చర్మ సంరక్షణకు దానిమ్మ ఎంతో ఉపకరిస్తుంది. ఈ పండులో విటమిన్-సితో పాటు యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలం. దానిమ్మ గింజలు, రసం, చివరికి తొక్క కూడా చర్మాన్ని కాపాడతాయి. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు మంట, దురద, చర్మం ఎర్రబడటం తదితర ఇబ్బందులను తగ్గిస్తాయి. ఒంటిపై మచ్చలను తొలగించి, చర్మానికి సహజసిద్ధమైన మెరుపును అందిస్తాయి. దానిమ్మతో స్కిన్టోనర్ కూడా తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
అరకప్పు దానిమ్మ గింజలు, అరకప్పు నీళ్లు, ఒక గ్రీన్ టీ బ్యాగ్, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్.
ప్యాక్ తయారీ
ఒక చిన్న గిన్నెలో నీళ్లుపోసి, కొంచెం మరగనిచ్చి అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను ఓ రెండు నిమిషాలు ఉంచాలి. తర్వాత ఆ ద్రవాన్ని చల్లార్చి, టీ బ్యాగ్‌ను తీసెయ్యాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అందులో రోజ్‌వాటర్ కలుపుకోవాలి. చివరగా గ్రైండ్ చేసిన దానిమ్మ గింజలను వేసి బాగా కలపాలి.
ఆ మిశ్రమాన్ని వడగట్టి, స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఆ ప్యాక్‌ను ముఖానికి, మెడకు స్ప్రే చేసుకొని కాటన్బాల్తో మసాజ్ చేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత, చన్నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతిమంతం అవుతుంది. ఇది చవకైన, సురక్షితమైన మార్గం.