ఎర్రెర్రని గులాబీలంటే ఇష్టంలేనిది ఎవరికి? ముడుచుకుని మొగ్గలా ఉన్నా… విచ్చుకుని పువ్వుగా మారినా.. ఆ సౌందర్యానికి సాటేది? కానీ, రోజా జీవితకాలం మహా అయితే ఒక రోజు! అలా కాకుండా అచ్చం గులాబీ మొగ్గలా కనిపిస్తూ ఎక్కువ రోజులు నిలిచి ఉండాలంటే మాత్రం ‘రోజ్ సకులెంట్’ను ఇంట్లో పెంచుకోవాల్సిందే. ఎడారి మొక్కల జాతికి చెందిన దీని ఆకులు అచ్చం గులాబీ మొగ్గ ఆకృతిని పోలి ఉంటాయి.
ఈ మొక్క శాస్త్రీయనామం గ్రీనోవియా డోడ్రెంటాలిస్. దాదాపు ఆరు అంగుళాల ఎత్తు వరకూ పెరిగే ఈ మొక్కలు కొంతకాలానికి చిన్న చిన్న పిలకలు వేస్తాయి. చిట్టి గులాబీని పోలిన ఆ పిలకల్ని మరోచోట నాటితే ఇంకో మొక్క తయారవుతుంది. పచ్చరాతిని పోలిన వర్ణంతోపాటు గులాబీ రంగులోనూ ఈ మొక్కలు దొరుకుతాయి. ఆన్లైన్లోనూ ప్రయత్నించవచ్చు.