కాస్ట్యూమ్ డిజైనర్‌గా నీరజా కోన తెలుసు కదా! వంద సినిమాలకు పైగా ఆమె పనిచేసిన సంగతీ తెలుసు కదా!! డైరెక్టర్‌గా కొత్త అవతారం ఎత్తిన ముచ్చటా తెలిసిందే! డిజైనర్‌గా మారడానికి ముందు, తర్వాత ఆమె ప్రస్థానం దగ్గరివారికే తెలుసు. డైరెక్టర్‌గా మారాలనుకోవడం,అందుకోసం ఆమె రాసుకున్న కథల గురించి కొద్దిమందికే ఎరుక! మెగాఫోన్ పట్టుకున్న తర్వాత అందరికీ తెలిసినా.. అంతకుముందు జరిగిన కథను నీరజా కోన ‘జిందగీ’తో పంచుకున్నారిలా..
నేను హయ్యర్ ఎడ్యుకేషన్ అమెరికాలో చదివాను. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ చదివాను. మాస్టర్ డిగ్రీ కోసం శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాను. ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చంటైజింగ్ (ఎఫ్ఐడీఎం)లో చదివాను. మైఖేల్ సోర్స్ కంపెనీలో మూడేళ్లపాటు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత ఫ్యాషన్ మీద ఆసక్తితో ఇంకా చదువుకోవాలనిపించింది. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో చేరి ‘విజువల్ మర్చంటైజ్ ప్రోగ్రామ్’ ఏడాది కాలం చదివాను. లండన్‌లో జ్విలెన్బర్గ్ అనే స్వీడిష్ డిజైనర్ దగ్గర కొంతకాలం పని చేశాను.
విదేశాల్లో చదువు, ఉద్యోగం వల్ల పేరెంట్స్‌కి పదేండ్లు దూరంగా ఉన్నాను. మా వాళ్లతో కలిసి ఉండాలని ఇండియాకి వచ్చేశాను. ఇక్కడికి వచ్చాక కూడా ఫ్యాషన్ రంగంలోనే పని చేయాలనుకున్నాను. ముంబయిలోని ఓ కంపెనీలో జాబ్ వచ్చింది. అమ్మానాన్నల్ని మళ్లీ వదిలిపోలేక.. ఇక్కడే (హైదరాబాద్‌లోనే) ఉద్యోగ ప్రయత్నం చేశాను. అప్పుడు మా అన్నయ్య (కోన వెంకట్).. ‘సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేయొచ్చు కదా’ అని సలహా ఇచ్చాడు. సరే, ఫ్యాషన్ ఫీల్డ్ మీద నాకున్న ఇష్టం, అవగాహన, అనుభవంతో సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాను.
ఇంట్లో అందరితో కూర్చుని చర్చించాను. ఇండస్ట్రీలోకి రావడానికి మావాళ్లను కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఎక్కడైనా కష్టపడి నేర్చుకునే మనస్తత్వం నాది. నాపై నాకు నమ్మకం ఉంది. నేను చేయగలననే ధైర్యం ఉంది. కానీ, మావాళ్లకు సినిమా రంగం తెలియని ప్రపంచం. వెంకట్ అన్న రైటర్. దాన్ని మించి ఇంకేమీ లేదు. సెట్స్‌లో అందరితో డీల్ చేయాల్సిన అవసరం లేదు. నా పని అలా కాదు. అందరితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి నా గురించి ఆలోచించారు. నాకు సెట్ అవుతుందా? కాదా? అని సందేహించారు. చివరికి నా నమ్మకమే నిజమైంది.
మా అన్నయ్య సిఫారసుతో బాద్షా సినిమా కోసం ైస్టెలింగ్, కాస్ట్యూమ్ డిజైనర్‌కి అసిస్టెంట్‌గా చేరాను. నాలుగు సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేశాను. నా టాలెంట్‌కి తగ్గ అవకాశం తొందరగానే వచ్చింది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ అవకాశం వచ్చింది. సోలో చాన్స్ ఈ సినిమాకు ముందొచ్చినా ఆ తర్వాత అవకాశం వచ్చిన సినిమా ‘అత్తారింటికి దారేది’ ముందుగా విడుదలైంది. వెండితెరపై నేను పరిచయమైంది ఈ సినిమాతోనే. సమంతకు తగినట్టుగా కాస్ట్యూమ్ డిజైన్ చేశాను. అప్పటి నుంచి సమంతతో జర్నీ స్టార్ట్ అయింది.
ఆమె సినిమాలన్నిటికీ నేనే ైస్టెలిస్ట్ని. మా ఇద్దరి మధ్య సినిమా బంధమే కాదు స్నేహబంధమూ ఉందిప్పుడు! ‘అత్తారింటికి దారేది’ విడుదలైన తర్వాత ఇండస్ట్రీలో మంచి పేరొచ్చింది. త్రివిక్రమ్ గారు ఆ తర్వాతి సినిమాల్లోనూ నాకు అవకాశం ఇచ్చారు. రెండు సినిమాలకు పని చేసిన తర్వాత ఆఫర్లు వచ్చాయి. ఆ ఏడాదిలో పదమూడు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశాను. అందరూ పెద్ద డైరెక్టర్లే! అన్నీ పెద్ద సినిమాలే. రభస, రామయ్యా వస్తావయ్యా లాంటి మంచి సినిమాలున్నాయి. నితిన్, సమంత, నానికి చాలా సినిమాలకు పని చేశాను. గుర్తింపు, పరిచయాలు, స్నేహాలు, అవకాశాలు.. ఏడాదిలో సీన్ మారిపోయింది!
