బడ్జెట్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్.. సరికొత్త ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఏఐతోపాటు అనేక ఆధునిక ఫీచర్లతో.. ‘నాయిస్ ఫిట్ ఎన్డీవర్ ప్రో’కు రూపకల్పన చేసింది. ఇందులో ఏర్పాటుచేసిన 1.5 అంగుళాల AMOLED డిస్ప్లే.. 1,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఇక వాచ్ పైభాగంలో ఏర్పాటుచేసిన టైటానియం అల్లాయ్ బెజెల్.. ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. వాచ్ ఫేస్‌లు, ఇతర సెట్టింగ్స్‌ను మార్చుకోవడానికి, నావిగేట్ చేయడానికి ఈ బెజెల్ ఉపయోగపడుతుంది.
ఈ స్మార్ట్‌వాచ్ అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్లతో ఇట్టే కనెక్ట్ అవుతుంది. ‘నాయిస్ ఫిట్’ యాప్ ద్వారా.. ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఇందులో ఉపయోగించిన 530 ఎంఏహెచ్ బ్యాటరీ… ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజుల వరకు పనిచేస్తుంది. స్టాండ్‌బై మోడ్‌లో 28 రోజుల వరకూ నిశ్చింతగా వాడుకోవచ్చు. ఇక ఫిట్నెస్, హెల్త్ ట్రాక్ కోసం అనేక ఫీచర్లు ఉన్నాయి. ఎస్పీవో2 ట్రాకర్, హార్ట్‌రేట్ మానిటర్, స్ట్రెస్ మానిటర్, స్లీప్ ట్రాకర్లాంటివి మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉంటాయి.
మరో అద్భుతమైన ఫీచర్.. ఇందులోని 2 వాట్స్ ఇన్‌బిల్ట్ టార్చ్‌లైట్! రాత్రిపూట, చీకట్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డ్యుయల్ బ్యాండ్ జీపీఎస్, ఆల్ట్ మీటర్, బారో మీటర్, కాంపాస్ లాంటి అనేక ఫీచర్లను జోడించారు. 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌తో వ్యాయామం సందర్భంగా చెమటలు పట్టినా ఏమీ కాదు. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకునేలా దీనిని రూపొందించారు. ఈ వాచ్‌ను స్ట్రావా, ఆపిల్ హెల్త్ వంటి ప్లాట్‌ఫామ్స్‌కు లింక్ చేసుకోవచ్చు. తాజా ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అనేక ఆధునిక ఫీచర్లతో వస్తున్న ఈ వాచ్ ధర.. రూ.9,999. వివిధ ఆఫర్లతో ఇంకా తక్కువకే లభిస్తున్నది.