Rakhi Pournami | ‘హే.. చెర్రీ నీకేదో లెటర్!’ అనగానే..
‘నాకు లెటరేంట్రా! సరిగ్గా చూడు’ అన్నాడు చెర్రీ.
‘నీకే మామా! ఫ్రమ్ యువర్ సిస్టర్’ అన్నాడు లేఖ
తీసుకున్న కొలీగ్. ఆత్రంగా లెటర్ అందుకున్నాడు చెర్రీ..
‘హాయ్.. అన్నయ్యా!! ఉభయ కుశలోపరి..’
ఉత్తరంలో మొదటి వాక్యం చదవగానే చెర్రీ ఆసక్తి రెండింతలైంది.
‘నీకు గుర్తుందా?
టెక్ట్స్ మేసేజ్‌లు, వాట్సాప్‌లు లేవప్పుడు..
ఇంటి వాకిటి అరుగుపై నువ్వూ, నేనూ ఎన్నిగంటలు తీరిగ్గా
కూర్చునేవాళ్లమో!
అప్పుడు చెప్పుకొన్న విక్రమార్క-బేతాళ కథలు నాకింకా గుర్తు.
ఏ ఎమోజీలు పుట్టలేదింకా! ‘అబ్బా! చాల్లేవే రాక్షసీ’ అని అరిచినప్పుడు నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ భలేగా ఉండేది. అదే నాకు ఇష్టమైన మొదటి ఎమోజీ!
అమెజాన్లు, ఆన్లైన్ డెలివరీలు మనకేం తెలుసు!
నీ చేతులతో చేసిన ‘తాటిముంజె బుర్రల బండి’.. మెరుపువేగంతో వచ్చి నాకు ఇచ్చావ్ చూడు… అదే నాకు ఫస్ట్ గిఫ్ట్!
‘నాకూ కొంచెం పెట్టవా!’ అని నేను తింటున్న పీచు మిఠాయిలో వాటా అడగడం, నేనివ్వడం నా బెస్ట్ షేరింగ్ మూమెంట్.
ఇవన్నీ నీకు గుర్తున్నాయా అన్నయ్యా! నాకు అలాంటి మూమెంట్స్ కావాలి! కనీసం ఏడాదికి ఒక్కరోజైనా! ఈ రాఖీ పండుగ పూటైనా! అందుకే ఇలా లెటర్ రాస్తున్నా. నువ్వు పెట్టిన అన్ని ఆన్లైన్ గిఫ్ట్స్
డెలివరీలు క్యాన్సిల్ చేసి ఇంటికి రా..! ఆ రోజంతా ఆఫ్‌లైన్‌లోనే కాలక్షేపం చేద్దాం!’
చెర్రీ కండ్లల్లో నీళ్లు. అవి బాధతోనో.. ఆనందంతోనో వచ్చినవి కాదు. సాసరంత పేపర్ మీద.. ఓ దోసెడన్ని అక్షరాలు.. చెర్రీని పాతికేండ్లు వెనక్కి లాక్కుపోయాయి. క్యాలెండర్ గడుల్లో బందీ అయిన జ్ఞాపకాలను తన చెల్లెలు ఇలా గుర్తుచేస్తుందని అనుకోలేదు. ఫోన్ టింగ్మన్నది. అమెజాన్ నోటిఫికేషన్. నవ్వుకొని.. మళ్లీ లెటర్ చదవసాగాడు..
