2022లో ‘ఆర్ఆర్ఆర్’ నాటు దెబ్బకు.. ఇండియా అంతా షేక్ అయింది. 2023… ‘సలార్’ కటౌట్ నమ్ముకుని పర్లేదు అనిపించుకుంది. 2024 వీటన్నిటికీ మించి.. ఒకటి కాదు, రెండు కాదు.. నాలుగు పాన్ ఇండియా సినిమాలతో దుమ్మురేపింది. ‘కల్కి’ టాలీవుడ్ కోటలో హాలీవుడ్ రేంజ్‌ను చూపించింది. ‘హను-మాన్’ వసూళ్లలో జై బజరంగబలీ అనిపించుకుంది. ‘దేవర’ వారెవ్వా! చివరగా వచ్చిన ‘పుష్ప-2’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రప్ప రప్ప ఆడేస్తున్నది. ఈ 2024 విజయాలు మాత్రమే కాదు… అంతకుమించిన వివాదాలనూ ఇచ్చింది. ఎప్పటిలాగే పరాజయాలనూ సమర్పించింది. 250 పైచిలుకు సినిమాలు విడుదలైతే.. వాటిలో విజయాలు పాతికలోపే. మొత్తంగా 2024 చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సందడిని ఓసారి గుర్తు చేసుకుందాం.
Year Roundup | అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాస్తున్నది. నాన్ ‘బాహుబలి’ రికార్డులన్నిటినీ బద్దలు కొట్టి.. ‘బాహుబలి’ లక్ష్యంగా దూసుకుపోతున్నది. ‘బాహుబలి 2’ రూ.1850కోట్ల వసూళ్లతో భారత్‌లోనే రెండో స్థానంలో ఉంటే.. ‘పుష్ప-2’ రూ.1705 కోట్ల మార్క్‌ను 21రోజుల్లోనే దాటేసింది. మరి ఈ వేగం ఇలాగే కొనసాగితే.. బాహుబలి రికార్డ్ బద్దలవ్వడానికి మరెన్నో రోజులు పట్టదు. ఈ ఏడాది విడుదలైన బ్లాక్‌బస్టర్ నంబర్ 2 ‘కల్కి 2898ఏడి’. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఫ్రాంచైజీల్లో ఫస్ట్ పార్ట్ ఇంత కలెక్ట్ చేయడం ఆలిండియా రికార్డ్. ఇక ఈ ఏడాది టాలీవుడ్లో వసూళ్ల పరంగా మూడో స్థానంలో నిలిచిన చిత్రం ‘దేవర’. రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.600 కోట్ల వసూళ్లను రాబట్టి నిర్మాతకు డబుల్ ప్రాఫిట్‌ని కట్టబెట్టింది. సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది నంబర్‌వన్ హిట్. స్టార్ హీరో లేకుండా పాన్ ఇండియా రేంజ్లో రూ.350 కోట్లు కొల్లగొట్టిన సినిమా ‘హను-మాన్’. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హను-మాన్’.. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది టాప్ 4 హిట్.
ఇక పాన్ ఇండియా కాకుండా, కేవలం రెండు తెలుగు రాష్ర్టాల్లో మాత్రమే మంచి వసూళ్లను అందుకున్న బ్లాక్‌బస్టర్స్ అంటే.. ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ‘టిల్లు స్వేర్’. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో వసూళ్లపరంగా వందకోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమా ఇది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కి, దాదాపు రూ.135 కోట్ల వసూళ్లను రాబట్టి ఈ ఏడాది టాప్ 5 హిట్‌గా నిలిచింది ‘టిల్లు స్కేర్’.
