16 ఏళ్ల వయసు పిల్లలెవరూ కెరీర్ గురించి పెద్దగా ఆలోచన చేయరు. స్నేహితులతో సమయం గడపడం, చదువు మీద దృష్టిపెట్టడం, సినిమాలు, షికార్లు… ఇలాగే ఉంటుంది వాళ్ల ప్రపంచం. కానీ ప్రాంజలి అవస్తీ ఆలోచన మాత్రం చాలా భిన్నం. చిన్న వయసులోనే తన అభిరుచుల వేదికగా కెరీర్‌పై దృష్టి సారించింది. 11 సంవత్సరాల వయసులో భారత్ నుంచి ఫ్లోరిడా వెళ్లిందామె. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటన్నది బయట ప్రపంచానికి పెద్దగా తెలియని కాలంలోనే దానిలో నైపుణ్యం సంపాదించింది. 16 సంవత్సరాల వయసులో 2022లో డెల్వ్ డాట్ ఏఐ (Delv.AI) పేరుతో ఏఐ స్టార్టప్‌ను స్థాపించింది. వినూత్నమైన ఆలోచనలు, అంకితభావంతో పనిచేసి తన స్టార్టప్‌ను కేవలం రెండు సంవత్సరాలలోనే రూ.100 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీల జాబితాలో చేర్చింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డేటా ఎక్స్‌ట్రాక్షన్‌ను మెరుగుపరచడం, డేటా సిలోస్(వ్యవస్థల మధ్య సమాచార మార్పిడిని అడ్డుకునే వ్యవస్థ)ను తొలగించడం డెల్వ్ డాట్ ఏఐ చేస్తుంది. ఆన్లైన్ కంటెంట్‌కు సంబంధించి వివిధ విషయాలు అందించడంలోనూ సహాయపడుతుంది. కేవలం పదిమంది ఉద్యోగులు మాత్రమే ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఫ్లోరిడా వెళ్లిన అవస్తీ.. కంప్యూటర్ సైన్స్, గణితశాస్త్రం సబ్జెక్టులను రెండేళ్లు అభ్యసించింది. 13 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఇంటర్న్‌షిప్‌కి అడ్మిషన్ సాధించింది. ఆ ల్యాబ్‌లో పనిచేస్తున్న సమయంలోనే డెల్వ్ డాట్ ఏఐ స్థాపించాలనే ఆలోచన చేసింది. మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లో పనిచేసి డేటా గురించి విస్తృతమైన పరిశోధనలు చేసింది. డేటా అనాలసిస్, ఆన్లైన్ కంటెంట్, డేటాకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారంలో ఏఐ పాత్ర కీలకమని తెలుసుకుంది. ఆ సాధనే ఆమెకు కోట్లు తెచ్చి పెడుతున్నది. చిన్న వయసులో అద్భుతాలు సృష్టించాలని ఆరాటపడే వాళ్లకు అవస్తి మంచి ప్రేరణ అని చెప్పొచ్చు.