నేషనల్ డిఫెన్స్ అకాడమీ.. భారత ఆర్మీకి సుశిక్షితులైన సైన్యాన్ని అందిస్తుంది. మూడేండ్లపాటు కత్తిమీద సాములా సాగే ట్రైనింగ్‌లో క్యాడెట్లు బ్రహ్మాస్ర్తాల్లా తయారవుతారు. ఆ తర్వాత వారి వారి సామర్థ్యాలను బట్టి త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలు అందిస్తారు. ఇప్పటివరకు ఎన్డీఏ నుంచి పురుషులు మాత్రమే రొమ్ము విరుచుకొని సైన్యంలో చేరేవాళ్లు. మొదటిసారిగా అతివలు తలెత్తుకొని దేశసేవకు కదం తొక్కుతున్నారు. ఎన్డీఏ 148వ బ్యాచ్‌లో మొదటిసారిగా మహిళా క్యాడెట్లు శిక్షణ పొందారు. 17 మంది యువతులు సర్వశక్తిమంతులై.. ఈ నెల 30న జరగనున్న పాసింగ్ పరేడ్‌లో ‘జై హింద్’ అని నినదించనున్నారు. ఎన్డీఏలో రాజుకున్న ఈ అగ్గిరవ్వలు.. సైన్యంలో చేరాలని కలలు కంటున్న ఎందరో యువతులకు ఆదర్శం.
సైన్యంలో చేరడానికి ఎన్డీఏ దగ్గరి దారని చాలామంది నమ్మకం. మూడేండ్లు కష్టపడితే.. దేశసేవకు అంకితమవ్వాలన్న తమ కల నెరవేరుతుందని భావిస్తారు. అందుకే, ఎన్డీఏ నోటిఫికేషన్ రాగానే లక్షల కొద్దీ అప్లికేషన్లు వచ్చిపడుతుంటాయి. లక్షల్లో వందల మంది మాత్రమే శిక్షణకు ఎంపిక అవుతారు. మూడేండ్ల ట్రైనింగ్‌లో విద్యాబుద్ధులతోపాటు ఆర్మీకి కావాల్సిన అన్ని రకాల శక్తియుక్తులనూ ఒంటబట్టిస్తారు ఇక్కడి ట్రైనర్లు. ఇక్కడ ఉండే కఠిన నియమావళి, కఠోర సాధనకు వెరచి వెన్నుచూపే వారూ ఉంటారు. ప్రతి బ్యాచ్‌లో నలుగురైదుగురు ఇలా మధ్యలోనే ట్రైనింగ్ నుంచి వెళ్లిపోతుంటారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఎన్డీఏకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకునేవారు. యువతులను కూడా ఎన్డీఏ పరీక్షకు అనుమతించాలని 2021లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ఎన్డీఏకు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అనుమతించింది. అలా 2022లో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రెన్స్ కోసం సుమారు 1.78 లక్షల మంది యువతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,002 మంది రాత పరీక్ష రాశారు. చివరికి 125 మంది శిక్షణకు ఎంపికయ్యారు. వీరిలో నలుగురు వివిధ కారణాల వల్ల మధ్యలోనే వెళ్లిపోయారు. 121 మంది శిక్షణ తీసుకుంటున్నారు. మొత్తంగా 148వ బ్యాచ్‌కు చెందిన 17 మంది క్యాడెట్లు మే 30న పాసింగ్ పరేడ్‌లో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం ఎన్డీఏలో దేశంలోని 17 రాష్ర్టాల నుంచి 121 మంది మహిళలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వీరిలో హరియాణా నుంచి అత్యధికంగా 35 మంది ఉన్నారు. తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 28, రాజస్థాన్ నుంచి 13, మహారాష్ట్ర నుంచి 11 మంది అతివలు ఉన్నారు. దక్షిణాది రాష్ర్టాల్లో కేరళ నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ఒకరు ఎన్డీఏలో ఉన్నారు. అకాడమీ నుంచి పట్టభద్రులైన వారిలో హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన క్యాడెట్లు పాసింగ్ పరేడ్‌లో మెరవనున్నారు. ఈ పదిహేడు మందిలో తొమ్మిది మంది ఆర్మీలో చేరుతుండగా, ఐదుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో, ముగ్గురు నౌకాదళంలో సేవలు అందించనున్నారు.
డిఫెన్స్ అకాడమీలో రాటుదేలిన హరియాణాకు చెందిన హర్సిమ్రన్ కౌర్ నేవీలో చేరుతున్నారు. ‘మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్‌లో ఉన్నందుకు గర్వంగా ఉంది. మా జూనియర్ క్యాడెట్లకు ఉన్నత ప్రమాణాలు సెట్ చేయాలని మా ట్రైనర్లు తరచూ చెబుతుండేవారు. అందుకోసం మేం నిరంతరం శ్రమించేవాళ్లం’ అని చెప్పుకొచ్చారు. సిమ్రన్ తండ్రి భారత సైన్యంలో హవల్దార్‌గా పనిచేసేవారు. ఆమె తాత కూడా సైన్యంలో పనిచేసిన వారే! అందుకే, చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని పట్టుదలగా ఉండేది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా తన కల నెరవేరిందని అంటారు సిమ్రన్. 148వ బ్యాచ్‌లో 300 మందికిపైగా పురుషులు కూడా శిక్షణ తీసుకున్నారు. ట్రైనింగ్‌లో మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం ఉండదని పేర్కొన్నారు మరో క్యాడెట్ రితుల్. ‘అందరికీ ఒకేరకమైన సాధన ఉంటుంది. మహిళలు అని సున్నితంగా చూడటం ఉండదు. ఎవరైనా సరే ఇచ్చిన టాస్క్ పూర్తి చేయాల్సిందే. ఈ క్రమంలో కొన్నిసార్లు చాలా ఒత్తిడికి గురయ్యేదాన్ని. సైన్యంలో చేరాలన్న ఆశయం మళ్లీ ముందుకు నడిపించేది’ అని చెప్పుకొచ్చారు రితుల్.
2021లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడటంతోనే ఎన్డీఏలో చేరాలని బలంగా ఫిక్సయ్యాను అంటారు ఈషిత. ‘మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకునే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను. ఎన్డీఏ నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. ఈ శిక్షణలో తోటి క్యాడెట్లతో బలమైన బంధం ఏర్పడింది. మొదటి మహిళా బ్యాచ్ కావడం మరింత గర్వకారణంగా ఉంది. మూడేండ్లపాటు భుజం భుజం కలిపి శిక్షణ తీసుకున్నాం. శారీరకంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా మనోబలంతో వాటిని అధిగమించాం. నిరంతర సాధన మాకు శారీరక పటుత్వాన్ని, మానసిక ధైర్యాన్ని ఇచ్చాయి’ అంటారు ఈషిత.
ఎన్డీఏ నుంచి బయటికి వస్తున్న ఈ స్పెషల్ 17 మంది.. కెరీర్లో సాధించే విజయాలు వారి వ్యక్తిగతం కావొచ్చు! కానీ, ఈ పదిహేడు మంది వేసిన ముందడుగు.. మరెందరో ఆడపిల్లలను భారత సైన్యంలో ప్రవేశించే దిశగా ప్రేరేపిస్తుంది అనడంలో సందేహం లేదు. సరిహద్దుల్లో ఈ అగ్గిబరాటాలు చిందించే నిప్పురవ్వలు.. మనదేశంలోని మారుమూల పల్లెల్లో ఆడుకుంటున్న చిన్నారుల్లోనూ ఒక కొత్త ఆశయాన్ని చిగురింపజేస్తాయి కదూ!