సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఓ అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అన్ని విధాలా అనుకూలంగా ఉన్న ఆ సంబంధాన్ని కాదనవద్దని తల్లి ప్రాధేయపడింది. తనకన్నా మూడేండ్లు పెద్దవాడని, అంత వయసు తేడా ఉన్న అబ్బాయి తనకు వద్దని అమ్మాయి ఆ సంబంధం తిరస్కరించింది. ‘నాకూ, మీ నాన్నకూ ఆరేండ్ల తేడా ఉంది, మేము బాగానే ఉన్నాం కదా?’ అని గట్టిగా నిలదీసింది తల్లి. ‘మీరు చేసుకున్నారని, నేను చేసుకోవాలా… వద్దంటే వద్దు. వయసు తేడా ఉంటే రుచులు, అభిరుచులు, అభిప్రాయాలు, ఆలోచనలు కలవవు. కాబట్టి నేను చేసుకోను’ అని భీష్మించుకుని కూర్చుంది ఆ అమ్మాయి. ఇంతలో వారి ఇంటికి ఆ అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలు వచ్చింది. ఆమె మానసిక వైద్యురాలు. స్నేహితురాలి చేతిలో పెండ్లి పత్రిక ఉంచి తన వివాహానికి తప్పకుండా రావాలని ఆహ్వానించింది. ఆ మాటా ఈ మాటా తర్వాత ‘పెండ్లి కొడుక్కీ, నీకు ఎన్ని నెలల తేడా’ అని అడిగింది సాఫ్ట్వేర్ అమ్మాయి. ‘నాలుగేండ్లు’ అని బదులిచ్చింది వైద్యురాలు.
అంత వయసు తేడా ఉన్న సంబంధం ఎందుకు ఒప్పుకొన్నావు? మనకన్నా ఎక్కువ వయసువారైతే వారు మన మీద అధికారం, అజమాయిషీ చెలాయించరా?’ అని ఎదురు ప్రశ్న వేసింది. వైద్యురాలు నవ్వుతూ ‘అలా ఎందుకనుకోవాలి? మనకన్నా ముందు ఈ భూలోకంలోకి వచ్చి, అంతా బాగుందని తెలుసుకుని మనల్ని ఈ నేలమీదికి ఆహ్వానించినవారని ఎందుకు అనుకోకూడదు?’ అని నవ్వుతూ సమాధానమిచ్చింది. ‘నిజమే కదా… అలా ఎందుకు అనుకోకూడదు?’ అని కొన్ని క్షణాలు ఆలోచనల్లో పడింది సాఫ్ట్వేర్ అమ్మాయి.
చిన్నగా తల్లి వైపు తిరిగి, వచ్చిన సంబంధం కుదుర్చుకుందాం అన్నట్టుగా కళ్లతోనే సైగ చేసింది. విప్పారిన ముఖంతో ఆ తల్లి ‘గులాబీ తోటలోకి వెళ్లిన కొందరు పూల అందం చూస్తారు. మరికొందరు గులాబీ ముళ్లను చూస్తారు. పూలు కోసేటప్పుడు ఆ ముళ్లు గుచ్చుకుంటాయేమోనని భయపడతారు. ఆ ఆందోళనలో గులాబీల అందాన్ని ఆస్వాదించడం మరచిపోతారు. అయినా గులాబీల అందం ముందు, ముళ్ల బాధ ఎంత? గులాబీ ముళ్లలాంటి చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూస్తే ఎలా? జీవితం కూడా అంతే’ అని మనసులో అనుకుంది.
-ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821