సామాజిక మాధ్యమాలు.. అసామాజికంగా మారుతున్నాయని బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతిజింటా విమర్శిస్తున్నది. చాలామంది నెటిజన్లలో నెగెటివ్ ఆలోచనలు పెరుగుతున్నాయని.. సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా నెగెటివ్‌గానే తీసుకుంటున్నారని మండిపడుతున్నది. తాజాగా, ‘ఎక్స్’ వేదికగా.. సోషల్ మీడియాలో నెటిజన్ల తీరును విమర్శిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ‘అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతున్నది. నెటిజన్లంతా నెగెటివ్‌గా మారుతున్నారు.
సామాజిక మాధ్యమాల వేదికగా ఏది పంచుకున్నా.. లేనిపోని విమర్శలకు దిగుతున్నారు. ఏఐ బాట్‌తో తమ మొదటి చాట్ గురించి మాట్లాడితే.. ‘అది పెయిడ్ ప్రమోషన్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఏ విషయంలోనైనా ప్రధానిని అభినందిస్తే.. ‘అనుచరులు’ అనే ముద్ర వేస్తున్నారు. ‘అంధ భక్తులు’ అంటూ నిందలు వేస్తున్నారు’ అంటూ రాసుకొచ్చింది.
నెటిజన్ల మనుసులో ఉండేది కాకుండా.. వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని కోరింది. ‘బహుశా మనమందరం ఒక ‘చిల్ పిల్’ వేసుకుని.. ఒకరితో ఒకరు సంతోషంగా సంభాషించుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చింది. ‘ఇక మాధ్యమం ఏదైనా.. నేను నిజమైన సంభాషణనే ఇష్టపడతాను. గతంలో చాటింగ్ కోసం మంచిమంచి ప్లాట్‌ఫామ్స్ ఉండేవి.
మేము ఒక అంశాన్ని ఎంచుకుంటే.. అందరం దానిపైనే చర్చించేవాళ్లం. లేనిపోని విషయాలను పక్కనపెట్టేవాళ్లం’ అంటూ గుర్తుచేసుకున్నది ప్రీతిజింటా. ప్రస్తుతం పిల్లలను చూసుకోవడంలోనే సమయం గడిచిపోతున్నదనీ, సమయం దొరికితే.. ఆన్‌లైన్‌లోకి తప్పకుండా వస్తాననీ చెప్పుకొచ్చింది. ఇక తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని ప్రీతి జింటా.. ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. బాలీవుడ్ సహా.. అన్ని భాషల్లోనూ టాప్ హీరోయిన్గా కొనసాగింది.