసం ప్రత్యేక గదిని కేటాయిస్తే.. వారిలో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. పిల్లల గదిలోకి గాలి-వెలుతురు సరిగ్గా ప్రసరించే ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల చదువుపై దృష్టి పెట్టడంతోపాటు వారిలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
విరామం ఉండాల్సిందే!: పిల్లలు రిఫ్రెష్‌గా ఉండాలంటే.. చదువుకొనే సమయంలో వారికి చిన్నచిన్న విరామాలు ఇవ్వండి. ఆ విరామ సమయంలో పిల్లలకు ఇష్టమైన చిరుతిళ్లు, స్నాక్స్ అందించండి. కొన్ని నిమిషాలపాటు ఆడుకోమని చెప్పండి. దీనివల్ల వారు శారీరకంగా, మానసికంగానూ ఉల్లాసంగా తయారవుతారు. మరింత శ్రద్ధగా చదువుకొంటారు.
ఆటలాడిస్తూ చదివించండి: పిల్లలు ఆసక్తిగా చదువుకోవాలంటే.. ఆటలు, పజిల్స్‌తోపాటు కొన్ని ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్స్ ద్వారా వారిని చదివించండి. విజువల్స్, క్విజ్లు, ఎడ్యుకేషనల్ అప్లికేషన్లలో వారిని భాగస్వాములను చేయండి. దీనివల్ల వారు నీరసాన్ని వదిలి.. మరింత యాక్టివ్‌గా మారుతారు. సబ్జెక్టుపైనా ఆసక్తిని పెంచుకుంటారు. మీ పిల్లల అభిరుచులు, వారి ఆసక్తులకు తగినట్టుగా ఆటలు ఆడిస్తూ చదివించండి.
ఫలితం కన్నా.. ప్రయత్నమే మిన్న: పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినా.. ఫెయిల్ అయినా కొందరు తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. ఇది మంచి పద్ధతికాదు. దానివల్ల వారిలో భయం పెరుగుతుంది. ఫలితం కన్నా.. ప్రయత్నించడమే మంచిదని బోధించండి. ఫలితం ఎలా ఉన్నా.. వారితో సానుకూల ధోరణితో వ్యవహరించండి. మళ్లీ ప్రయత్నించమని, బాగా కష్టపడి చదవమని ప్రోత్సహించండి. మీ పిల్లల్ని ఇతరులతో పోల్చడం మానేయండి. ఇతరులతో కంపేర్ చేయడం వల్ల పిల్లలు తమను తాము తక్కువగా అంచనా వేసుకునే ప్రమాదం ఉంటుంది.
చిన్నచిన్న లక్ష్యాలతోనే..: పిల్లలకు చిన్నచిన్న లక్ష్యాలనే నిర్దేశించండి. వాటిని అందుకుంటే.. వారికి ఇష్టమైన బహుమతులను అందించండి. వారి కృషిని ప్రశంసించండి. దీనివల్ల పిల్లల్లో చదువుపై శ్రద్ధ మరింత పెరుగుతుంది. అప్పుడు పెద్ద లక్ష్యాలను కూడా ఇట్టే సాధిస్తారు. మీ పిల్లలకు ఏయే సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయో గుర్తించండి. వీలైతే ఆయా సబ్జెక్టులను మీరే దగ్గరుండి చదివించండి. లేదా ట్యూషన్లో చేర్పించండి.