‘డియర్ యువర్స్ లవింగ్లీ…’ అంటూ ఆమె పలకరింపు ఓ నోస్టాలజీ! యాంకర్‌గా ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే.. ఎగిరి గంతేసేవాళ్లు అప్పట్లో! ఆ తర్వాత సీరియల్ ఆర్టిస్టుగా తెలుగువారికి మరింత దగ్గరైంది. ‘మొగలి రేకులు’ కీర్తనగా బుల్లితెర ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటి రాగమాధురి. గృహిణిగా సెటిలవ్వాలనుకున్న ఆమె.. కుటుంబ పరిస్థితుల కారణంగా యాంకరైంది. ఆ తర్వాత యాక్టర్‌గా ఎందరికో చేరువైంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘జగద్ధాత్రి’ సీరియల్లో వైజయంతిగా అలరిస్తున్న రాగమాధురి ‘జిందగీ’తో పంచుకున్న కబుర్లు ఆమె మాటల్లోనే..
నేను పక్కా హైదరాబాదీ. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా బాల్యమంతా వనస్థలిపురంలోనే గడిచింది. నాగార్జున స్కూల్, సిద్ధార్థ స్కూల్లో నా విద్యాభ్యాసం సాగింది. మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లే! ఏ బంధువులను కలిసినా.. పిల్లల చదువులు, ఫ్యూచర్ ప్లాన్స్ ఇవే చర్చించుకునేవాళ్లు. ఇక మా బడిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవి. పిల్లల అభిరుచిని బట్టి ప్రోత్సహించేవాళ్లు. పోలీస్, ఆర్మీ రంగాల్లోనూ రాణించేలా ఫిజికల్ ట్రైనింగ్, ఫిట్నెస్ లాంటివాటిపై దృష్టి పెట్టేవాళ్లు. నాకు చిన్నప్పుడు కెరీర్ పరంగా పెద్దగా గోల్స్ ఉండేవి కావు. కాకపోతే, పెండ్లి చేసుకొని, నలుగురైదుగురు పిల్లల్ని కని, ఇంట్లో వాళ్లకు వండిపెడుతూ సంతోషంగా ఉండాలన్న ఆలోచనలు ఉండేవి. ఇంటర్లో అనుకుంటా ఓ టీవీ చానెల్ వాళ్లు ‘భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నావ్?’ అని ప్రశ్నిస్తే.. ఇదే జవాబు చెప్పాను. కానీ, మనం అనుకున్నట్టుగా జీవితం ఉండదు కదా! కుటుంబ పరిస్థితులు నన్ను యాంకర్‌గా మార్చాయి. తర్వాత నటన నా కెరీర్‌గా మారింది.
బాబు కోసం
కాలేజీ రోజుల్లోనే ఒక చానెల్ వాళ్లు యాంకరింగ్ చేయమని సంప్రదించారు. అప్పుడు ఆసక్తి లేదని ఒప్పుకోలేదు. డిగ్రీ అవ్వగానే పెండ్లి అయింది. కొన్నాళ్లకే బాబు కూడా పుట్టాడు. నేను, మా ఆయన ఇద్దరం ఉద్యోగం చేస్తే గానీ సంసారం సాఫీగా సాగదని అనిపించింది. అలాగని నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తే.. బాబును చూసుకోలేను. అప్పుడు యాంకర్‌గా ప్రయత్నించొచ్చు కదా అనుకున్నాను. గతంలో నన్ను సంప్రదించిన చానెల్ వాళ్లను అడిగిన వెంటనే.. ఒప్పుకొన్నారు. అలా 2002లో ‘యువర్స్ లవింగ్లీ’ కార్యక్రమంతో నా బుల్లితెర ప్రయాణం మొదలైంది. దాదాపు ఆరేడేండ్లు ఆ ప్రోగ్రామ్ని హోస్ట్ చేశాను. అలా తెలుగువారికి దగ్గరయ్యాను. యాంకర్‌గా ఉన్నప్పుడు రెండు మూడు గంటలు షూట్ ఉండేది. బాబును చూసుకునేదాన్ని. సీరియల్స్‌లోకి వచ్చాక కూడా.. నెలలో పదిహేను రోజులు కుటుంబంతో గడిపేలా ప్లాన్ చేసుకునేదాన్ని. కెరీర్ కంటిన్యూ చేస్తూనే చిన్నప్పటినుంచి నేను అనుకున్నట్లుగా గృహిణిగా ఉండగలుగుతున్నా!
వాళ్లకు రుణపడి ఉంటా..
