డయాబెటిస్.. సాధారణంగా పెద్దవారిలోనే కనిపిస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ, వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన పిల్లలను కూడా ఈ వ్యాధి పట్టి పీడిస్తున్నది. పెద్దవారిలో వచ్చే డయాబెటిస్ వేరు. పిల్లల్లో వచ్చే మధుమేహం వేరు. సాధారణంగా తల్లి నుంచి బిడ్డకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, ఇది చాలా అరుదు. 100 మంది పిల్లల్లో కేవలం 5 శాతం మందికి మాత్రమే ఇలా వచ్చే అవకాశం ఉంటుంది.
దీనినే టైప్-1 డయాబెటిస్ అంటారు. పుట్టుకతోనే కొందరు పిల్లల్లో ప్యాంక్రియాస్ గ్రంథులు సరిగ్గా పనిచేయవు. ఇలాంటి పిల్లల్లో 5 సంవత్సరాల నుంచి 15 ఏండ్లలోపు డయాబెటిస్ లక్షణాలు బయటపడతాయి. అదే పెద్దవారిలో అయితే 60 శాతం యాక్సిడెంటల్‌గా వైద్యపరీక్షలు చేసినప్పుడు వ్యాధి బయటపడుతుంది. మిగిలిన 40 శాతంమందికి లక్షణాల ఆధారంగా పరీక్షలు చేసినప్పుడు వ్యాధి బయటపడుతుంది. పిల్లల్లో డయాబెటిస్‌ను గుర్తించడం, నియంత్రించడం తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం..
పేరుకు తగినట్లుగానే డయాబెటిస్ అనేది తియ్యటి విషంలా మనిషి ప్రాణాలను తోడేస్తుంది. ఈ వ్యాధి ప్రారంభం నుంచి తీవ్రమయ్యే వరకు శరీరంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించవు. ఫలితంగా వ్యాధిని గుర్తించే వీలు ఉండదు. వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడే గుర్తిస్తే, దానిని నియంత్రించవచ్చు. అంతేకాకుండా వ్యాధి వచ్చే అవకాశాలను ముందుగానే అంచనావేసి, అది రాకుండా అరికట్టవచ్చు. చాలాసార్లు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వ్యాధి బయటపడుతుంది.
ముఖ్యంగా పెద్దవారిలో ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు గాని, లేదా శస్త్రచికిత్సలు చేసే సమయంలో గాని డయాబెటిస్ ఉన్నట్టుగా గుర్తించడం జరుగుతున్నది. అంటే వ్యాధి బయటపడే సమయానికి జరగరాని నష్టం జరిగిపోతుందన్నమాట. అందుకే దీనిని వైద్య పరిభాషలో స్వీట్ పాయిజన్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధి అందరిలో సర్వసాధారణమైపోయింది. వ్యాధి ఉన్నట్లు తెలియకపోవడం వల్ల చాలామంది రోగులు మొదటి మూడు దశలు దాటి డేంజర్ జోన్లోకి వచ్చేస్తున్నారు.
మధుమేహం అనేది శరీరంలో మూడురకాల పదార్థాలు పెరగడం వల్ల వస్తుంది. అవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. వీటినే సాధారణ చక్కెరలుగా పిలుస్తారు. ఈ పదార్థాలు మనం తినే ఆహారంలో ఉండి తీపిదనాన్ని అందిస్తాయి. సాధారణంగా శరీరం పలు రకాల సంక్లిష్ట పిండిపదార్థాలను గ్లూకోజ్‌గా మారుస్తుంది. అయితే రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి పెరగడంతో ‘ప్యాంక్రియాటిక్ బీటా’ కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. విడుదలైన ఇన్సులిన్ సమక్షంలో బీటా కణాలు శక్తిని ఉత్పన్నం చేయడానికి గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి.
ఇక ఫ్రక్టోజ్ విషయానికి వస్తే ఇది పండ్లలో, తీపి, చల్లని పానీయాల ద్వారా వస్తుంది. ఫ్రక్టోజ్ వల్ల ఊబకాయం, కాలేయంలో కొవ్వు, ఇన్సులిన్ నిల్వలు పెరుగుతాయి. సుక్రోజ్ మనం వినియోగించే సాధారణ చక్కెర. ఇది చెరుకు నుంచి తయారవుతుంది. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు ఉంటాయి. ఈ మూడు పదార్థాలు ఒక గ్రాముకు సమాన మోతాదులో క్యాలరీలు… అంటే శక్తిని విడుదల చేస్తాయి. శరీరంలో అధికంగా శక్తి విడుదల కావడంతో అది కొవ్వుగా మారి పేరుకుపోతుంది. ఫలితంగా శరీరంలోని ప్రధాన భాగాలైన గుండె, కిడ్నీలతో పాటు కండరాలకు రక్తం సరఫరా సన్నగిల్లుతుంది. అంతేకాకుండా కొవ్వు పెరిగిపోవడంతో ఊబకాయం సమస్య మొదలవుతుంది. తీపి పదార్థాల వల్ల శరీరంలో అధిక శక్తి విడుదల అవుతున్నందున ఈ వ్యాధిని చక్కెర వ్యాధి, మధుమేహం అంటారు.
ప్రధానంగా డయాబెటిస్ 2 రకాలు. అందులో ఒకటి టైప్-1 డయాబెటిస్. రెండోది టైప్-2 డయాబెటిస్. ఎక్కువ మందిలో కనిపించేది టైప్-2 డయాబెటిసే. గర్భిణుల్లో హార్మోన్ల మార్పుల వల్ల షుగర్ స్థాయులు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ విధంగా గర్భం సమయంలో డయాబెటిస్ రావడాన్ని జస్టేషనల్ డయాబెటిస్ అంటారు.
