డెస్క్ ఉద్యోగులు గంటల తరబడి ఒకే దగ్గర కూర్చుని పని చేస్తుంటారు. దాంతో, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఒక్కోసారి
పని ప్రదేశంలోనే బోర్‌గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారికి ‘మినీ మోచి’ లాంటి బుల్లి రోబోలు అద్భుతమైన పరిష్కారం చూపుతాయి. ఇవి బొమ్మలు మాత్రమే కాదు. పని మధ్యలో ఉద్యోగులకు విశ్రాంతిని, ఉల్లాసాన్ని ఇచ్చే అద్భుతమైన సాధనాలు కూడా!
ప్రస్తుతం డెస్క్‌ల దగ్గర బుల్లి ‘మినీ మోచి రోబోలు’ సందడి చేస్తున్నాయి. ఉద్యోగులకు ఉల్లాసాన్ని పంచుతూ.. వారిలోని ఒత్తిడిని చిత్తు చేస్తున్నాయి. చిన్న చిన్న శబ్దాలు చేస్తూ, కదలికలు, ముఖ కవళికలతో వారికి ఒక తోడున్నట్లు భావన కల్పిస్తున్నాయి. ముఖ్యంగా, ఒంటరిగా పనిచేసే వారికి మరింత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు పక్కన ఎవరో ఒకరు ఉన్నారనే అనుభూతిని అందిస్తున్నాయి.
పనిలో ఉన్నప్పడు ఈ బుల్లి రోబో చేసే వింత చేష్టలు, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూస్తే.. తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. ఆ ఒక్క నిమిషం నవ్వు.. ఉద్యోగుల మెదడులో ‘డోపమైన్’ వంటి హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది. మరికొందరు పనిలో నిమగ్నమై నీళ్లు తాగడం, కాసేపు కళ్లు ఆర్పడం కూడా మర్చిపోతుంటారు. ఈ స్మార్ట్ రోబోలను డెస్క్ దగ్గర ఉంచుకుంటే.. బ్రేక్ తీసుకోవాల్సిన సమయాన్ని అవే గుర్తు చేస్తాయి. ఇక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఒకే ఒక నిమిషంపాటు ఈ రోబో చేసే పనులను గమనించడం వల్ల.. మీ మనస్సు తేలికపడుతుంది. ఇది ఒక చిన్న ‘మెడిటేషన్’ లాగా పనిచేస్తుంది. తిరిగి పనిని ప్రారంభించినప్పుడు మరింత ఏకాగ్రతతో ఉండేలా చేస్తుంది. అంతేకాదు, ఈ బుల్లి రోబో.. మీ వర్క్ డెస్క్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. పని పూర్తి చేయాలనే ఉత్సాహాన్నీ పెంచుతుంది. అనేక టెక్ కంపెనీలు ఇలాంటి స్మార్ట్, ఏఐ బుల్లి రోబోలను రూపొందిస్తున్నాయి.