ఇటీవలి కాలంలో ‘పీసీవోఎస్’ ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు.. అంటే, 20శాతం మంది యువతులు పీసీవోఎస్తో బాధపడుతున్నట్లు తేలింది. అయితే, ఇన్నిరోజులూ దీనిని సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యగానే చూస్తున్నారు. కానీ, ఇది ఓ జీవక్రియ సమస్య అనీ, రక్తంలోని చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుకుంటే.. పీసీవోఎస్ లక్షణాలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘పీసీవోఎస్’తో బాధపడుతున్న మహిళల్లో.. దాదాపు 70% నుంచి 80% మందికి ‘ఇన్సులిన్ నిరోధకత’ ఉంటుందట. ఇలాంటివారు చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా తిన్నట్లయితే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. దాంతో, గ్లూకోజ్‌ను నియంత్రించడానికి శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయులు ఎక్కువైతే.. అది అండాశయాలను ప్రేరేపించి.. టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్లే ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలు, జుట్టు రాలడం లాంటి సమస్యలు కనిపిస్తాయి.
కాబట్టి, గ్లూకోజ్ స్థాయులు అకస్మాత్తుగా పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఇన్సులిన్ తగ్గితే.. టెస్టోస్టెరాన్ స్థాయులు కూడా తగ్గుతాయి. హార్మోన్లు సాధారణ స్థితికి వస్తాయి. ఫలితంగా, నెలసరి సమస్యలూ తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా, ఇన్సులిన్ కొవ్వును నిల్వ చేసే హార్మోన్. కాబట్టి, ఇది తక్కువగా ఉంటే.. బరువు తగ్గడం కూడా సులభం అవుతుంది. గ్లూకోజ్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు తగ్గితే.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ క్రమంలో గ్లూకోజ్ నియంత్రణకు నిపుణులు కొన్ని సలహాలు అందిస్తున్నారు. ముందుగా ఆహారాన్ని ఓ క్రమపద్ధతిలో తినడం అలవాటు చేసుకోవాలి. మొదట ఫైబర్ (సలాడ్స్/కూరగాయలు), తర్వాత ప్రొటీన్, కొవ్వు, చివరగా పిండి పదార్థాలు (అన్నం/రోటీ) తీసుకోవాలి. దీనివల్ల గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. తీపిపదార్థాలు, పండ్లను ఖాళీ కడుపుతో తినకుండా.. భోజనం తర్వాత ‘డెజర్ట్’లాగా తీసుకోవాలి. భోజనం చేసిన తర్వాత 10-15 నిమిషాలపాటు నడవాలి. దీనివల్ల కండరాలు గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి. ఇలా, రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుకుంటే.. పీసీవోఎస్ లక్షణాలు కూడా తగ్గుతాయి.