ఇతర భాషకు చెందిన నటుడు తెలుగులో హీరోగా నటించి, వందకోట్ల పైచిలుకు వసూళ్లను సాధించడం దుల్కర్ సల్మాన్ విషయంలోనే జరిగింది. దుల్కర్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘లక్కీ భాస్కర్’ రూ. 110కోట్ల వసూళ్లను రాబట్టి ఈ ఏడాది టాలీవుడ్ టాప్ 6 హిట్‌గా నిలచింది. ఇక ఈ ఏడాది టాప్ 7 హిట్ అంటే నాని ‘సరిపోదా శనివారం’ సినిమానే చెప్పుకోవాలి. ఈ చిత్రం వందకోట్ల వసూళ్లను రాబట్టి, ‘దసరా’ తర్వాత నాని కెరీర్లో వందకోట్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు. ఆ విధంగా ఈ ఏడాది ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ ఏడు సినిమాలు అగ్రభాగాన నిలిచాయి.
కొందరు దర్శకుల ఆలోచనలు ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కాయి. కొత్త కథలకు ప్రేక్షకులు పట్టాభిషేకం చేశారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘కల్కి 2898ఏడి’. భాగవత, మహాభారతాలను ప్రేరణగా తీసుకొని, దానికి సైన్స్ ఫిక్షన్ని జోడించి, నాగ్అశ్విన్ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ అద్భుతంగా అలరించింది. దశావతారాల్లో చివరిదైన ‘కల్కి’ ఆగమనం కోసం ఆడియన్స్ ఎదురుచూసేలా చేసింది. సెకండ్ పార్ట్ కోసం ప్రస్తుతం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, అమితాబ్‌ల నటన గురించీ, నాగ్అశ్విన్ హాలీవుడ్ టేకింగ్ గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకున్నారు. టాలీవుడ్ ఖ్యాతిని మరోస్థాయిలో నిలబెట్టిన సినిమా ఇది.
అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై అందరికీ స్వీట్ షాక్ ఇచ్చిన సినిమా కిరణ్ అబ్బవరం ‘క’. కర్మసిద్ధాంతం నేపథ్యంలో దర్శక ద్వయం సుజిత్, సుదీప్ ఈ చిత్రాన్ని మలిచారు. తెలుగుతెరపై ఇప్పటివరకూ రాని అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.53 కోట్ల వసూళ్లను సాధించి హీరోగా కిరణ్ అబ్బవరానికి స్టార్ స్టేటస్‌ని కట్టబెట్టింది. ఈ ఏడాది వచ్చిన మరో విభిన్న కథ ‘గామి’. మాస్ హీరో విశ్వక్సేన్ చేసిన ప్రయోగం ఈ సినిమా. వింత వ్యాధితో బాధపడుతున్న ఓ అఘోరా సాహస ప్రయాణమే ఇతివృత్తంగా దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ చిత్రం క్రిటిక్స్ ప్రశంసలందుకుంది.
భాషాభేదాలకు అతీతంగా కథా బలమున్న సినిమాలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారు. అందుకే మనదగ్గర డబ్బింగ్ చిత్రాలకు ఆదరణ ఎక్కువ. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్‌లో డబ్బింగ్ సినిమాల తాకిడి మరింత ఎక్కువైంది. ఈ ఏడాది తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల నుంచి పదుల సంఖ్యలో డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో అమరన్, మహారాజ, సత్యం సుందరం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, రాయన్, తంగలాన్, భ్రమయుగం చిత్రాలు మంచి విజయాల్ని సాధించాయి. భారీ అంచనాలతో వచ్చిన సూర్య ‘కంగువా’, కమల్‌హాసన్ ‘భారతీయుడు-2’, రజనీకాంత్ ‘వేట్టయాన్’, దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్’, ఉపేంద్ర ‘యుఐ’, విజయ్ సేతుపతి ‘విడుదల-2’ చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి.
ఎడారి జీవితంలోని వ్యథలను దృశ్యమానం చేస్తూ యథార్థ కథతో రూపొందించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుకాలం’ చిత్రానికి మంచి ప్రశంసలైతే దక్కాయి కానీ బాక్సాఫీస్ బరిలో ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఈ ఏడాది 60కి పైగా అనువాద చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించగా..అందులో పది వరకు మాత్రమే మంచి ఫలితాలను సాధించాయి.
