Sankranti Food | మకర సంక్రాంతి భారతీయులకు పంటకోతల పండుగ. అంతేకాదు ఇక్కడినుంచి చలి తగ్గి పగటికాలం పెరుగుతుంది. అందుకే ఈ పండుగలో సూర్యుడి ఆరాధన ప్రధానంగా ఉంటుంది. పంటకోతల పండుగ కాబట్టి, సంక్రాంతి అంటే నోరూరించే తీపి, కారపు వంటకాల మిశ్రమం. తెలంగాణలో ప్రధాన వంటకాలైన పొంగల్, నువ్వుల లడ్డూలు, సకినాలు నోటికి రుచితోపాటు శరీరానికి ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తాయి. సంక్రాంతి సందర్భంగా ఆరుబయట పతంగులు ఎగరవేయడం వల్ల శరీరానికి తగినంత సూర్యరశ్మి సోకుతుంది. విటమిన్ డి వంటబడుతుంది.
సంక్రాంతి వంటల్లో తప్పకుండా ఉండే మిఠాయి నువ్వుల లడ్డు. నువ్వులు, బెల్లం, పల్లీలు, యాలకుల పొడితో చేసే ఈ లడ్డూలు తియ్యదనంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. నువ్వులు ఎన్నో విటమిన్లు, ప్రొటీన్లు, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటి ఆక్సిడెంట్స్‌కు నెలవులు. ఇవి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. నువ్వులు శక్తి వనరులు కూడా! ఇక బెల్లం బరువు తగ్గడానికి, డయాబెటిస్, కొలెస్ట్రాల్ నిర్వహణకు దోహదపడుతుంది. ఊపిరితిత్తులకు మేలుచేస్తుంది. ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పల్లీలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాలకులు గుండె ఆరోగ్యానికి మేలుచేస్తాయి.
దక్షిణ భారతదేశంలో ఇష్టంగా తినే ఆహార పదార్థం పొంగల్. బియ్యం, పెసరపప్పు, మిరియాలు, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర, అల్లంతో దీన్ని తయారుచేస్తారు. పొంగల్‌లో వాడే పెసరపప్పులో ప్రొటీన్లు, ఫైబర్, ఫోలేట్, విటమిన్ కె, సి సమృద్ధిగా ఉంటాయి. పెసరపప్పు.. మధుమేహం, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది. కాలేయం ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంగువ జీర్ణ సమస్యలకు మంచి ఔషధం. కరివేపాకు జీర్ణకోశ రుగ్మతలు, మొలలు, ఒంటినొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం చలికాలంలో పీడించే జలుపు, దగ్గు, కీళ్లనొప్పులను నివారిస్తుంది.
ఉత్తర తెలంగాణలో సంక్రాంతి పండుగ ప్రత్యేక పిండివంట సకినాలు. బియ్యంపిండి, వాము, నువ్వులు ప్రధాన సంబారాలు. ఈ పదార్థాల్లో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వాము కఫాన్ని తగ్గిస్తుంది. నువ్వులు ఎముకలు కొరికే చలిని కాచుకునేందుకు తగిన ఉష్ణాన్ని అందిస్తాయి.