ప్రతి ఒక్క ఆడపిల్లా.. తన కలలను సాధించుకోవాలని పిలుపునిస్తున్నది బాలీవుడ్ నటి, నిర్మాత రిచా చద్ధా. కొవిడ్ సమయంలో తాను రాసిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘ఆఖ్రీ సోమ్వార్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచా మాట్లాడుతూ.. ఓ మధ్యతరగతి పంజాబీ కుటుంబంలో పెరిగిన తన సొంత అనుభవాల నుంచి ప్రేరణ పొంది ఈ కథ రాసుకున్నట్టు వెల్లడించింది. “అమ్మాయిలు బాల్యం నుంచే ఎన్నో కలలు కంటూ ఉన్నత చదువులు చదువుతారు.
అయితే, వివాహబంధంలోకి అడుగుపెట్టడంతోనే ఆ కలలన్నీ కల్లలే అవుతాయి. కుటుంబ పోషణకోసం ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టినా.. తమ కలలు మాత్రం నెరవేర్చుకోలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే.. అప్పటికి వారు 30 ఏళ్లు దాటి, పిల్లల పెంపకంలో తలమునకలై ఉంటారు” అంటూ చెప్పుకొచ్చింది. తన సినిమా ‘ఆఖ్రీ సోమ్వార్’ కూడా ప్రేమలు, కలలు, సామాజిక అంశాలతో నిండి ఉంటుందని వెల్లడించింది.
కాగా, రిచా చద్ధా.. ‘ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్!’ చిత్రంలో ఓ చిన్న పాత్రతో చిత్రసీమలో అడుగుపెట్టింది. 2012లో వచ్చిన క్రైమ్ సినిమా.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ భార్యగా ఆమె పోషించిన పాత్రకు.. ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును కూడా అందుకున్నది. 2022లో మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్‌ని ప్రేమ వివాహం చేసుకున్నది. తాజాగా, చిత్ర నిర్మాణరంగంలోకీ అడుగుపెట్టింది. సంజయ్ లీలా భన్సాలీ.. ‘హీరామండీ’ వెబ్ సిరీస్‌లో మెప్పించిన రిచా.. ‘అభీతో పార్టీ షురూ హుయీ హై’ సినిమాలోనూ మెరిసింది.