ఎరుపు లంగాజాకెట్టు, పెద్ద బొట్టుతో అమ్మోరు సినిమాలో నిజంగానే అమ్మవారిని తలపిస్తూ అలరించిన బేబీ సునయన మనకు సుపరిచితమే. ఇటీవల మాత్రం ‘ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్’గానే ఆమెను ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు. మహిళల జీవితాల్లో ఎదురయ్యే రకరకాల సమస్యల మీద తనదైన శైలిలో అక్కసు వెళ్లగక్కుతూ, అందులోనూ నవ్వుల్ని పూయించేలా ఈమె చేసే ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ సిరీస్‌కు మెగాస్టార్ నుంచి సాధారణ జనం వరకూ ఎందరో అభిమానులు ఉన్నారు. ప్రారంభించిన తొలినాళ్లలోనే మిలియన్ల వ్యూస్‌ని సంపాదించిన ఈ సిరీస్ నేపథ్యంతోపాటు తన కెరీర్ సంగతుల్నీ సునయన జిందగీతో పంచుకున్నారిలా…
సమాజంలో రకరకాల సమస్యలు ఉంటాయి. అందులో ఆడవాళ్లకు మాత్రమే… అని బోర్డు పెట్టుకుని వచ్చే సమస్యలూ చాలానే ఉంటాయి. కేవలం మహిళ కాబట్టే ఆమె ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నది అనిపించే సందర్భాలు అనేకం చూస్తుంటా! పైకి భరిస్తున్నట్టో, పోనీ మేనేజ్ చేస్తున్నట్టో కనిపించినా వాటిని అనుభవించే వారి మనసులో ఎంత బాధ ఉంటుంది, దానివల్ల లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనేది చూపించాలని నా సిరీస్‌ల ఉద్దేశం. దీనివల్ల కొన్ని అంశాల మీద కొంతవరకైనా ఎదుటివాళ్ల దృష్టికోణం మారుతుందన్నది నా ఆశ. సాధారణంగా జీవితంలో జరిగే లేదా చూసే సన్నివేశాల గురించి మనం మాట్లాడినప్పుడే జనం మనతో కనెక్ట్ అవుతారు. చాలామందికి చికాకు కలిగించే ఈ విషయాలను అంతే చిరాగ్గా, ఇంకాస్త నవ్వు వచ్చేలా వ్యక్తీకరించడం వల్ల జనం వీటికి దగ్గర అవుతున్నారనుకుంటున్నా. నిజానికి సరదాగా ఓ ప్రయత్నంలా దీన్ని మొదలుపెట్టా.
ఈ సిరీస్ మొదలుపెట్టే 2016నాటికి నేను ఒక యూట్యూబ్ సంస్థలో పనిచేసేదాన్ని. అప్పుడే కమెడియన్ భద్రం ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనే ఒక ప్రోగ్రామ్ చేశారు. ఒక్క వ్యక్తే కనిపిస్తూ ప్రోగ్రామ్ చేయడం అన్న విషయం ఇక్కడ నాకు కొత్తగా అనిపించింది. అందులోనూ ఆయా వ్యక్తులకు సంబంధించిన సమస్యలను ఎత్తి చూపడం అన్న ఆలోచన నచ్చింది. అలా మహిళా మేనేజర్ కష్టాల గురించి చెబుతూ తొలుత ‘ఫ్రస్ట్రేటెడ్ మేనేజర్’ సిరీస్ చేశాను. మరో మూడు ఎపిసోడ్ల తర్వాత విదేశాల్లో ఉన్న మా అక్క చెప్పే సంగతుల ఆధారంగా చేసిన ‘ఫ్రస్ట్రేటెడ్ ఎన్ఆర్ఐ’ చేశాను. అది విపరీతంగా వైరల్ అయింది. దేశవిదేశాల నుంచీ దానికి మంచి స్పందన వచ్చింది. ఇక మళ్లీ నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఫ్రస్ట్రేషన్ ఆన్ ట్రెడిషన్స్, ఫ్రస్ట్రేషన్ ఆన్ రిస్ట్రిక్షన్స్, ఫ్రస్ట్రేషన్ ఆన్ అనుమానపు మొగుడు, ఉమనైజర్ మొగుడు, ఫ్రస్ట్రేషన్ ఆన్ బాస్… ఇలా రకరకాల విషయాలను తీసుకొని సిరీస్‌లు చేశాను. ఇప్పటిదాకా 200 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. వీటిలో ‘ఫ్రస్ట్రేటెడ్ అమ్మవారు’ నాకు చాలా నచ్చింది. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే రకరకాల ఇబ్బందుల ఆధారంగా నేను నా స్క్రిప్ట్‌ను అల్లుకుంటాను. వాటితోనే సిరీస్‌లు చేస్తాను. మెగాస్టార్, అజిత్, పూరీ జగన్నాథ్, రానా, నందినీ రెడ్డి లాంటి వాళ్లంతా నా సిరీస్‌లు చూస్తుంటారు. ఎంతోమంది డాక్టర్లు, ఉన్నతాధికారులు నాకు అభిమానులుగా ఉన్నారు. నాకు ‘ఓ బేబీ’ సినిమాలో చాన్స్ రావడానికి కారణం నందినీ రెడ్డి నా ఫ్రస్ట్రేటెడ్ సిరీస్‌లు చూడటమే.
