“ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకో ట్రెండ్ వచ్చినా.. క్లాసిక్ ఎప్పటికీ క్లాసిక్కే!” అంటున్నది బాలీవుడ్ నటి శ్వేతా త్రిపాఠి. ‘మిర్జాపూర్’ వెబ్‌సిరీస్‌లో ‘గోలు’గా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నది. ఇటీవలే నిఫ్ట్ (ఎన్ఐఎఫ్టీ) నుంచి ‘ఫ్యాషన్ కమ్యూనికేషన్’లో డిగ్రీ పట్టా పొందింది. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాషన్, ట్రెండ్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నది. ఫ్యాషన్ స్కూల్లో చేరడం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెబుతున్నది. అనేక విషయాల పట్ల తన దృక్పథంలోనూ మార్పు వచ్చిందనీ అంటున్నది.
“నేను ఎలా ఉండాలి? ఎలా కనిపించాలి? అనేది పూర్తిగా నా ఇష్టం! నా లుక్స్‌కు నేనే బాస్! అందుకే, ఏదైనా ఫ్యాషన్ ట్రెండింగ్‌లో ఉన్నదంటే.. దాన్ని తప్పకుండా ఫాలో కావాల్సిన అవసరం లేదని అనుకుంటా. నేనెప్పుడూ అలాంటి నియమం పెట్టుకోలేదు కూడా. కాకుంటే.. ఫ్యాషన్ ట్రెండ్స్‌ను మాత్రం గమనిస్తుంటా. నాకు ప్రయత్నించాలని అనిపిస్తే.. కచ్చితంగా చేస్తా!” అంటూ చెప్పుకొచ్చింది. “అప్పుడప్పుడూ మన వ్యక్తిత్వానికి సరిపోని, మనకు అన్‌ఫిట్ అయ్యే ఫ్యాషన్ ట్రెండింగ్‌లోకి వస్తుంది. అలాంటప్పుడు దాన్ని దూరం పెడతా! కానీ, నా స్నేహితులకు సరిపోతుందని భావిస్తే.. తప్పకుండా వారికి పంపిస్తా! మా అత్తగారికి నప్పుతాయని అనిపిస్తే.. ఆవిడతోనూ పంచుకుంటా!” అని చెబుతున్నది.
తనకు ఫ్యాషన్ రంగంలో ప్రయోగాలు చేయడమంటే ఇష్టమనీ, అదృష్టవశాత్తూ తన వృత్తికూడా అందుకు సహకరిస్తుందని అంటున్నది. ప్రొడక్షన్ అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది శ్వేతా త్రిపాఠి. 2015లో ‘మసాన్’తో వెండితెరపై కనిపించింది. ఇక 2018లో వచ్చిన మిర్జాపూర్ సిరీస్.. ఆమె యాక్టింగ్ కెరీర్‌నే పూర్తిగా మార్చేసింది. రాత్ అకేలి హై, కార్గో, హరాంఖోర్ చిత్రాల్లో అద్భుత నటన కనబర్చి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. చివరిగా విపుల్ మెహతా దర్శకత్వం వహించిన ‘కంజూస్ మఖిచూస్’ చిత్రంలో కనిపించింది.