క్షణక్షణం
థాయ్ కేవ్ రెస్క్యూ
దర్శకత్వం: కెవిన్ టాన్కారియన్, నాట్టావుట్ పూన్పిరియా
నెట్ ఫ్లిక్స్: సెప్టెంబర్ 27 2018లో థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ యువజట్టు వైల్డ్‌బోర్స్ థామ్‌లాంగ్ నేషనల్పార్క్ గుహలోకి వెళ్లి జలప్రవాహంలో చిక్కుకుపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. గుహలో జలదిగ్బంధంలో ఉన్న 13 మందిని రక్షించడానికి రోజుల తరబడి జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రపంచమంతా ఆసక్తిగా గమనించిది. ఆ రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. పదిహేడు రోజుల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ఆటగాళ్లను రక్షించారు. ఈ సంఘటన ఆధారంగా ఇప్పటికే పలు సినిమాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. వీటికి భిన్నంగా ఓటీటీలో హీట్ పుట్టిస్తున్నది ‘థాయ్ కేవ్ రెస్క్యూ’ సిరీస్. గుహలో చిక్కుకుపోయిన పిల్లల కుటుంబాల మానసిక సంఘర్షణను ఇందులో హృద్యంగా ఆవిష్కరించారు. ఆరు ఎపిసోడ్ల సిరీస్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఒకవైపు గుహ నుంచి క్రీడాకారులను క్షేమంగా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు స్థానికులు యువకులను రక్షించడానికి అతీంద్రియ శక్తులను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో థాయ్‌వాసుల సంస్కృతి, విశ్వాసాలు ఆసక్తి కలిగిస్తాయి. ఉత్కంఠభరితంగా నిర్మించిన ఈ సిరీస్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
భయం భయం
ప్రే (హాలీవుడ్ వెబ్ మూవీ)
దర్శకత్వం: ట్రాకెన్బర్గ్, డిస్నీహాట్ స్టార్: అక్టోబర్ 7 ప్రిడేటర్ సిరీస్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి. ఆ కోవలో వచ్చిన మరో చిత్రం ‘ప్రే’. 17వ శతాబ్దంలో కథ నడుస్తుంది. కొమాంచి అనే తెగకు చెందిన ఓ యువతికి యుద్ధవిద్యలతోపాటు పురాతన వైద్యంలో ప్రావీణ్యం ఉంటుంది. తన తెగకు చెందిన మహిళలందరూ యుద్ధవిద్యల్లో ఆరితేరి దుష్టశక్తుల నుంచి రక్షణ పొందాలన్నది ఆమె ఆశయం. ఈ నేపథ్యంలో వారి గూడెంలోకి ఓ ఏలియన్ ప్రిడేటర్ అడుగుపెడుతుంది. భయానక రూపంతో బీభత్సాన్ని సృష్టిస్తుంటుంది. ఈ మిస్టీరియస్ క్రియేచర్ బారి నుంచి తన ప్రజల్ని రక్షించుకోవడానికి ఆ యువతి చేసిన సాహసాలు ఏమిటన్నదే ఈ కథ ఇతివృత్తం. ప్రిడేటర్ సినిమాలంటే యాక్షన్, గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతాయి. ‘ప్రే’ సినిమాలో గ్రాఫిక్స్ కంటే ఎక్కువగా అడవి నేపథ్యాన్ని సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు రోమాంచితులను చేస్తాయి. గతవారం ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ట్రెండింగ్‌లో ఉంది.