ఈతరం అతివలను ఆకర్షించేలా కొత్తకొత్త డిజైనర్ నగలు వస్తూనే ఉన్నాయి. ఆధునిక హంగులతో ఎన్ని ఆభరణాలు రూపుదిద్దుకుంటున్నా… ప్రాచీన నగల ప్రాధాన్యతే వేరు! సంప్రదాయాన్ని మేళవించుకున్న నయా నగలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతూనే ఉంది. అలాంటి ట్రెడిషనల్ నగల్లో ఒకటి బోహో జువెలరీ. బోహీమియన్ జీవనశైలి నుంచి ఉద్భవించిన బోహో ఆభరణాల విశేషాలేంటో తెలుసుకుందాం..
19వ శతాబ్దిలో పారిస్ వీధుల్లో పుట్టిన కల్చర్ బోహీమియన్. ప్రకృతి ప్రసాదించే సహజ వనరుల నుంచి రూపొందించిన ఆభణాలు ధరిస్తుండేవారు. కలప, పూసలు, పెంకులు, ఈకలు, రాళ్లు, ఇతర లోహాలతో తయారుచేసిన నగలు ఇష్టంగా వేసుకునేవారు. అవే బోహో జువెలరీగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు అవే.. సరికొత్త డిజైన్లలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.
లేయర్డ్ నెక్లెస్లు, స్టాకింగ్ బ్రేస్లెట్లు, పెద్ద సైజు చెవిపోగులు వీటిలో ప్రధానంగా ఆకట్టుకుంటున్నాయి. పగడాలు, గవ్వలు, ఎంబ్రాయిడరీ జోడించిన నగలు మరింత ఆకర్షణీయంగా అలరిస్తున్నాయి. పువ్వులు, ఆకులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఖగోళ వింతలూ అన్నీ పొందికగా కుదురుకొని ఉన్న బోహో నగలను చూడగానే ‘అహో!’ అనాల్సిందే! వీటిలో భారీ కంఠాభరణాలు, పెండెంట్లు, ఉంగరాలూ ఉన్నాయి. సముద్రంలో దొరికే ఆల్చిప్పలు, గవ్వలతో రూపొందినవి బీచ్వేర్ నగలుగా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఎకోఫ్రెండ్లీ నగలుగా మంచి పేరు మూటగట్టుకున్న బోహో జువెలరీని మీరూ ఓసారి ట్రై చేయండి.