పార్కిన్సన్స్ వ్యాధి శరీర అవయవాల కదలికలకు సంబంధించిన రుగ్మతల విభాగంలోకి చేరుతుంది. శరీర భాగాలు అప్రయత్నంగా వణకడం (ట్రెమర్స్), పట్టేసినట్టు ఉండటం (స్టిఫ్నెస్), కదలికలు నెమ్మదించడం (స్లోనెస్), శరీరం పట్టుతప్పడం (ఇంబాలెన్స్) లాంటివి పార్కిన్సన్స్ ప్రధాన లక్షణాలు.
అయితే ఇవి మాత్రమే కాకుండా ఈ వ్యాధిలో ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీటిని నాన్మోటార్ లక్షణాలుగా పేర్కొంటారు. జ్ఞాపకశక్తి సమస్యలు, మానసిక సమస్యలు, కుంగుబాటు, ఆందోళన, మతిభ్రమించడం (సైకోసిస్), నిద్ర సంబంధ సమస్యలు, మూత్ర సమస్యలు, మలబద్ధకం, వాసన లోపించడం, అతిగా చెమట పట్టడం, తిమ్మిర్లు (నంబ్నెస్), నొప్పి మొదలైనవి ఉంటాయి.
సాధారణంగా 50 ఏండ్లు దాటిన వాళ్లకే పార్కిన్సన్స్ వస్తుంది. అయితే, యువకులు, కౌమార వయసువారికి కూడా ఇది రావొచ్చు. 30 ఏళ్ల లోపు వస్తే యంగెస్ట్ ఆన్సెట్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్ అని, 20 లోపే వస్తే జువనైల్ పార్కిన్సన్స్ డిసీజ్ అని పిలుస్తారు. ఏ వయసు వారికైనా ఇది రావచ్చు. కాకపోతే యువతలో ఈ వ్యాధి తలెత్తడానికి జన్యుపరమైన కారణాలు ప్రధానంగా ఉంటాయి.
చికిత్స ఉన్నప్పటికీ పార్కిన్సన్స్ను పూర్తిగా నయం చేయలేం. పైగా జీవిత కాలం పాటు చికిత్స అవసరమవుతుంది. ఈ వ్యాధికి ఇప్పుడు మందులు, ఇంజెక్షన్లు, సర్జరీ లాంటి వివిధ రకాలైన ప్రభావవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఇంకో విషయం… పార్కిన్సన్స్ వ్యాధి ప్రాణాంతకం కాదు. అయితే శరీరాన్ని ఇది అచేతనం చేస్తుంది. రోజువారీ పనులు, జీవన నాణ్యత మీద పార్కిన్సన్స్ ప్రభావం చూపుతుంది. అయితే, పార్కిన్సన్స్ బాధితుల జీవిత కాలం మాత్రం సాధారణ మనుషుల్లానే ఉంటుంది.