చాలామంది నా తొలి సినిమా అమ్మోరు అనుకుంటారు. కానీ, నేను 1989 నుంచే, అంటే నాకు రెండున్నరేండ్ల వయసున్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నా. మాది విజయవాడ. నాన్న ఆర్కిటెక్ట్. అమ్మ గృహిణి. అక్క తర్వాత పదహారేండ్లకు నేను పుట్టాను. అమ్మ కన్నా ఎక్కువగా అక్కతోనే ఉండేదాన్ని. ఆమెతో కలిసి డ్యాన్స్ క్లాస్‌కి వెళ్లినపుడే సినిమా చాన్స్ వచ్చింది. మొదటగా ఉషాకిరణ్ మూవీస్ ‘మనసు మమత’ సినిమాలో తరుణ్‌కి చెల్లెలిగా నటించాను. అమ్మోరుకు ముందు దాదాపు పదిపదిహేను సినిమాలు చేశాను. అందులో వసుంధర సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నాను. ఆ తర్వాత చేసిన అమ్మోరు, బాల రామాయణం గురించి అందరికీ తెలిసిందే. కళంకిత, జీవన సౌరభాలు మొదలైన సీరియళ్లలో నటించాను. యాంకర్‌గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా, ఆర్జేగా పనిచేశాను. నేను గర్భిణిగా ఉన్న సమయం తప్ప ఖాళీగా ఉన్న రోజంటూ లేదు. అన్నట్టు ఎంబీఏలో నా సీనియర్ అయిన బాదం వినయ్ కుమార్‌తో నా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. మాకు ఒక అబ్బాయి… పేరు సాయి కార్తిక్. బాబు పుట్టాక చేసిన ‘ఓ బేబీ’ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇటీవలి వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మెహర్ రమేశ్ గారి ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్నా. చివరిగా ఒకమాట, నా సిరీస్‌లు చూసి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీదేనా అని చాలామంది అడుగుతారు. అది కానే కాదు! సమాజంలో నేను చూసిన విషయాలనే ఇక్కడ ప్రస్తావిస్తా. ఇంకో సంగతి చెప్పాలి… అత్త, అమ్మ, భర్త, నేస్తాలు, బాస్… ఇలా ఎవరైనా ఏదైనా సందర్భంలో అనవసరంగా మనల్ని నొచ్చుకునేలా మాట్లాడితే… ‘పోనీ లే’ అని వదిలేయడం వల్ల మనం ఎక్కువ ఆందోళనకు గురవకుండా ఉంటాం. దాన్ని ఎక్కువగా మనసుకు తీసుకుంటేనే అది ఫ్రస్ట్రేషన్‌గా మారుతుంది. చెప్పింది అర్థమైందిగా… లేకపోతే దీని గురించి కూడా మళ్లీ నేను ఫ్రస్ట్రేట్ కావాల్సి వస్తుంది!
ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్‌కీ లక్షల్లోనే వ్యూస్ ఉంటున్నాయి. నా సిరీస్‌లు పెట్టే ‘మీ సునయన’ చానెల్‌కు దాదాపు నాలుగున్నర లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఈ మధ్యే ‘సునయన ది ఒరిజినల్’ పేరిట కొత్త చానెల్ ప్రారంభించి అందులోనే కొత్త ఎపిసోడ్లు పెడుతున్నాను. జనం ఎన్నాళ్లు ఆదరిస్తే అన్నాళ్లు ఈ సిరీస్ కొనసాగించాలని ఉంది.
-లక్ష్మీహరిత ఇంద్రగంటి,
చిన్న యాదగిరి గౌడ్