రాయడం ఎప్పటి నుంచో ఉన్న ఇంట్రస్టే. ఇంగ్లిష్ పోయెట్రీ రాస్తాను. ‘వేవ్స్, సౌండ్ అండ్ మ్యాజిక్’ పేరుతో నా పోయెట్రీ బుక్ వచ్చింది. ఎనిమిదేండ్ల క్రితం.. సినిమా కోసం ఒక కథ రాశాను. దానిని ఎవరికీ చూపించలేదు, వినిపించలేదు. ఆ కథ మూలనపడింది. లాక్డౌన్ సమయంలో మళ్లీ సీరియస్‌గా రాయడం మొదలుపెట్టాను. అయిదు కథలు రెడీ చేసుకున్నాను. వాటిని నా స్నేహితులకు వినిపించాను. వాళ్ల ఒపీనియన్ తీసుకున్నాను. రెండేండ్ల క్రితం.. సిద్ధూకి ఓ కథ చెప్పాను. కథ విన్నాక సినిమా చేయడానికి ఓకే అన్నాడు. ఆ సినిమా ఈ మధ్యే ‘తెలుసు కదా’ పేరుతో రిలీజైంది. చాలామంది బాగుందన్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచి టాక్ వచ్చింది. ఏదీ అందరికీ నచ్చాలని లేదు. నచ్చిన వాళ్లకు బాగా నచ్చింది. నచ్చని వాళ్లకు కొంచెం కష్టంగా అనిపించింది.
సినిమాకు డైరెక్టర్‌గా చేయక ముందు, చేసిన తర్వాత సినిమా కథను రాయడంలో మార్పు వచ్చింది. చేసే పని అర్థమైంది. కాబట్టి ఎలా రాస్తే బాగా పని చేయడానికి అనుకూలంగా ఉంటుందో అలా రాసుకుంటున్నాను. నేను రాసుకున్న కథలు అన్నీ అర్బన్ స్టోరీస్. నాకు తెలిసిన, నేను చూసిన, నేను వచ్చిన సొసైటీకి సంబంధించిన కథలే రాసుకున్నాను. డైరెక్టర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించాలంటే.. మొదట హీరోలను, నిర్మాతలను ఒప్పించాలి. కథలు వినడంలో, సినిమా చాన్స్ ఇవ్వడంలో ఆడవాళ్లనే చిన్నచూపు సినిమా ఇండస్ట్రీలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. అలాంటి అనుభవం నాకు ఎదురుకాలేదు. కథ చెప్పే పద్ధతిని బట్టి వింటారు. మనలో కాన్పిడెన్స్ ఉండాలి. అప్పుడే వినేవాళ్లు వింటారు, అవకాశాలూ ఇస్తారు. ఇప్పడు నా దగ్గర ఏడు కథలున్నాయి. ఇవన్నీ సినిమా కోసం రాసుకున్నాను. అన్నీ స్క్రీన్‌ప్లే దాకా వచ్చాయి. నితిన్‌తో ఒక సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం చేతిలో రెండు సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి. నేను రాసే కథలో కొత్త పాయింట్ చూపించే ప్రయత్నం చేస్తాను. రియలిస్టిక్‌గా చూపించాలనుకుంటాను. విభిన్నంగా ఉండే సబ్జెక్టులు ఎంచుకుంటాను. అనుకున్నట్టుగా తెరపై చూపించగలననే కాన్ఫిడెన్స్ నాకుంది.
ఏమీ తెలియని వాతావరణంలో పని చేయడానికి సిద్ధపడ్డాను. ప్రతీది కొత్తగా అనిపించేది. మొదట్లో బాగా కష్టపడ్డాను. అప్పటికి పదహారేళ్లపాటు ఇండియాలో లేను. దాంతో ఇక్కడంతా కొత్తగా అనిపించేది. మెల్లగా నిలదొక్కుకున్నాను. కాస్ట్యూమ్ డిజైనర్‌గా వంద సినిమాలకు పనిచేసినా ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంటుంది. కొత్తగా నేర్చుకుంటూనే పనిచేయాల్సి వస్తున్నది. నాది అన్నీ వచ్చనే మనస్తత్వం కాదు. నేను నిలదొక్కుకోవడానికి అదే హెల్ప్ అయిందేమో!
-నీరజ కోన
నేను అన్ని జానర్లలో సినిమాలు చూస్తాను. కానీ, లవ్ స్టోరీస్, డ్రామా మూవీస్ బాగా ఇష్టపడతాను. అలాగే డైరెక్టర్‌గా అన్ని జానర్లలో సినిమాలు చేస్తాను. లవ్ స్టోరీ, మైథాలజీ, యాక్షన్.. ఇలా డిఫరెంట్ సినిమాలు చేయాలని ఉంది. పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ అనే తేడా లేకుండా ఓటీటీల కోసం వెబ్‌సిరీస్‌లూ చేస్తున్నారు. నేను కూడా అంతే! కంటెంట్ బాగా వస్తుందనుకుంటే ఓటీటీకి కూడా పనిచేస్తాను.
-నాగవర్ధన్ రాయల