సినిమా నిర్మాణం దాదాపుగా జూదమే. ఇక్కడ లాభాల సంగతి దేవుడెరుగు. పెట్టిన పెట్టుబడి రావడమే గగనం. డబ్బులు వస్తాయనే నమ్మకంతో ఎవరూ ఈ రంగంలోకి దిగరు. పోవడానికి సిద్ధపడే సినిమాలు తీస్తుంటారు. వీరిలో కొందరిదిప్యాషన్. కొందరిది డబ్బు ఎక్కువై చేసే ఫ్యాషన్. ఈ ఏడాది అప్పుడే సగం పూర్తికావచ్చింది. ఈ ఆరునెలల్లో విడుదలైన సినిమాలు 91. అందులో సరైన విజయాలు అందుకున్నవి ఏడు సినిమాలు మాత్రమే. రెండేమో కంటితుడుపు విజయాలు. మొత్తంగా ఈ ఏడాది ఫస్టాఫ్‌లో మెరుపులు కొన్నే! మిగతావన్నీ పెదవి విరుపులే!!
ఇక ఈ ఏడాది వేసవిపై ఇండస్ట్రీ చాలా ఆశలు పెట్టుకున్నది. వేసవి సెలవుల కారణంగా పిల్లలు ఇండ్లలో ఉండే సమయం కాబట్టి, కుటుంబ ప్రేక్షకులంతా థియేటర్లకు వస్తారని, తప్పకుండా వసూళ్లు బాగుంటాయని నిర్మాతలంతా ఆశించారు. కానీ, నిర్మాణాలు జాప్యం కావడంతో రావాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. విడుదలైన కొన్ని ప్రాజెక్టులు అంచనాలను అందుకోలేకపోయాయి. మొత్తం ఈ వేసవి అంతా థియేటర్లన్నీ వెలవెల బోయాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూలర్లు, ఎగ్జిబిటర్లకు ఈ వేసవి నిరాశే మిగిల్చింది.
ఈ ఏడాది విడుదలైన తొలి సినిమా ‘సైక్ సిద్ధార్థ్’. నందు, యామినీ భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వరుణ్‌రెడ్డి డైరెక్టర్. జనవరి 1న విడుదలైన ఈ సినిమా థియేటర్లను వదిలి ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలీదు. మొత్తంగా ఓ అట్టర్ఫ్లాప్తో ఈ ఏడాది మొదలైంది.
ఈ ఆరు నెలల్లో అతిపెద్ద డిజాస్టర్ అంటే ఎవరైనా ఇట్టే చెప్పే సమాధానం ప్రభాస్ ‘ది రాజాసాబ్’. జనవరి 9న సంక్రాంతి బరిలో దిగిన ఈ తొలి పందెం కోడి.. నిర్మాతలకు దారుణమైన చేదు అనుభవాన్ని మిగిల్చింది. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా హారర్ కామెడీ అడ్వంచర్‌ని నిర్మిస్తే, పెట్టిన పెట్టుబడిలో సగం కూడా నిర్మాతకు తిరిగి రాలేదని వినికిడి. అంతేకాదు, దర్శకుడు మారుతీ సైతం ఈ సినిమా పుణ్యమా అని భయంకరమైన ట్రోల్స్‌కి గురయ్యారు. ప్రభాస్ అభిమానులంతా ఆయన ఇంటికి బిర్యానీ పార్సిల్స్‌ని పంపి, విభిన్న రీతిలో అసంతృప్తి వ్యక్తం చేశారని మీడియాలో కథనాలు కూడా ప్రసారమయ్యాయి.
ఇక ఈ ఏడాది భారీ విజయంతో బోణీ కొట్టారు ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (చిరంజీవి). హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ భారీ చిత్రం రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, దాదాపు రూ.310 కోట్ల వసూళ్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. అభిమానులు తెరపై వింటేజ్ చిరంజీవిని చూసి పరవశించిపోయారు. ఒకటికి రెండుసార్లు సినిమాను చూశారు. విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక పాత్ర పోషించడం కూడా ఈ సినిమా విజయానికి గల ప్రధాన కారణాల్లో ఒకటని చెప్పొచ్చు.
సంక్రాంతి బరిలో మరో విజయం ‘అనగనగా ఒకరాజు’. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ చిత్రం వందకోట్ల పైచిలుకు వసూళ్లను సాధించి, నవీన్ పోలిశెట్టి కెరీర్లో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి-మిసెస్ పోలిశెట్టి విజయాల తర్వాత నాలుగో విజయంగా నిలిచింది. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన విషయం తెలిసిందే.
సంక్రాంతి బరిలో చివరిగా విడుదలైన కోడి పుంజు.. శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’. తొలి ఆట నుంచే పాజిజివ్ టాక్ తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్లతో మంచి విజయంగా నిలిచిందీ సినిమా. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కి అనిల్ సుంకర, సుంకర రామబ్రహ్మం నిర్మాతలు. ఈ సంక్రాంతి బరిలో పోటీగా విడుదలైన రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా అనుకున్నంత మంచి ఫలితాన్ని రాబట్టలేకపోయిందనే చెప్పాలి. మొత్తంగా ఈ ఏడాది సంక్రాంతికి అయిదు సినిమాలు పోటీ పడితే.. వాటిలో మూడు సినిమా ఘనవిజయాలను అందుకున్నాయి. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘జయ జయ జయ జయహే’ చిత్రానికి రీమేక్‌గా జనవరి నెల చివర్లో విడుదలైన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా అంచనాల మధ్య విడుదలై అనుకున్నంతగా జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. తరుణ్‌భాస్కర్, ఇషా రెబ్బా జంటగా ఏఆర్ సంజీవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. మొత్తంగా జనవరి నెలంతా కలిపి 19 సినిమాలు విడుదలైతే వాటిలో హిట్లు మూడంటే మూడే.
