పాఠశాలల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దాదాపు 87శాతం మంది ఇందుకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. పిల్లలకు పాఠశాల దశలోనే జీవన నైపుణ్యాలను నేర్పించాలని 94శాతం మంది తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కె-12 టెక్నీ సర్వీసెస్ సంస్థ ‘ఆల్ ఇండియా పేరెంట్ సర్వే-2024’ పేరుతో ఇటీవలే ఓ సర్వే నిర్వహించింది.
ఇందులో భాగంగా దేశంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీతోపాటు ఆయా రాష్ర్టాల బోర్డులకు చెందిన 3వేలమంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ నివేదిక ప్రకారం.. 87శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల్లో సాంకేతికతను ఉపయోగించడానికి మద్దతు ఇస్తున్నారు. విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడంలో సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని వారు చెప్పారు.
మరో 46శాతం మంది సాంకేతికత వాడకం మితంగా ఉండాలని కోరగా.. స్క్రీన్ టైమ్ను తగ్గించాలనీ, అందుకోసం నాన్స్క్రీన్ కార్యకలాపాలను ప్రోత్సహించాలని 57శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 28శాతం మంది మాత్రం.. పాఠశాలల్లో కఠినమైన నిబంధనలు అమలు పర్చాల్సిందేనని అన్నారు. ‘నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం-2020’పై 58శాతం మంది సానుకూలంగా స్పందించగా.. 42శాతం మంది అందులోని ప్రతికూలాంశాలపై చర్చించారు.
ఇకపోతే.. 60శాతం మంది యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్కు, 53శాతం మంది స్కిల్ బేస్డ్ లర్నింగ్కు ఓటేశారు. ఇక పాఠశాలలు – విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ కోసం.. 50శాతం మంది వాట్సాప్ మెసేజ్లకు ఓటెయ్యగా.. పేరెంట్ పోర్టల్ ద్వారా 22శాతం మంది, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తే సరిపోతుందని మరో 22శాతం మంది చెప్పారు. పేరెంట్ – టీచర్ మీటింగ్లు నిర్వహించాలని 28శాతం మంది సూచించారు. అప్పుడే తమ పిల్లలు పాఠశాలల్లో ఎలా ఉంటున్నారో ప్రత్యక్షంగా తెలుసుకునే వీలుకలుగుతుందని అన్నారు.