అప్పటివరకు ఆ చిన్నారికి పెద్దయ్యాక ఏం కావాలో క్లారిటీ లేదు. ఎనిమిదేండ్ల వయసులో న్యూఢిల్లీలోని వైమానిక దళ మ్యూజియాన్ని సందర్శించింది. అక్కడున్న ఫైటర్ జెట్లను చూసి.. అచ్చెరువొందింది. ఆ ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే.. పెద్దయ్యాక అలాంటి యుద్ధ విమానాలు నడపాలని ఫిక్సయింది. తన కలను నిజం చేసుకోవడానికి అహరహం శ్రమించింది. ఎయిర్‌ఫోర్స్‌లో అడుగుపెట్టింది. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి భారతీయ ఫైటర్ పైలట్‌గా చరిత్రకెక్కింది. అంతులేని ఆత్మవిశ్వాసంతో.. యుద్ధమేఘాల మధ్యగా రాఫెల్‌ను దౌడు తీయిస్తున్న స్కాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ ప్రయాణం ఇది..
శివాంగి సింగ్.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించింది. ఎంతో తెలివైన విద్యార్థిని. చదువుతోపాటు ఆటల్లోనూ రాణించేది. అయితే, ఆమె అసలైన ప్రయాణం.. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ మ్యూజియం సందర్శించినప్పుడు ప్రారంభమైంది. ‘అక్కడే నా కల మొదలైంది. వైమానిక దళ మ్యూజియంలో నిలబడి యుద్ధ విమానాలను చూసిన క్షణమే.. నాకంటూ ఓ జీవిత లక్ష్యం ఏర్పడింది’ అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది శివాంగి. తన లక్ష్యాన్ని చేరే క్రమంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా అందుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చేరింది.
భారత వాయుసేనలో 2017లో ఫైటర్ పైలట్‌గా చేరిన శివాంగి.. కొద్దిరోజుల్లోనే దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. 2020లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన వివిధ పరీక్షల్లో నెగ్గి.. ఫ్రెంచ్ శిక్షకులతో సిమ్యులేటర్ ట్రైనింగ్‌కు ఎంపికైంది. అందులో కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని.. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నది. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రకెక్కింది. ‘కొంచెం భయం, కొంచెం ఆందోళనతోపాటు గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో ఫైటర్ జెట్‌ను పరుగులు పెట్టించా!’ అంటూ తన మొదటి కాక్‌పిట్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటుంది శివాంగి. తన తల్లే తనకు స్ఫూర్తి అని చెబుతుందామె. ‘అందరు తల్లుల్లా మా అమ్మ నన్ను చదువుకే పరిమితం చేయాలని అనుకోలేదు. నేను స్వతంత్రంగా ఉండాలని కోరుకుంది. నా అన్ని ప్రయత్నాలలో ఆమె సంపూర్ణ మద్దతు ఇచ్చింది’ అని చెబుతుంది శివాంగి.
రాఫెల్‌తో శత్రువులను వేటాడిన శివాంగి సింగ్.. ఇప్పుడు ఆకాశాన్ని దాటి అంతరిక్షాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది. మనదేశం భవిష్యత్తులో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష మిషన్‌లో భాగంగా వ్యోమగామి కావాలని ఆశిస్తున్నది. ‘ఒకప్పుడు ఫైటర్ జెట్ నడపడం కేవలం పురుషుల పనిగానే భావించేవారు. కానీ, మహిళలకు కూడా ఇది సాధ్యమే అని నిరూపితమైంది. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. వ్యోమగామిగా సేవలు అందించాలని అనుకుంటున్నాను’ అంటూ తన భవిష్యత్ కార్యాచరణ గురించి చెబుతున్నది ఈ 29 ఏళ్ల వాయుసేన అధికారిణి. శివాంగి తోటి ఫైటర్ పైలట్‌నే వివాహం చేసుకున్నది. దాంతో భారతదేశ వైమానిక రక్షణలో ముందంజలో ఉన్నదీ యువజంట. శివాంగి ప్రస్తుతం అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో తన సేవలను అందిస్తున్నది.