పువ్వుల్లో రారాణి ఏదంటే గులాబీ పేరే ముందుంటుంది. రంగులోనే కాదు ఆకృతిలోనూ దానికదే సాటి. గులాబీ రేకులూ సౌందర్యానికి చిరునామాలే. ఆ అందాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో మగువ నగల్లో వాటికీ చోటిస్తున్నారు డిజైనర్లు. ‘రోజ్ పెటల్ జువెలరీ’ అలా రూపుదిద్దుకున్నదే.
నెక్లెస్‌లు, లాకెట్లు, జుంకాలు, చెవిపోగుల్లో రోజా పువ్వుల రేకల్ని చొప్పించడం దీని ప్రత్యేకత. ఇందులో కొన్ని నిజమైన పూరేకులతో చేసిన ప్రెస్డ్ ఫ్లవర్ పెటల్ నగలైతే, మరికొన్ని గులాబీ రెక్కల్ని అనుకరిస్తూ చేసిన ఎనామిల్, ఆక్రిలిక్ లాంటి వాటితో రూపొందిస్తున్నవి ఉంటున్నాయి. గోల్డ్ ప్లేటెడ్ తరహాలో ఎక్కువగా ముస్తాబవుతున్న ఇవి ఫ్యాషనబుల్‌గా ధరించేందుకు బాగుంటాయి. రోజాపువ్వుల్లాగే నాజూకుతనానికి చిరునామాగా నిలుస్తున్నాయి.