మెండైన ఔషధ గుణాలు కలిగిన గంధం.. సౌందర్య సంరక్షణలోనూ ముందుంటుంది. మేని ఛాయను మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి బ్యాక్టీరియల్, యాంటి మైక్రోబయల్, యాంటి ప్రొలిఫెరేటివ్, యాంటి వైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ చర్మ సంరక్షణలో సాయపడుతాయి.
పొడి చర్మాన్ని నివారించడంలో గంధం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పాలపొడిలో కొన్ని చుక్కల గంధం నూనె, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని.. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. గంధంలోని సుగుణాలు.. చర్మానికి తేమను తెస్తాయి.
ఒక టీస్పూన్ గంధం నూనెలో చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లా రాసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మొటిమలు, నల్లమచ్చలు తొలగిపోతాయి.
గంధంలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు.. ఫ్రీరాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టికి, మరో రెండు టేబుల్ స్పూన్ల గంధం కలపాలి. కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి.. ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి.. చల్లని నీటితో కడిగితే చాలు. ముఖంపై ముడతలు, గీతలు తగ్గిపోయి.. చర్మం మృదువుగా మారుతుంది. చర్మంలో పేరుకున్న మలినాలు తొలగిపోవడంతోపాటు స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.
ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు కలిగిన గంధం.. చర్మంపై నల్ల మచ్చలను పోగొడుతుంది. ట్యాన్ తొలగించడంలోనూ సాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ గంధం పొడికి కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసుకొని, సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచేసి, ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేస్తే.. ముఖం తళతళ మెరుస్తుంది.