తనకు ఆపద వచ్చిన ప్రతిసారీ.. తన తండ్రి తనవెంటే ఉన్నారని చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్ సమంత రుత్ప్రభు. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం రాత్రి మృతిచెందగా.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ సోషల్మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టింది సమంత. తాను కెరీర్లో ఈ స్థాయికి ఎదిగానంటే.. దానికి కారణం తన తండ్రే అని రాసుకొచ్చింది.
‘మా నాన్న మాకు చిన్నతనం నుంచే విలువలు, కష్టపడటం గురించి నేర్పించేవారు. విజయాలను చూసి పొంగిపోవద్దని చెప్పేవారు. ఆయన మాటలే నా జీవిత ప్రయాణాన్ని అందంగా తీర్చిదిద్దాయి. అయితే, నేను సొంతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు నా జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. అనేక కష్టనష్టాలకు గురిచేశాయి. అలా నేను బాధపడ్డ ప్రతి సందర్భంలోనూ నా తండ్రి నాకు తోడుగా ఉన్నారు. ఇండస్ట్రీతోపాటు వ్యక్తిగత జీవితంలో నేను ఎదుర్కొన్న అనేక పోరాటాల్లో ఆయన నాకు అండగా నిలిచారు’ అంటూ తండ్రితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది సమంత.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తల్లిదండ్రులను మాత్రం ఎప్పటికప్పుడు కలుస్తుండేది. ఇక తన కూతురు స్టార్ హీరోయిన్గా ఎదిగినా.. మీడియాకు దూరంగానే ఉన్నారు జోసెఫ్ ప్రభు. కానీ, 2021 అక్టోబర్లో సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకున్న ఏడాది తర్వాత.. వారి పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. జరిగిన దానిపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. వారి విడాకుల విషయాన్ని అంగీకరించడానికి తనకు చాలాకాలం పట్టిందని చెప్పుకొచ్చారు. ఇద్దరూ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు.