బాలీవుడ్ బాద్షా షారుఖ్ కొడుకు, దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆర్యన్ ఖాన్‌ను ప్రశంసలతో ముంచెత్తింది ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్. అతను ‘అద్భుతమైన వారసుడు’ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. సినిమాలతోపాటు ఫుడ్ వ్లాగ్స్తోనూ సందడి చేస్తున్నది ఫరా ఖాన్. ఇటీవల నటుడు, డ్యాన్సర్ అయిన రాఘవ్ జుయల్‌కు.. తన ఫుడ్ వ్లాగ్‌లో ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా.. ‘ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్’లో రాఘవ్ నటనను ప్రశంసించింది. నెట్‌ఫ్లిక్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న ఈ వెబ్ సిరీస్‌కు.. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్‌పై వ్యంగ్యాత్మకంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించాడు. తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌తోపాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఫరా ఖాన్ మాట్లాడుతూ.. “ఈ వెబ్‌సిరీస్ స్క్రీనింగ్ తర్వాత గౌరీ ఖాన్ నాకు ఫోన్ చేసింది.
తన బిడ్డ ఆర్యన్ సాధించిన సక్సెస్‌ను నాతో పంచుకున్నది. బాలీవుడ్ దర్శకుల్లో ఆర్యన్‌కు నేనే ఇన్స్పిరేషన్ అనీ, అతనికి ఇష్టమైన చిత్రం నా దర్శకత్వంలో షారుఖ్ నటించిన ‘ఓం శాంతి ఓం’ అని గౌరీ నాతో చెప్పింది” అంటూ వెల్లడించింది ఫరా ఖాన్. ‘ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్’ విడుదలకు మూడు నెలల ముందే షారుఖ్ ఇంట్లో ఏడు ఎపిసోడ్లను తాను చూసినట్లు ఫరా పంచుకుంది. సిరీస్ విడుదలైన తర్వాత, చాలామంది ఆర్యన్ దర్శకత్వంపై ప్రశంసలు కురిపించారనీ, అతని శైలిని.. తన దర్శకత్వ శైలితో పోల్చారనీ ఫరా హర్షం వ్యక్తంచేసింది. ‘ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్’ విషయానికి వస్తే.. ఆర్యన్ ఖాన్ రచన, దర్శకత్వంలో వచ్చిన తొలి వెబ్ సిరీస్. బాలీవుడ్‌లోని అధికార పోరాటాలు, అంతర్గత-బయటి వ్యక్తుల వ్యవహారాలు, పరిశ్రమలో రాజకీయాలను హాస్యభరితంగా చూపించారు. లక్ష్య లల్వానీ, సహేర్ బంబా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో.. బాబీ దేవోల్, మోనా సింగ్, మనోజ్ పహ్వా, రజత్ బేడి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్, రణ్వీర్ సింగ్, ఇమ్రాన్ హష్మి, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లు అతిథి పాత్రల్లో మెరిశారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్.. అందరి ప్రశంసలూ అందుకుంది. ఫరా ఖాన్ కూడా ఇందులోని ‘గఫూర్’ అనే పాటకు కొరియోగ్రఫీ చేసింది.