నా మొదటి సీరియల్ ‘అంతఃపురం’ చేస్తున్నప్పుడు ఒక సీన్లో నేను బాగా చేయడం లేదని డైరెక్టర్ కోప్పడ్డారు. బాగా ఏడ్చేశాను. సీరియల్స్ మానేసి యాంకరింగ్‌లోనే కొనసాగాలని అనిపించింది. అప్పుడు నా తోటి నటి బాబీ లహరిగారు నా దగ్గరికి వచ్చి.. ‘ఎందుకు బాధపడుతున్నావ్?’ అని అడిగారు. ‘నేను ఇక సీరియల్స్ చేయను’ అనేశాను. ‘నువ్వు ఎక్కడ పనికిరావని అన్నారో.. అక్కడే నువ్వేంటో నిరూపించుకోవాలి’ అన్నారామె. అప్పటినుంచి కెమెరాముందు భయం లేకుండా నటించాను. ‘రాగమాధురి’ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనిపించుకున్నాను. ఆ రోజు బాబీ లహరి గారు ధైర్యం చెప్పి ఉండకపోతే.. ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా కెరీర్‌ను మలుపు తిప్పిన ‘గోరింటాకు’ సీరియల్ ఆఫర్ ఇప్పించిన విజయ్ యాదవ్ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకొన్నా తక్కువే!
ఎడిటింగ్‌లో పోయింది
కొన్నాళ్లకు ఓ ఏడాది గ్యాప్ తీసుకున్నా! మళ్లీ యాంకర్‌గా కాకుండా యాక్టర్‌గా రీఎంట్రీ ఇచ్చాను. ‘అంతఃపురం’ నా మొదటి సీరియల్. దీని తర్వాత చేసిన ‘గోరింటాకు’ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ‘మొగలిరేకులు’ నా కెరీర్లో మైల్స్టోన్ అని చెప్పొచ్చు. ఈ సీరియల్లో కీర్తన పాత్ర నాకెంతో పేరు తెచ్చింది. షూటింగ్ తర్వాత కూడా.. అదే పాత్రలో ఉండిపోయేదాన్ని. అంతలా ఆ పాత్ర నన్ను ప్రభావితం చేసింది. ఆ సీరియల్ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఏడాదికి మూడు, నాలుగు సీరియల్స్ చేసేదాన్ని. టీవీలో బిజీగా ఉన్న సమయంలోనే సినిమా అవకాశాలు కూడా పలకరించాయి. సమయాభావం వల్ల కొన్ని చేయలేకపోయాను. చేసిన కొన్ని సినిమాల్లోని సీన్లు ఎడిటింగ్‌లో పోయేవి. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. కానీ, ఎడిటింగ్‌లో పోయింది. ఇటీవల రిలీజైన ‘అమరం అఖిలం ప్రేమ’ సినిమాలో నరేష్‌గారి భార్య పాత్రలో నటించాను. మరో రెండు మూడు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. సీరియల్స్ ద్వారా టీవీకి చాలా ఇచ్చాను. ఇకనుంచి సినిమాల్లో నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్నా! కొత్త సంవత్సరంలో నా రెజల్యూషన్ ఇదే!
హ్యాపీ లైఫ్..
నటిగా ఇరవై ఏండ్ల అనుభవం నాది. నా పనులన్నీ నేనే చేసుకుంటా! బయటికి వెళ్తే… అభిమానులు చూస్తారనీ, పలకరిస్తారని మాస్కులు పెట్టుకోవడం, స్కార్ఫ్‌లు చుట్టుకోవడం చేయను. నేనే మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకుంటాను. బజారుకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటాను. ఇలా బయటికి వెళ్లినప్పుడు చాలామంది నవ్వుతూ పలకరిస్తారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా ఆయన కిశోర్ హోటల్ మేనేజ్మెంట్ చేశారు. ఫుడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ చేస్తారు. మా బాబు పేరు అలోక్. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఒక పాప కూడా ఉండి ఉంటే బాగుండనిపిస్తుంది. మా బాబు ఒక ఆర్టిస్ట్ కొడుకులా ఉండటానికి ఇష్టపడడు. అందుకే నన్ను వాళ్ల స్కూల్‌కు రానిచ్చేవాడు కాదు. కానీ, మేం ముగ్గురం కలిసి చాలా తీర్థయాత్రలు చేస్తుంటాం. ఏ మాత్రం ఖాళీ దొరికినా.. ఏయే గుళ్లు చుట్టిరావాలో లిస్ట్ రాసుకొని వెళ్లిపోతుంటాం. నా జీవితం హ్యాపీగా సాగుతున్నది. కెరీర్లో మరింత ఎత్తుకు ఎదగాలన్నదే నా కోరిక!
జీ తెలుగులో నా మొదటి సీరియల్ ‘ముత్యాల ముగ్గు’. అక్కణ్నుంచి జీ తెలుగుతో నా జర్నీ కొనసాగుతున్నది. ‘మాటే మంత్రం’, ‘త్రినయని’, ‘ఎవరే నువ్వు మోహిని’.. ఇలా చాలా సీరియల్స్ చేశాను. ప్రస్తుతం ‘జగద్ధాత్రి’ సీరియల్లో వైజయంతిగా ప్రేక్షకులను అలరిస్తున్నా. ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. కాస్త నెగెటివ్ షేడ్స్ ఉంటాయి. పైగా నా పాత్రకు చిత్తూరు యాస మరో ప్రత్యేకత. ఇటీవల తిరుపతి వెళ్లినప్పుడు కూడా చాలామంది చిత్తూరు చిలక అంటూ పలకరించారు. చాలా సంతోషంగా అనిపించింది.