సమాజంలో విభేదాలు ధార్మిక, సామాజిక, సంఘటితత్వానికి ప్రమాదకరం. అందుకే ముస్లింలు స్నేహంగా, సంఘటితంగా ఉండటాన్ని ఇస్లాం తప్పనిసరి విధిగా చేసింది. సోదరత్వం, సంఘటితత్వం కలిగి ఉంటేనే ఐక్యత సాధ్యమవుతుంది. ప్రజలు సత్యాన్ని నిలకడగా ఆచరించకపోతే సమాజంలో ఐక్యత దెబ్బ తింటుంది. అందుకే సమాజంలోని విభేదాలను అంతమొందించాలని ఇస్లాం కొన్ని నియమాలను బోధించింది. అలా సంఘటితంగా ఉండేవారికి అల్లాహ్ సాయం చేస్తారని స్పష్టం చేసింది.
ఈ విధమైన ఐక్యత, ఏకాభిప్రాయాల వల్లే సమాజంలో ఇస్లామీయ స్ఫూర్తి వికసిస్తుంది. ఒక పనిని ఒంటరిగా కంటే ఐక్యంగా నలుగురితో కలిసి చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అందుకే ముస్లింలు ఇతరులతో ఐక్యంగా కలిసి ఉండాలి. ఈ ఐక్యత వర్ధిల్లడం కోసం ముస్లింలకు అల్లాహ్ అయిదు పూటలా సామూహిక నమాజును తప్పనిసరి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రజలు కలుసుకోవడానికి హజ్‌ను ఏర్పాటుచేశారు. ఈ విధి విధానాలను ముస్లింలు తప్పక పాటించి ఐక్యతను పెంపొందించుకోవడానికి కృషిచేయాలి.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076