కళలన్నీ లక్ష్మీ స్వరూపాలే! నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, ఇంద్రజాలం ఇవన్నీ లచ్చిందేవి కొలువుదీరినవే! సుహానీ షా ఇంద్రజాల కళతో దునియానే దున్నేస్తున్నది. మ్యాజిక్‌తో మెస్మరైజ్ చేస్తూనే.. మదిని చదివే మాయవిద్యనీ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై, అందరి సమక్షంలో.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ పాస్వర్డ్ చెప్పేసి ఆశ్చర్యపరిచింది. మరో వ్యక్తి గుండె గూటిలోని ఆలోచనలన్నీ టపీమని చెప్పేసింది. ఆ ప్రతిభతోనే అంతర్జాతీయ పురస్కారం గెలుచుకుంది. ప్రతిష్ఠాత్మక ఫెడరేషన్ ఇంటర్నేషనాలీ దేశ్ సొసైటీస్ మ్యాజిక్స్ (ఎఫ్ఐఎస్ఎం) 2025 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ‘బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్’ అవార్డు అందుకున్న సుహానీ షా ప్రస్థానమిది..
ఎవరి మనసులో మాటలు వాళ్లకే తెలుస్తాయి. బయటికి చెప్పేవరకు అవతలి వాళ్లకు అర్థం కావు. అవునా, కానీ కొందరు మాత్రం వాటిని పసిగడతారు. వాళ్లే మెంటలిస్ట్లు. అలాగే ఉన్నవాటిని మాయం చేయడం, లేనివాటిని చూపించడం మెజీషియన్ల ప్రతిభ. ఈ రెండు కళల్నీ ఏడేండ్ల ప్రాయం నుంచే ఒడిసిపట్టుకుంది సుహానీ. చిన్నప్పటి నుంచే వరుసగా షోలు చేస్తూ… ఎన్నో అవార్డులు అందుకున్నది. ఇప్పుడు ఇంద్రజాల రంగంలో ఆస్కార్ అవార్డుగా భావించే ఎఫ్ఐఎస్ఎం పురస్కారాన్ని దక్కించుకున్నది.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జన్మించింది సుహానీ. చిన్నప్పుడు టీవీలో మ్యాజిక్ షో వస్తే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయేది. ‘నేను మ్యాజిక్ నేర్చుకుంటాన’ని తండ్రిని ఎప్పుడూ అడుగుతూ ఉండేది. కూతురు ఆసక్తిని గమనించిన ఆయన చదువు మాన్పించి మరీ.. మ్యాజిక్‌లో ప్రోత్సహించారు. అలా ఏడేండ్ల వయసులోనే తొలి ఇంద్రజాల ప్రదర్శన ఇచ్చింది సుహానీ. 1997 నుంచి ఇప్పటివరకు 5,000కు పైగా ప్రదర్శనలిచ్చింది. మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అబ్రకదబ్ర అంటూ అలరించింది.
శాస్త్రీయ నృత్యరీతుల్లో భరతనాట్యం, కూచిపూడి ఎలాగో.. ఇంద్రజాలంలో మెంటలిజం, పార్లర్ మ్యాజిక్, స్ట్రీట్ మ్యాజిక్, క్లోజప్ వంటివి ఉంటాయి. ఇతరుల మనసులు చదివేసే మెంటలిజంలో పట్టు సాధించింది సుహానీ. దైనందిన జీవితంలో ఇతరుల మనసులోకి తొంగిచూసే అలవాటు లేని ఆమె.. ప్రదర్శనల వేళ మాత్రం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. తన మెంటలిజం కళతో ఆహూతుల మనసులో ఉన్న మాటలన్నీ పొల్లుపోకుండా చెప్పేసి విస్మయపరుస్తుంది. మొదట్లో మంచి మెజీషియన్‌గా ఎదగాలని అనుకుంది. కానీ, ఈ ప్రయాణంలో మెంటలిస్ట్‌గా, కౌన్సెలర్‌గా మారిపోయానని చెబుతుంది సుహానీ.