టైప్-1 డయాబెటిస్: ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే రోగి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై పొరపాటున దాడి చేసి, వాటిని నాశనం చేస్తుంది. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి శరీరంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. టైప్-1 డయాబెటిస్‌కు కచ్చితమైన కారణాలు చెప్పలేం. ఇది తల్లి నుంచి బిడ్డకు జెనటికల్గా సంక్రమిస్తుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం లేకపోలేదు.
టైప్-2 డయాబెటిస్: ఇది పెద్దవారిలో సర్వసాధారణంగా వచ్చేవ్యాధి. ప్రస్తుతం ఉన్న డయాబెటిస్ రోగుల్లో 90 శాతం మంది టైప్-2 బాధితులే. జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఇది వస్తుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమగ్రంగా వినియోగం కాకపోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుంది. అంతేకాకుండా
ఊబకాయం వల్ల కూడా ఇది సంభవిస్తుంది.
90 శాతం మంది పిల్లల్లో హఠాత్తుగా లక్షణాలతో వ్యాధి బయటపడుతుంది. రక్తంలో ఒకేసారి షుగర్ స్థాయులు పెరిగినప్పుడు ‘డయాబెటిస్ టీటో ఎసిడోసిస్’ అంటారు. డయాబెటిస్ బాధిత చిన్నారుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి.
1. షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్. ఆహారం తీసుకున్న వెంటనే పనిచేసే ఇన్సులిన్‌ను షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అంటారు. ఇది ఆహారం తీసుకున్నప్పటి నుంచి 4-5 గంటలు పనిచేస్తుంది. రోజుకు మూడుసార్లు అంటే ఉదయం అల్పహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేసిన తరువాత ఇవ్వాల్సి ఉంటుంది.
2. ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్. ఇది 8 నుంచి 12 గంటల పాటు పనిచేస్తుంది. ఇది రోజుకు రెండుసార్లు ఇస్తే సరిపోతుంది.
3. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్. ఇది 20-24 గంటలపాటు పనిచేస్తుంది. ఇది రోజుకు ఒకసారి ఇస్తే సరిపోతుంది.
రోజువారి జీవన విధానం, ఆహారపు అలవాట్ల ఆధారంగా ఇన్సులిన్ రకాన్ని సూచిస్తారు.
గతంలో అయితే పాస్టింగ్ టెస్ట్ అంటే పరగడపున, పోస్ట్‌ప్రాండియల్ టెస్ట్ అంటే తిన్న తరువాత పరీక్షలు చేసేవారు. కానీ, ఇప్పుడు కొత్త డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీనినే సీజీఎం (కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్) అంటారు. ఇది చిన్న స్టిక్కర్లా ఉంటుంది. దీనిని భుజానికి పెట్టి, ఆ డివైజ్‌కు సంబంధించిన యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. దీంతో నిరంతరం మన శరీరంలోని చక్కెర స్థాయులు రికార్డవుతాయి. ఒక్క స్టిక్కర్ 10-12 రోజులు పనిచేస్తుంది. దీని వల్ల షుగర్ ఏ సమయంలో పెరుగుతుంది, ఏ సమయంలో తగ్గుతుందో తెలుసుకోవచ్చు. ఫలితంగా మనం పిల్లలకు ఇన్సులిన్‌ను ఎప్పుడు ఇవ్వాలో అంచనాకు రావొచ్చు.
దీనిని కడుపు దగ్గర అమరుస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయులను గుర్తించి, దానికదే ఆటోమెటిక్‌గా డివైజ్ నుంచి ఇన్సులిన్‌ను శరీరంలోకి పంపుతుంది. ఉదాహరణకు షుగర్ 200 ఉంటే డివైజ్ ఆటోమెటిక్‌గా అవసరమైన మోతాదులో ఇన్సులిన్‌ను ఇస్తుంది. అయితే ఇవి కొంత ఖరీదైనవి.
ప్యాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంటేషన్: ఇందులో పూర్తిగా ప్యాంక్రియాస్‌ను మార్పిడి చేస్తారు. బీటా సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్: సాధారణంగా ప్యాంక్రియాస్‌లో మూడు రకాల కణాలు ఉంటాయి. ఆల్ఫా, బీటా సెల్స్, టీటా సెల్స్. అయితే బీటా సెల్స్ నుంచి మనకు ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ పద్ధతిలో బీటా సెల్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఈ రెండు పద్ధతులు ఇంకా ప్రయోగదశలో ఉన్నాయి.
ఇవి అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో టైప్-1 డయాబెటిస్ వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకు టైప్-1 డయాబెటిస్ అని నిర్ధారణ జరిగితే ఎలాంటి ఆందోళన చెందకుండా ముందుగా కౌన్సిలింగ్ ఇప్పించి ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చాలి. క్రికెట్ ప్లేయర్ వసీమ్ అక్రమ్ చిన్నప్పటి నుంచి డయాబెటిస్తో బాధపడుతూనే సరైన చికిత్స తీసుకుంటూ క్రికెటర్‌గా ఎదిగి, పూర్తి ఆరోగ్యంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
డా॥ గంటా సందీప్
కన్సల్టెంట్ ఫిజీషియన్
అండ్ డయాబెటాలజిస్ట్
స్టార్ హాస్పిటల్, నానక్‌రామ్‌గూడ
-మహేశ్వర్‌రావు బండారి