OTT | వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో మలయాళీలు ఎప్పుడూ ముందే ఉంటారు. థ్రిల్లర్ కథాంశాలకు కామెడీని జోడిస్తూ.. వినూత్నమైన సినిమాలను అందిస్తుంటారు. ముఖ్యంగా.. సమాజంలో జరిగే నేరాలు, సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంటారు. కథ, కథనం చిన్నదే అయినా.. స్క్రీన్ప్లేతోనే తెలియని మాయచేస్తారు. సామాన్య ప్రేక్షకుడి ఊహకు అందకుండా సినిమాలను మలుస్తారు. అలాంటి మరో థ్రిల్లర్ కామెడీ చిత్రమే.. సూక్ష్మదర్శిని. ‘రహస్యం’ అనేది ఎప్పుడో ఒకప్పుడు బహిర్గతం కావాల్సిందే! అని చెప్పే చిత్రమిది. కథలోకి వెళ్తే.. ప్రియా (నజ్రియా), ఆంటోని (దీపక్) దంపతులు. ఇరుగు పొరుగున జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉంటుంది ప్రియ.
ఈక్రమంలో చాలాకాలం కిందే ఊరు విడిచి వెళ్లిపోయిన మాన్యుయెల్ (బాసిల్ జోసెఫ్), తన తల్లికి ఆరోగ్యం బాగోలేక తిరిగి సొంతూరికి తీసుకుని వస్తాడు. తన తల్లి అల్జీమర్స్తో బాధపడుతున్నట్టు చుట్టుపక్కల వాళ్లకు చెబుతాడు. ఈ క్రమంలో ఆమె అప్పుడప్పుడూ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతుంటుంది. మాన్యుయెల్, పోలీసులు ఆమె జాడ తెలుసుకుని తీసుకువస్తుంటారు. మాన్యుయల్ వాళ్ల పక్కింట్లోనే ఉండే ప్రియ.. ఆ పెద్దావిడ ప్రవర్తనను గమనిస్తూనే ఉంటుంది. ఆమెకు అల్జీమర్స్ లేదని భావిస్తుంది. మాన్యుయెల్ ప్రవర్తన కూడా ఆమెకు అనుమానంగా తోస్తుంది.
ఇదే విషయం భర్తకు చెబితే.. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మందలిస్తాడు. ఇలా ఉండగా.. ఒకసారి తన తల్లి మళ్లీ కనిపించకుండా పోయిందని మాన్యుయెల్ చెబుతాడు. అలా చెప్పిన నాలుగు రోజులకే.. ఓ రాత్రివేళ ఆ ఇంట్లోనే అతని తల్లిని ప్రియ చూస్తుంది. మరుసటి రోజు మాన్యుయెల్ను అడిగితే.. ఆమె జాడ దొరకలేదనే చెబుతాడు. దాంతో ప్రియకు అనుమానం బలపడుతుంది. ఆ ఇంట్లో ఏదో జరుగుతున్నదనీ ఆమెకు అర్థమవుతుంది. అప్పుడు ప్రియ ఏం చేస్తుంది? ఫలితంగా ఆమెకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతున్నది? మాన్యుయెల్ తల్లి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి అల్జీమర్సే కారణమా? అనేది మిగిలిన కథ.