తోబుట్టువుల ఆప్యాయతలకు ఆలవాలం రాఖీ పౌర్ణమి. అన్నతమ్ముళ్లకు రాఖీలు కట్టి అక్కాచెల్లెళ్లు సంబురపడతారు. ఈ చిన్నారులు మాత్రం నీడ నిచ్చే చెట్టునే తమ అన్నగా భావించారు. తమ బడి ప్రాంగణంలో ఎదిగిన మానుకు మనస్ఫూర్తిగా రాఖీ కట్టి ప్రకృతికీ, మనిషికీ మధ్యనున్న ‘రక్షా’బంధాన్ని చాటి చెబుతున్నారు.
అందరూ తమ అన్నదమ్ములకు రాఖీ కడితే నాగర్ కర్నూల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు మాత్రం చెట్టుకు రాఖీకి కడుతున్నారు. తమకు నీడనిచ్చి, తినేందుకు పండ్లను అందించి, పీల్చుకునేందుకు స్వచ్ఛమైన గాలినిచ్చే చెట్టును మించిన ఆత్మీయులు ఇంకెవరని భావించి.. దానికి రక్ష కడుతున్నారు.
నాగర్కర్నూల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రకరకాల చెట్లు ఉన్నాయి. వాటిలో సీమ చింతకాయ చెట్టంటే ఆ పిల్లలకు ప్రత్యేకమైన అభిమానం. ముప్పయ్ ఏండ్లుగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఈ మాను.. 2017 మే నెలలో గాలివానకు కుప్పకూలిపోయింది. నేలకొరిగిన చెట్టును అక్కణ్నుంచి తొలగించాలని స్థానికులు భావించారు.
చెట్టును కొట్టించి వంటచెరకుగా తరలించాలని నిర్ణయించారు. కూలీలను పురమాయించారు. ఆ వార్త విని తల్లడిల్లిపోయారు విద్యార్థులు. అదే పాఠశాలలో పనిచేసే యశోద టీచర్ ఆ పిల్లల బాధను అర్థం చేసుకున్నారు. కూలిన చెట్టును మళ్లీ నిలబెట్టాలని సంకల్పించారు. నేలకొరిగిన భారీ వృక్షాలను సైతం నిలబెట్టి, చివురింపజేసే వట ఫౌండేషన్ గురించి తెలుసుకొని, ఆ సంస్థ నిర్వాహకులను సంప్రదించారు. ఆ టీచర్ అభ్యర్థన, విద్యార్థినుల ఆరాటం చూసి.. చెట్టును నిలబెట్టడానికి ముందుకొచ్చింది
వట ఫౌండేషన్.
2017 జూలై 28.. నేల మీద పడి ఉన్న చెట్టును ఆ రోజే నిలబెడుతున్నారని తెలిసి అందరిలో ఉత్సాహం. పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారిపోయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు అందరూ అక్కడ గుమిగూడారు. పిల్లలంతా చెట్టు చుట్టూ దూరంగా నిలబడ్డారు. వట ఫౌండేషన్ తరఫున ఎనిమిది మంది వలంటీర్లు రంగంలోకి దిగారు. నాలుగు గంటలపాటు శ్రమించారు. ఆ క్రతువు జరుగుతున్నంత సేపూ… ఉత్కంఠగా ఎదురుచూశారంతా! చప్పట్లు చరుస్తూ అక్కడి వాతావరణాన్ని ఉత్సాహపరిచారు. చూస్తుండగానే… చెట్టు నిలిచింది. వారాలు గడిచాయి.
సీమ చింతకాయ కొత్త చిగురేసింది. పూత పూసింది. కాయ కాసింది. పునర్జన్మ పొందిన చెట్టన్నకు అక్కడి విద్యార్థినులంతా తోబుట్టువులు అయ్యారు. ఆ చెట్టు మళ్లీ ప్రాణం పోసుకున్న జూలై 28వ తేదీనే రాఖీ పండుగగా జరుపుకొంటున్నారు. ఏటా ఆ రోజు విద్యార్థినులంతా చెట్టుకు రాఖీ కట్టడం ఆనవాయితీగా మార్చేసుకున్నారు. ఆ చెట్టుకూ, తమకూ ఉన్న బంధానికి రక్ష కడుతున్నారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అని చాటి చెబుతున్నారు. ప్రాణవాయువు అందించే చెట్టుకు ప్రాణం పోసి, ఆ బంధాన్ని పదిలంగా నిలుపుకొంటున్న ఈ చెల్లెమ్మలకు మనమూ జేజేలు పలుకుదాం!