Smart Kitchen | ఉదయం లేవగానే ఇంటి పనులతోపాటు వంట చేసుకుని పిల్లలకు బాక్సులు కట్టి, ఆఫీస్‌కు క్యారేజీ సిద్ధం చేసుకొని పొలోమని పరిగెత్తడం ఇంటింటా సర్వసాధారణమే! అరగంట ఆలస్యంగా నిద్ర లేచామా.. ఆ రోజు బాక్సులోకి పచ్చడి మెతుకులే గతి! అలాంటి సమయంలో ఇబ్బంది లేకుండా మార్కెట్లోకి వచ్చినవే స్మార్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్. తక్కువ టైమ్‌లో ఎక్కువ వంటలు వండి వార్చే ఆ గ్యాడ్జెట్స్ ఏంటో మీరూ ఓ లుక్కేయండి.
ఒక్కో వంటకానికి ఒక్కో కుక్కర్, పాత్రలు వాడేఅవసరం లేకుండా అన్నిరకాల వంటల్ని వండేందుకు అనువైనదే ఈ మల్టీ కుక్కర్. ఈ ఒక్క కుక్కర్‌తో అన్నం, ఇడ్లీ, సాంబార్, మ్యాగీ, కూరలు.. ఇలా అన్నిరకాల వంటలు చేసుకోవచ్చు. ఇన్‌బిల్ట్ బౌల్‌తో అందుబాటులో ఉన్న దీన్ని శుభ్రం చేయడం కూడా తేలిక. వర్కింగ్ ఉమెన్స్‌కి, బ్యాచ్‌లర్స్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది.
చిన్నాపెద్దా తేడా లేకుండా ఎక్కువగా ఇష్టపడే స్నాక్స్‌లో ఒకటి పాప్‌కార్న్. బయటికెళ్తే వందలు పెడితే గానీ గుప్పెడు పాప్‌కార్న్ రాదు. ఈ ఖర్చును నియంత్రించేలా పాప్‌కార్న్ మేకర్ కొంటే సరి. ఏ కల్తీ లేకుండా ఇంట్లోనే పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ నిమిషాల్లో సిద్ధం చేసేయొచ్చు.
వంటింట్లో ఎక్కువగా వాడే వస్తువుల్లో ఒకటి చాప్ బోర్డ్. ఏ వంట చేయాలన్నా ముందుగా కూరగాయలు తరగాల్సిందే. అయితే చెక్కతో చేసిన చాప్ బోర్డ్ తరచుగా తడపడం వల్ల వాసన వస్తుంది. ఇక ఫైబర్, ప్లాస్టిక్ చాప్బోర్డ్ల వాడకం వల్ల వాటిలోని రేణువులు వంటలో కలిసే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నిటికీ స్టీల్ చాపింగ్ బోర్డ్‌తో చెక్ పెట్టేయచ్చు. ఏ చింతా లేకుండా స్టీల్ బోర్డ్‌పై చక్కగా కూరలు తరిగి వంటపాత్రల మాదిరిగానే శుభ్రం చేసి పెట్టుకుంటే సరి.