కొత్త లోక: చాప్టర్ 1 (చంద్ర )
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్, చందు సలీమ్ కుమార్, నిషాంత్ సాగర్, రఘునాథ్ పలెరి, విజయరాఘవన్, నిత్యశ్రీ తదితరులు
దర్శకత్వం: డామినిక్ అరుణ్
అతీంద్రియ శక్తులతో తెరపై తాండవమాడే భారతీయ ‘సూపర్ హీరో’లు చాలా తక్కువమంది కనిపిస్తారు. అందులోనూ.. స్పాట్లైట్ వేసి వెతికినా సూపర్ పవర్స్‌తో అలరించే హీరోయిన్లు కనిపించరు. ఈ లోటును భర్తీ చేస్తూ.. ‘కొత్తలోక’ చిత్రంతో ముందుకొచ్చింది మలయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి.. గత ఆగస్టులో థియేటర్లలో సందడి చేసింది. బాక్సీఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా కొల్లగొట్టి.. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. తాజాగా, జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చి.. ఇక్కడా రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తున్నది. ‘కొత్తలోక’ంలోకి అడుగు పెడితే.. చంద్ర అలియాస్ నీల (కల్యాణి ప్రియదర్శన్) అనే ఓ గిరిజన అమ్మాయి కథ ఇది.
ఆమె అతీంద్రియ శక్తులను కలిగి ఉంటుంది. తనకున్న సూపర్ పవర్స్‌తో మంచి పనులు చేస్తూ.. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఒక మిషన్‌లో భాగంగా.. త్రుటిలో శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. దాంతో పెద్దల సూచన మేరకు ‘చంద్ర’ పేరుతో బెంగళూరులో అడుగు పెడుతుంది. అక్కడో బేకరీలో పనిచేస్తూ.. రహస్య జీవితాన్ని గడుపుతూ ఉంటుంది.
ఆమె పక్కింట్లో ఉండే సన్నీ (నస్లేన్).. చంద్రతో స్నేహం పెంచుకుంటాడు. ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. అదే సమయంలో ఆ నగరంలో రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల అండతో ఓ అండర్ వరల్డ్ మాఫియా చెలరేగిపోతుంటుంది. అమాయకులను కిడ్నాప్ చేసి చంపేస్తూ.. వారి అవయవాలను అక్రమ రవాణా చేస్తుంటుంది. మరి.. తన కళ్ల ముందే జరుగుతున్న ఈ అక్రమాలను చూసిన చంద్ర ఎలా స్పందిస్తుంది? తనకున్న అతీంద్రియ శక్తులతో వారిని ఎలా ఎదుర్కొంటుంది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలు ఏమిటి? మరోవైపు చంద్ర జీవితంలోకి ప్రవేశించిన సన్నీ (నస్లేన్) జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు చంద్రకు సూపర్ పవర్స్ ఎలా వస్తాయి? ఆమె గతం ఏమిటి? తెలుసుకోవాలంటే.. ‘కొత్తలోక’ను దర్శించుకోవాల్సిందే!