ఇంట్లో పూజ అయినా, శుభకార్యమైనా.. కొబ్బరికాయ కొట్టడం కామన్! పచ్చి కొబ్బరితో చట్నీ చేసుకోవడం, అలాగే తినేయడమూ అంతే కామన్! అయితే, డయాబెటిస్ బాధితులు పచ్చికొబ్బరిని తినడానికి వెనకాముందూ ఆడుతుంటారు. షుగర్ లెవల్స్ పెరిగిపోతాయని భయపడుతుంటారు. ఈ క్రమంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చికొబ్బరి మేలే చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు పచ్చికొబ్బరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. పచ్చికొబ్బరిలో ైగ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అతి తక్కువ కార్బోహైడ్రేట్లతోపాటు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దాంతో జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది.
తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయులను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. దాంతో, రక్తంలో చక్కెర స్థాయులు అదుపు తప్పకుండా ఉంటాయి. ఇక పచ్చికొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలోనూ ముందుంటాయి. పచ్చికొబ్బరిలో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి, అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే, తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఇక పచ్చికొబ్బరిని బెల్లం, చక్కెరతో కలిపి తీసుకోవద్దు. దీంతో చట్నీలు చేసేటప్పుడు ఉప్పు తక్కువగా వేసుకోవాలి.