గ్రూపులు కట్టడం; గుసగుసలాడుకోవడం; గుచ్చిగుచ్చి మాట్లాడటం.. ఇలాంటివాళ్లు అక్కడక్కడా కనిపిస్తుంటారు. ఇక ఆఫీస్లు, పని ప్రదేశాల్లోనైతే.. తప్పకుండా తారసపడతారు. ఒకరి ఉన్నతిని, వారికి వస్తున్న ఆదరణ చూసి కుళ్లు కుంటారు. సూటిపోటి మాటలతో తోటి ఉద్యోగులను కావాలనే రెచ్చగొడుతుంటారు. ఇలాంటి వ్యక్తుల మధ్య ప్రశాంతంగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా.. సహనాన్ని కోల్పోకుండా ఉండాలని అంటున్నారు. మనస్తత్వశాస్త్రంలో ‘ఎమోషనల్ రెగ్యులేషన్’గా పిలిచే.. ఈ మానసిక స్థితిని సాధించడానికి కొన్ని సలహాలనూ అందిస్తున్నారు.
ఒక వ్యక్తి కోపానికి గురైనప్పుడు… ఆ భావోద్వేగం తన శరీరంలో కేవలం 90 సెకన్లు మాత్రమే రసాయనిక చర్యగా ఉంటుందట. ఆ తర్వాత కూడా కోపంగా ఉన్నారంటే.. అది వారు ఆ ఆలోచనను పట్టుకుని ఉండటం వల్లే జరుగుతుందట. కాబట్టి, మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు.. వెంటనే స్పందించకుండా ఒకటి నుంచి పది వరకు లెక్కపెట్టండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఆ 90 సెకన్లు గడిస్తే.. మీ మెదడు తార్కికంగా ఆలోచించడం మొదలుపెడుతుంది.
ఎదుటి వ్యక్తి లోపలి అశాంతి, అభద్రతాభావానికి సంకేతమే.. వారి అనుచిత ప్రవర్తన. అలాంటివారు మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే.. అది మీ తప్పు కానేకాదు. వారి వ్యక్తిత్వ లోపం మాత్రమే! అందుకే, ఎవరైనా లేనిపోని విమర్శలు చేస్తే.. అది మీ గురించి కాదనీ, వారి మానసిక స్థితి గురించేనని గుర్తించండి. వారి మాటలను వ్యక్తిగతంగా తీసుకోకండి.
మౌనం.. చాలా శక్తిమంతమైనది. మీ తప్పు లేనప్పటికీ ఎవరైనా మీపై అరిచినా, మిమ్మల్ని అవమానించేలా మాట్లాడినా.. మీరు ప్రశాంతతను కోల్పోకండి. మౌనంగా వారి కళ్లలోకే చూస్తూ ఉండండి. ఈ మౌనం.. అవతలి వ్యక్తిని అసౌకర్యానికి గురి చేస్తుంది. తను తప్పును తానే తెలుసుకునేలా ప్రోత్సహిస్తుంది. దాంతో, వారు గొడవను ఆపేసే అవకాశం ఉంటుంది.
మౌనం అనే ఆయుధం ప్రతిసారీ పనిచేస్తుందన్న రూలేం లేదు. ఇక ప్రశాంతంగా ఉండటం అంటే.. అన్నిటినీ భరించడం అనికూడా కాదు. మీ సహనానికి ఒక లైన్ గీసుకోండి. ఎదుటివారు హద్దులు దాటుతున్నట్లు అనిపిస్తే.. ఏమాత్రం ఉపేక్షించకండి. వృత్తిగత విషయాలను పక్కన పెట్టి, వ్యక్తిగతంగా దూషణకు దిగినా.. ఉన్నతోద్యోగులకు ఫిర్యాదు చేయండి. చివరగా.. మీ మానసిక ప్రశాంతత అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఉండాలి కూడా! దాన్ని మార్చేసే అధికారం, అవకాశం అవతలి వ్యక్తికి ఇవ్వకండి.