Rashmi Desai | సినిమాలు, సీరియల్స్, రియాలిటీ షోలు.. అన్నిటిలో కనిపించే తారలు తక్కువమంది ఉంటారు. బుల్లితెర, వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుని కెరీర్ కొనసాగించడం మామూలు విషయం కాదు. అందుకు ఎంతో ప్లానింగ్, క్రమశిక్షణ అవసరం.
అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో జెట్స్పీడ్తో దూసుకెళ్తున్న నటి రష్మి దేశాయ్. 2004లో ‘యే లమ్హే జుదాయి కే’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముంబయి భామ భోజ్‌పురి, గుజరాతీ, ఉర్దూ భాషల్లోనూ నటించింది. పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొన్నది. హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్‌గా నిలిచింది. 2011లో సీరియల్ నటుడు నందీశ్ సంధును పెండ్లి చేసుకున్న రష్మి.. 2014లో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది.
ఆ సమయంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ‘2016లో వివాహబంధం నుంచి అఫీషియల్‌గా విడిపోయా. సరిగ్గా అదే సమయంలో ఓ ఇల్లు కొనుగోలు చేశాను. అందుకోసం రూ.2.5 కోట్ల అప్పు చేశాను. అప్పటికే కోటి రూపాయల వరకు వేరే అప్పులు ఉన్నాయి. వీటిని ఎలాగైనా తీర్చేయగలనన్న నమ్మకం నాకుండేది. అయితే, ఆ సమయంలో నేను చేస్తున్న షో ఒకటి అర్ధంతరంగా ఆగిపోవడంతో షాక్‌కు గురయ్యాను.
నాలుగైదు రోజులు రోడ్డుపైనే ఉన్నాను. కారులోనే నిద్రపోయాను. రూ.20కి దొరికే భోజనం చేశాను. ఆ కష్ట సమయాన్ని ఎలా దాటుకొచ్చానో నాకిప్పటికీ అర్థం కాదు. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ ఉండేదాన్ని. నిద్రాహారాల్లేకుండా కష్టపడ్డా. అలా ఒక్కొక్కటిగా అప్పులన్నీ తీర్చేశా!’ అని చెప్పుకొచ్చింది రష్మి. ఆమె నటించిన హిందీ సినిమాలు మిషన్ లైలా, హిసాబ్ బరాబర్, గుజరాతీ చిత్రం మామ్ తానే నై సమ్ఝే.. తదితర చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.