దేశదేశాల్లో లైవ్ షోలు ఇవ్వడంతోనే ఆమె ఆగిపోలేదు. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటుంది. యూట్యూబ్ చానెల్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా మాయాజాలం ప్రదర్శిస్తూ లక్షల మంది పాలోవర్లను సంపాదించుకున్నది. సోషల్ మీడియాలో తన ప్రతిభను చాటుతూనే.. యువతకు సలహాలు ఇస్తుంటుంది. సుహానీకి సెలెబ్రిటీల్లోనూ అభిమానులు ఉన్నారు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ తదితర బాలీవుడ్ స్టార్స్ సమక్షంలోనూ ఇంద్రజాలం, మెంటలిజం ప్రదర్శించి… వారిని ఆశ్చర్యపరిచింది. మరోవైపు ఫేస్బుక్, గూగుల్, టాటా తదితర దిగ్గజ సంస్థల్లో ఈవెంట్లకు హాజరవుతూ తన సత్తాను చాటుతున్నది.
మ్యాజిక్ నేర్చుకుంటానన్న సుహానీని తండ్రి ప్రోత్సహించినా… ఆమెను చాలామంది ఎగతాళి చేశారట. మ్యాజిక్ తిండి పెడుతుందా, ఆడపిల్లకు ఇవన్నీ ఎందుకని ముఖం మీదే అన్నారట. అయినా ఆమె పట్టుదలతో ఎంతోమంది దగ్గర ఇంద్రజాలంలో మెలకువలు నేర్చుకుంది. ‘నేను బడికి వెళ్లలేదు. కానీ, రకరకాల మార్గాల ద్వారా విద్యాభ్యాసం చేశాను. మ్యాజిక్ షోకు ముందు, తర్వాత స్టేజ్ వెనకాల కూర్చుని చదువుకున్న రోజులూ ఉన్నాయి. అప్పట్లో ఇంటర్నెట్ అందుబాటులో లేదు. నా చదువుకు సంబంధించి, మ్యాజిక్కు సంబంధించిన సీడీలు తెప్పించుకొని చూసేదాన్ని’ అని చెప్పుకొచ్చింది సుహానీ. కాస్త సమయం దొరికినా వివిధ రంగాలకు చెందిన కళాకారులను కలుసుకునేదామె. వాళ్లతో చాలా సమయం మాట్లాడేది. వాళ్ల అనుభవాలు, సలహాలే తనకు జీవిత పాఠాలు అంటుంది సుహానీ.
ఆడపిల్లల అభ్యున్నతిపై ఎన్నో సంగతులు చెబుతుంటుంది సుహానీ. ఎఫ్ఐఎస్ఎం అవార్డు అందుకున్న సమయంలో ఆమె చేసిన పోస్ట్ చాలా వైరల్ అయింది. ‘ఒక కల కంటే దాన్ని నెరవేర్చుకోవడం కోసం అహరహం శ్రమించాలి. మొదట్లో కష్టంగానే అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో చాలా ఆటంకాలు వస్తాయి. అవహేళనలూ ఎదురవుతాయి.. అయినా పట్టుదలగా ఉండాలి. అప్పుడే అనుకున్న కల నెరవేరుతుంది. మన జీవితంలో అద్భుతం జరుగుతుంది’ అని సుహానీ షా చేసిన పోస్ట్.. ఆమె సాధించిన విజయానికి అద్దం పడుతుంది.
మెంటలిజం, ఇంద్రజాలం సాధనతో సాధ్యమయ్యే కళలే. అవేవో సూపర్ నేచురల్ పవర్స్ కాదు. చాలామంది ఈ విషయంలో పొరబడుతుంటారు. నా దగ్గర ఇంకేవో సూపర్ పవర్స్ ఉన్నాయనుకుని, తమ సమస్యలను తీర్చమని అడుగుతుంటారు. దీన్నిబట్టి ఇంద్రజాలంపై మన ప్రజల్లో ఇంకా పూర్తి అవగాహన రాలేదని అర్థమవుతుంది. అంతేకాదు, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. పిల్లల ఆసక్తులు గమనించరు. వారిని మ్యాజిక్ తరహా విభిన్న రంగాలవైపు ప్రోత్సహించరు. పిల్లల ఆసక్తులను అర్థం చేసుకొని, చేయూతనిస్తే వాళ్లు అద్భుతాలు ఆవిష్కరిస్తారు.