‘లాస్ట్ ఇయర్.. నువ్వు అమెజాన్‌లో పంపిన ఫోన్‌తో నీ కోడలు ఆడుకుంటున్నది. హెడ్సెట్లో నీ బుజ్జి అల్లుడు వాడికి నచ్చిన పాటలు వింటున్నాడు. వీళ్ల వయసులో మనం ఎలా ఆడుకున్నామో గుర్తుందా… చెడుగుడు ఆటలో నా వల్ల నీ నుదురుకు పెద్ద గాయమైంది. అప్పుడు నాకెంత భయమేసిందో! ఇంట్లో తెలిస్తే నాన్న ఏం చేస్తారో అని ఏడ్చేశా!! అంత బాధలోనూ నన్ను ఓదార్చావ్! ఇంటికి వెళ్లాక ‘చెట్టు కొమ్మను చూసుకోలేదు.. తగిలింది’ అని చెబుతూ నావైపు చూసిన చూపు నాకింకా ఫ్రెష్‌గానే ఉంది. చెల్లిని భరించడం అన్నకుండే డీఫాల్ట్ ఫీచరేమో! అని నిన్ను చూస్తే తెలుస్తుంది. ఆ క్షణంలో మా అన్న సూపర్ అనిపించింది. ఈ మాట అప్పుడు చెప్పలేకపోయా కానీ, ఇప్పుడు చెబుతున్నా! మనమంతా కలిసి ఆడిన ఆటలు, అందులోని ఎమోషన్స్ అన్నీ నాతోనే ఉన్నాయి. ఏంట్రా ఇది ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నది అనుకుంటున్నావేమో!!’ చెర్రీ ముఖంలో చిరునవ్వు.
చెర్రీ ఫోన్‌కు మరో నోటిఫికేషన్. మింత్రా నుంచి.. పక్కకు స్వైప్ చేసి ఆలోచనలో పడ్డాడు. చిన్నప్పుడు ఎంత పెంకిలా ఉండేది. ఇప్పుడు ఎలా మారిపోయింది. ఉద్యోగం, పిల్లలు, కుటుంబ బాధ్యతలు.. తన బిజీలో తానుంది అనుకున్నా. కానీ, ఈ అన్నతో జర్నీని ఇంత పదిలంగా దాచుకుందంటే… అది తోబుట్టువుకు మాత్రమే తెలిసిన ఎమోషన్ ఏమో!!’ అనుకుంటూ… మళ్లీ లెటర్ తడుముతూ.. చదవసాగాడు.
‘అఫ్కోర్స్ ఈ రోజుల్లో వర్చువల్‌గానే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అనుకో! ఆరేండ్లుగా మనమూ అదే చేస్తున్నాం. నేను నీకు కట్టే రాఖీలు అమెజాన్‌లో బుక్ చేస్తున్నా. నాకు ఇవ్వదలుచుకున్న గిఫ్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నావ్! రెండు నిమిషాల వీడియో కాల్లో మూడు ముచ్చట్లు. ఈసారి అలా కుదరదు. అందుకే రాఖీలు కొన్నా పంపలేదు. వచ్చేయ్ అన్నయ్యా! మా ఇంటి వాకిట్లో అరుగు లేకపోవచ్చు. బేతాళ కథలు చెప్పుకోనవసరం లేదు.
చిన్నప్పటి మన కబుర్లు గుర్తు చేసుకుందాం. నా పిల్లలకు చెబుదాం. మనం ఎలా ఆడుకున్నామో, ఎలా ఆటపట్టించుకున్నామో.. అన్నీ చెబుదాం. మనంత కాకపోయినా, కాస్తయినా వారి మధ్య రియల్ ఎమోషన్ డెవలప్ అవుతుంది. ఏమంటావ్? వచ్చేస్తావ్గా!! సర్లేగానీ, ఆల్రెడీ పెట్టిన ఆర్డర్లేమీ క్యాన్సిల్ చేయొద్దు! ఏదో ఎమోషన్లో అనేశా!!’
-ఇట్లు..
నీ చెల్లి
నవ్వుకుంటూ.. లెటర్ జేబులో పెట్టుకున్నాడు చెర్రీ. చెల్లెలు ఊరికి టికెట్ బుక్ చేశాడు. ఇది చెర్రీ, అతని చెల్లి కథ మాత్రమే కాదు. చాలామంది ఇలాగే ఫీలవుతున్నారు. అందుకే సోదరీమణులారా వర్చువల్ అభినందనలు పక్కనపెట్టి.. అన్నదమ్ముల చేతికి స్వహస్తాలతో రాఖీ కట్టండి. వారు ఆప్యాయంగా అందించే కానుకలను అపురూపంగా అందుకోండి.