ఈ ఏడాది అగ్ర కథానాయికలను మంచి విజయాలు వరించాయి. రష్మిక మందన్న (పుష్ప-2), దీపికా పదుకొణె (కల్కి), జాన్వీకపూర్ (దేవర), మీనాక్షి చౌదరి ( ‘గుంటూరు కారం’, ‘లక్కీభాస్కర్’), శ్రీలీల (గుంటూరు కారం), అనుపమ పరమేశ్వరన్ (టిల్లు స్వేర్) సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకున్నారు. ఈ ఏడాది అగ్ర నాయికలు సాయిపల్లవి, అనుష్క, పూజా హెగ్డే తెలుగు తెరపై కనిపించలేదు. అయితే తమిళ డబ్బింగ్ చిత్రం ‘అమరన్’తో సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన స్టార్లు చాలామందే ఉన్నారు. వారిలో నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల మ్యారేజ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అని చెప్పాలి. డిసెంబర్ 5న ఈ జంట పెళ్లిపీటలెక్కింది. అలాగే అగ్ర దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రీతి చల్లా అనే డాక్టర్ని ఆయన ఈ ఏడాది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక ఈ ఏడాది అందరి దృష్టిని ఆకర్షించిన వివాహాల్లో హీరో సిద్ధార్థ్, తెలంగాణ అమ్మాయి అదితిరావు హైదరీ వివాహం ఒకటి. కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న వీరిద్దరూ ఇటీవలే వనపర్తి దగ్గర్లోని చారిత్రాత్మక దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు.
అలాగే స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా ఈ ఏడాదే తన చిరకాల స్నేహితుడు ఆంటోనీని పెళ్లాడి, వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన జంట కిరణ్ అబ్బవరం, రహస్య. వీరిద్దరూ ఈ ఏడాదే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కీరవాణి తనయుడు శ్రీసింహా, మురళీమోహన్ మనవరాలు రాగ వివాహం గురించి ఈ ఏడాది విశేషంగా చెప్పుకొన్నారు. అలాగే రకుల్ ప్రీత్‌సింగ్, జాకీ భగ్నానీల వివాహం కూడా ఈ ఏడాదే జరిగింది. వరలక్ష్మీ శరత్‌కుమార్, నికోలయ్ సచ్దేవ్లు ఈ ఏడాదే వివాహ బంధంతో ఒకటయ్యారు. నటి మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడింది కూడా ఈ ఏడాదే.
ఈ ఏడాది తెలుగు చిత్రసీమను వరుస వివాదాలు వెంటాడాయి. యువ హీరో రాజ్‌తరుణ్ మీద లావణ్య అనే యువతి చీటింగ్ కేసు పెట్టింది. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ ఇటీవలే బెయిల్‌పై బయటికొచ్చాడు. అయితే ఈ కేసు కారణంగా జాతీయ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకోవడంతో జానీ మాస్టర్ ఆవేదన చెందాడు. ఎక్స్ అకౌంట్లో ఫొటో మార్ఫింగ్ వ్యవహారంలో అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీనియర్ నటుడు మోహన్‌బాబు కుటుంబ అంతర్గత వివాదాలు ఒక్కసారిగా బయటపడటం టాలీవుడ్లో కలకలం రేపింది. మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
తన ఇంటివద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేయడంతో ఈ కేసు అనూహ్యమైన మలుపు తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తున్నది. ఇక అగ్ర నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కి గురిచేశాయి. ఈ సమయంలో సినీరంగం యావత్తు నాగార్జునకు బాసటగా నిలిచింది. ఇక ఈ ఏడాది సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించగా, ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకొచ్చారు. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్‌కు ఇండస్ట్రీ నుంచి పూర్తి మద్దతు లభించింది. అలాగే నటి కస్తూరి తెలుగువారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది టాలీవుడ్ వరుస వివాదాలతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది.