రెండు మనసులు కలిశాకో, ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించాకో ఓ పెళ్లి జరుగుతుంది. అలా మొదలైన బంధం కలకాలం నిలబడాలనేం లేదు. గొడవలతో, వాగ్వాదాలతో నిత్య నరకమూ కావచ్చు. ఆ హింసాత్మక బంధం నుంచి బయటికి రావడం అంత తేలికేం కాదు. సమాజం ఏమనుకుంటుంది, పిల్లల పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఎలా ఉంటుంది.. ఇలా సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతాయి. దుబాయిలో స్థిరపడిన నిషా రెత్నమ్మ జీవితమే ఇందుకు ఉదాహరణ. 14 ఏళ్ల పాటు ఆ కలహాల కాపురాన్ని నెట్టుకొచ్చారు.
ఇక తనవల్ల కాదని నిశ్చయించుకుని పూర్తిగా వదులుకున్నారు. ‘ప్రతి ఒక్కరిలోనూ ఏదైనా సాధించగలిగే సత్తా ఉంటుంది. కానీ, బతుకులోని చేదు అనుభవాల వల్ల అది మరుగునపడి పోతుంది. నా పెళ్లే అందుకు ఉదాహరణ. ఆ విష వలయాన్ని ఛేదించుకుని నా నిజమైన బలాన్ని తెలుసుకో గలిగాను’ అంటారు నిష. తన జీవితానుభవాల్ని ‘హ్యాపీలీ డైవోర్స్డ్’ పేరుతో 26 నిమిషాల డాక్యుమెంటరీగా రూపొందించారు. ఇందులో వివిధ కారణాల వల్ల వివాహబంధం నుంచి బయటపడిన మహిళల మనోగతాన్ని వెలుగులోకి తెచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు తీసుకోవడం వల్ల
మహిళలకే కాదు, పిల్లలకూ మంచిదే అంటున్నారు నిష.