ఫిబ్రవరిలో మొత్తం 23 సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో ఫిబ్రవరి 6న విడుదలైన గుణశేఖర్ ‘యుఫోరియా’ సినిమా విమర్శకుల ప్రశంసలైతే అందుకున్నది కానీ, నిర్మాతలకు లాభాలు మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నదని టాక్. ఇక ఫిబ్రవరి విజయాలంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో, అజయ్‌కుమార్ రాజు నిర్మించిన ఈ చెన్నై నేపథ్య ప్రేమకథ యువతరాన్ని బాగా ఆకట్టుకున్నది. హీరోహీరోయిన్లు సంతోష్‌శోభన్, మానస వారణాసిల కెరీర్లకు బ్రేక్‌గా నిలిచింది. ఇక ఇదే నెల 27న విడుదలైన మరో విజయం శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’. పేరుకు తగ్గట్టే సినిమా ఉల్లాసంగా, ఉత్సాహం సాగింది. శ్రీవిష్ణు కెరీర్లో ఓ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.
ఇక ఈ ఏడాది మార్చిలో 9 సినిమాలు మాత్రమే విడుదలై, అన్నీ చేదు అనుభవాలనే మిగిల్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా పవన్‌కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హరీశ్‌శంకర్, పవన్ కాంబినేషన్ సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. మార్చి 19న విడుదలైన ఈ భారీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. పవన్ అభిమానులను తీవ్రమైన నిరాశకు లోను చేసింది. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 14 సినిమాలు విడుదలయ్యాయి. వీటిల్లో శర్వానంద్ ‘బైకర్’, నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’, అడివి శేష్ ‘ది డెకాయిట్’ చిత్రాలు అంచనాల మధ్య విడుదయ్యాయి. ‘బైకర్’ సినిమా కోసం హీరో శర్వానంద్ చాలా కష్టపడ్డారు. ఆ పాత్ర కోసం బరువు తగ్గి, రేసర్‌గా అద్భుతంగా నటించారు. శర్వా తండ్రి పాత్రలో డా.రాజశేఖర్ నటించారు. సినిమా కూడా విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఇక అడివి శేష్ ‘ది డెకాయిట్’ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు వందకోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ క్రైమ్ లవ్‌స్టోరీ ఆడియన్స్‌ని అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. హారర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘రాకాస’ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.
మే నెలలో 18 సినిమాలు విడుదలైతే.. వాటిల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ఇక ఈ ఏడాది ప్రథమార్థంలో చివరి నెల అయిన జూన్‌లో మొత్తం 8 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జూన్ 4న విడుదలైన రామ్‌చరణ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన తెలుగు చిత్రాలన్నింటిలోనే కాదు, సౌతిండియాలోనే ఈ ఏడాది టాప్ గ్రాసర్‌గా నిలిచింది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం కేవలం థియేట్రికల్‌గానే రూ.400 కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టింది. ఇంకా ఓటీటీ, శాటిలైట్ అంతా కలుపుకొంటే నిర్మాత వెంకటసతీశ్ కిలారుకు ఈ సినిమా మంచి లాభాలనే తెచ్చిపెట్టిందనాలి. ప్రస్తుతం ‘పెద్ది’ థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉన్నది. ఈ నెల 12న విడుదలైన సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ సినిమా మంచి ప్రయోగంగా పొగడ్తలందుకుంది. ఈ నెలలో చెప్పుకోవాల్సిన మరో విజయం సమంత ‘మా ఇంటి బంగారం’. మూడేళ్ల విరామం తర్వాత సమంత నటించిన ఈ సినిమా, ఈ నెల 19న విడుదలై భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలివారం ముగిసే లోపే రూ.50 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. నందినీరెడ్డి, సమంత కాంబినేషన్లో వచ్చిన రెండో విజయం ఇది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో ఉన్నది. ఈ నెల 20న విడుదలైన యువతరం ప్రేమకథ ‘దీవాన’ సినిమాపై పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం సినిమా థియేటర్లలో ఉంది. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి, నిర్మాతలు లాభాలతో బయటపడే అవకాశం ఉన్నది.
మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు నిజమైన విజయాలు అంటే.. మన శంకరవరప్రసాద్‌గారు, పెద్ది, అనగనగా ఒకరాజు, మాఇంటి బంగారం, నారీ నారీ నడుమ మురారి, విష్ణు విన్యాసం, రాకాస.. ఈ ఏడు సినిమాలు మాత్రమే. చివరిగా చెప్పేదేంటంటే.. సరైన కంటెంట్‌ను ఎంచుకోలేకపోవడం.. భారీ నిర్మాణ వ్యయం.. పెరిగిన పారితోషికాలు ప్రస్తుతం నిర్మాతల పాలిటి శరాఘాతాలుగా మారాయి. ఇప్పుడు జనం స్టార్డమ్ చూసి థియేటర్లకు రావడంలేదు. ‘సినిమా బాగుంది’ అన్న టాక్ విని మాత్రమే వస్తున్నారు. రానున్న ఆరు నెలల్లో భారీ సినిమాలు రాబోతున్నాయి. అవన్నీ మంచి విజయాలను సాధించి బాక్సాఫీస్‌కి ఊపిరి పోస్తే తప్ప ఇండస్ట్రీకి మనుగడ లేదు. ప్రతి నెల కనీసం ఓ రెండు సినిమాలైనా విజయాలను సాధిస్తే 2026 గౌరవప్రదంగా ముగిసినట్టవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ ఆశలన్నీ ఈ ఏడాది ద్వితీయార్థం పైనే!!