‘అన్నం’.. ఆరోగ్యానికే కాదు, అందాన్ని పెంచడంలోనూ ముందుంటుంది. అన్నంలో ఉండే విటమిన్-బి.. చర్మ కణాల పనితీరును పెంచుతుంది. విటమిన్-ఇ శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేసి.. చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో లభించే విటమిన్లు, ఖనిజాలతో.. చర్మ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
అన్నం మన చర్మం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ‘డ్రై స్కిన్’ సమస్యను దూరం చేస్తుంది.
బియ్యంలోని పోషకాలు.. చర్మానికి కీలకమైన కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ముఖంపై ముడతలు రాకుండా చూడటంతోపాటు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ముందుంటాయి.
తయారీ ఇలా.. పూర్తిగా చల్లారిన అరకప్పు అన్నాన్ని మెత్తగా మెదిపి ముతక పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇందులో పాలు లేదా పెరుగు, తేనెతోపాటు ఎసెన్షియల్ ఆయిల్ వేసి, బాగా కలుపుకొంటే.. రైస్ ఫేస్‌ప్యాక్ రెడీ అయిపోతుంది. ఇందులోని పెరుగు.. మాస్క్‌కు మాయిశ్చరైజింగ్ లక్షణాలను అందిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచడంలో తేనె సాయపడుతుంది. ఇక ఎసెన్షియల్ ఆయిల్ వల్ల.. ఫేస్‌ప్యాక్ మంచి సువాసన వస్తుంది.
వాడే విధానం.. రైస్ మాస్క్ అప్లయి చేసేముందు.. మీ ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఏదైనా మేకప్, ఇతర క్రీమ్స్ ఉంటే.. పూర్తిగా తొలగించుకోవాలి. ఆ తర్వాత.. రైస్ మాస్క్‌ను ముఖం మొత్తం కవర్ అయ్యేలా సమానంగా అప్లయి చేసుకోవాలి. కళ్లలోకి పోకుండా చూసుకోవాలి. పావుగంట ఆరిన తర్వాత.. గోరు వెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. కడిగేటప్పుడు.. చేతి వేళ్లతో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బియ్యం కడిగిన నీటితో ముఖం కడుక్కోవడం వల్ల.. చర్మం మృదువుగా తయారవుతుంది. ఈ నీటిని టోనర్‌గా వాడుకుంటే.. ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోవడంతోపాటు మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.