వడ్లు, మక్కల వ్యాపారంలో నష్టాలు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు. ఆ సమయంలో తోలు ఉత్పత్తుల వ్యాపారం తోడుగా నిలిచింది. లెదర్ వాసనలో మగ్గుతూ, ఓపికతో డిజైన్లకు తగ్గట్లుగా కట్ చేస్తూ, నేర్పుగా అతికిస్తూ.. అందమైన ఆకారం వచ్చేలా కుడుతూ.. డబ్బులు సరిపోక అయినవాళ్ల దగ్గర చేయి చాస్తూ.. ఐదేండ్ల పాటు కష్టాలు అనుభవించింది. తన నమ్మకం వమ్ముకాలేదు. ఇప్పుడు, ఊహించినదానికి మించి లాభాలు ఆర్జిస్తున్నది జగిత్యాల జిల్లాకు చెందిన రేణికుంట సరస్వతి. ఆమె నేతృత్వంలోని ‘జై సాయి లెదర్స్’ అరవై మంది మహిళలకు ఉపాధి కేంద్రమైంది. ఆ కథంతా..
మేం బ్యాగుల తయారీ ప్రారంభించిన మొదట్లో వంద రూపాయల లాభం కోసం పదిచోట్ల తిరగాల్సి వచ్చేది. క్రమంగా మా రాబడులు వందల నుంచి వేలకు చేరుకున్నాయి. అలా అని, మా ప్రయాణమేం నల్లేరుమీద నడక కాదు. తొలిరోజుల్లో మాకు తగినంత నైపుణ్యం లేక పోవడం వల్ల లెదర్ చెత్తపాలు అయ్యేది. ఆ వృథా నుంచే కొత్త డిజైన్లకు ప్రాణం పోసేవాళ్లం. మా పొరపాట్ల వల్ల వచ్చిన ఆర్డర్లు వెనక్కి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. చేసిన తప్పు మరోసారి చేయకుండా జాగ్రత్త పడేవాళ్లం. కటింగ్, డిజైనింగ్, పేస్టింగ్, స్టిచింగ్.. అన్నీ సక్రమంగా కుదిరి ఫినిషింగ్ బాగా వచ్చాకే మార్కెట్‌కు పరిచయం చేశాం. మొదటి ఐదేండ్లూ లాభాల్లేవు. అయినా, నిరాశపడకుండా వ్యాపారంలో కొనసాగాం.
రూ.2 లక్షల రుణంతో
మాది జగిత్యాల జిల్లాలోని ఎండపల్లె గ్రామం. పన్నెండేండ్ల నుంచీ లెదర్ ఉత్పత్తులు మార్కెట్ చేస్తున్నాం. మాదో స్వయం సహాయక బృందం. నేను ఈ వ్యాపారం చేస్తానని చెప్పినప్పుడు సెర్ప్ అధికారులు నన్ను డీఆర్డీఏ సిబ్బందికి పరిచయం చేశారు. అక్కడ నలభై రోజుల శిక్షణ ఇప్పించి రూ.2 లక్షల నిధులు మంజూరు చేశారు. చెన్నై వెళ్లి ఆ డబ్బుతో మెషినరీ, ముడిసరకు తెచ్చుకున్నాం. అప్పటికి తోలు నాణ్యత గురించి అంతగా తెలియక పోవడం వల్ల తమిళ వ్యాపారులు మోసం చేశారు. అలా ఎనభై వేల వరకూ నష్టం వచ్చింది. ఆ అనుభవం నుంచి పాఠం నేర్చుకున్నాం. ఏమాత్రం రాజీపడకుండా నాణ్యమైన లెదర్ కొనుగోలు చేస్తున్నాం. మేమిచ్చే డిజైన్ల ఆధారంగా మా గ్రూపు సభ్యులు లగేజీ, ట్రాలీ బ్యాగులు, కంప్యూటర్ బ్యాగులు.. తయారుచేస్తారు. మా నాణ్యత నచ్చి పెద్దపెద్ద కంపెనీలు బల్క్‌గా ఆర్డర్లు ఇస్తుంటాయి. వ్యాపారం వృద్ధి చెందడంతో హైదరాబాద్‌లో మరో 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాం.
కేరళ వరదలతో
నాలుగేండ్ల క్రితం.. కేరళలో ఎగ్జిబిషన్ పెట్టాం. అంతలోనే వరద బీభత్సం మొదలైంది. కళ్లముందే బ్యాగులన్నీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డాం. మళ్లీ ఇంటికి తిరిగొస్తామని కూడా అనుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం సురక్షితంగా విమానాల్లో తీసుకొచ్చింది. కానీ, రూ.5 లక్షల సామగ్రి నీటిపాలైంది. ఏడాది తర్వాత కేరళ ప్రభుత్వం రూ.3 లక్షల నష్టపరిహారం ఇచ్చినా, ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి రెండేండ్లు పట్టింది. నాంపల్లి ఎగ్జిబిషన్లో జరిగిన ప్రమాదంలోనూ నష్టపోయాం. కొవిడ్ సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు వీహబ్ కొత్త దారి చూపింది. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో శిక్షణ ఇచ్చింది. మార్కెటింగ్ పాఠాలు నేర్పింది. బ్రాండింగ్ సూత్రాలు బోధించింది. ఫండింగ్ కూడా ఇస్తామన్నారు. ఆ నిధులను మేం కొత్తగా ప్రారంభించే కంపెనీ కోసం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం.
త్వరలోనే ఆన్‌లైన్‌లోకి..
వీహబ్ సాయంతో ఆన్లైన్లో అడుగుపెట్టబోతున్నాం. ప్రస్తుతం ఎగ్జిబిషన్లలోనే విక్రయాలు చేస్తున్నాం. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాం. మాకు దేశవ్యాప్తంగా కస్టమర్లు ఉండటంతో సొంతంగా వెబ్సైట్ రూపొందించుకునే పనిలో ఉన్నాం. ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా కూడా విక్రయాలు ప్రారంభిస్తాం. ఇప్పటివరకు దాదాపు రూ.20 లక్షల రుణం తీసుకున్నాం. మా ప్రయాణంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు.
– రేణికుంట సరస్వతి, జై సాయి లెదర్స్ (9848321893)