ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్, జెప్టో.. నగరవాసి నేస్తాలు. పల్లె ప్రజలకు మాత్రం ఇవి అర్థం కాని పదాలు. పట్నంలో బతికేవారికే సౌలత్లు! పల్లెకు పోతే.. ఈ-కామర్స్ జాడ వెతికినా దొరకదు. వారికేం కావాలన్నా బజారులో ఉండే పచారీ కొట్టుకు దారితీయాల్సిందే! ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయాలని సంకల్పించింది సూర్యదేవర నాగశృతి. మెట్రో నగరాలకే పరిమితమైన ఈ-కామర్స్ వేదికను పల్లెసీమకూ పరిచయం చేయాలనుకుంది. కోరుకున్న వెచ్చాలన్నీ క్షణాల్లో ఇచ్చేలా ‘డొసైల్ కార్ట్’ పేరుతో ఆన్లైన్ అంగడిని అందుబాటులోకి తెచ్చింది. బడా వ్యాపార సంస్థలతో పోటీపడుతూ గ్రామాల్లో ఈ-కామర్స్ సేవలను అందిస్తున్న డొసైల్ కార్ట్ సహ వ్యవస్థాపకురాలు నాగశృతి స్టార్టప్ స్టోరీ ఆమె మాటల్లోనే..
మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. మా ఆయన సూర్యదేవర క్రాంతికుమార్ చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తారు. ఆయనతోపాటు నేనూ ఆర్థికరంగంలో స్థిరపడాలనుకున్నా. సీఏ కోసం కుస్తీ పట్టి.. అనివార్య కారణాలతో మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తర్వాత అమెరికాలో భారీ డిమాండ్ ఉన్న పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ అకౌంటింగ్ చదివాను. కోర్సు పూర్తయ్యాక విదేశాల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ, డాలర్ల వేటలో పడకుండా ఆంత్రప్రెన్యూర్‌గా ఎదగాలని కోరుకున్నా. పదిమందికీ ఉపాధి కల్పించాలని భావించా. ఇందుకోసం రెండేండ్లు పరిశోధించాను. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు.. ఈ కామర్స్ రంగంలో ఉన్న వ్యాపార అవకాశాలను తెలియజేశాయి. ప్రస్తుతం ఉన్న ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో లోపాలను అధిగమించేలా మావారితో కలిసి ‘డొసైల్’ పేరుతో కొత్త వేదికను ఆవిష్కరించాం. దీని ద్వారా గ్రామాలు, పట్టణాల్లో వస్తువులు డెలివరీ చేస్తున్నాం.
ఆన్లైన్ వేదికల ద్వారా కొనుగోలు చేయాలంటే కొన్ని పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా ధరలు అధికంగా ఉంటాయి. మన అవసరానికి తగ్గట్టుగా, పేద, మధ్యతరగతి వ్యక్తులు కొనుగోలు చేసేలా కస్టమైజ్డ్ పరిమాణం ఉండదు. అందుకే, మా ప్లాట్ఫామ్లో 50 గ్రాములు మొదలుకుని పెద్దమొత్తం వరకు అన్ని పరిమాణాల్లో స్టాక్లిస్ట్ పొందుపరిచాం. ఆర్డర్ చేసిన వస్తువులు వేగంగా సరఫరా చేయడానికి బలమైన లాజిస్టిక్ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాం. మా యాప్ ప్రారంభించిన ఏడాదిన్నరలోనే గ్రామీణ ప్రాంతాలు, టైర్- 2 నగరాలకు కూడా సరుకులను డెలివరీ చేస్తున్నాం. సాధారణ కిరాణాషాపులు, సూపర్ మార్కెట్ల కంటే తక్కువ నిర్వహణ, మెరుగైన సేవలు, నాణ్యతతో కూడిన 1,500కు పైగా వస్తువులు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా పండించే పప్పులు, ఇతర ధాన్యాలను సేకరించి, వాటిని ప్రాసెసింగ్ చేసి, సొంత ప్యాకింగ్‌తో అందుబాటులో ఉంచుతున్నాం.
మా ఆయనకు సిద్దిపేటతో ఆత్మీయ అనుబంధం ఉంది. ఏ కొత్త వ్యాపారమైనా అక్కడినుంచే మొదలుపెడతాం. ప్రస్తుతం ఆయన సిద్దిపేటలోనే చార్టెడ్ అకౌంటింగ్ సేవలను అందిస్తున్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం కావడంతో అందరిలానే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినా… కొంత వైవిధ్యంగా ఉండాలని ఆంత్రప్రెన్యూర్‌గా అవతారమెత్తాను. ఈ-కామర్స్ సేవలను మరింత సులభతరం చేయడం లక్ష్యంగా డొసైల్తో పనిచేస్తున్నా!
ప్రస్తుతం ఇన్వెంటరీ లేకుండా చాలా సంస్థలు డెలివరీ సేవలను అందిస్తున్నాయి. దీంతో మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలకు వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అందుకే నేరుగా కస్టమర్లకు అందించేలా ప్రొక్యూర్, మార్కెటింగ్, డెలివరీతో డొసైల్ కార్ట్ పనిచేస్తున్నది. బుక్ చేసుకున్న 10 నిమిషాల్లో వస్తువులను డెలివరీ చేసేలా స్టోర్లను నెలకొల్పుతున్నాం. రూ.500 విలువచేసే కొనుగోళ్లపై కనీసం రూ.50-80 ఆదా చేసుకునేలా సరసమైన ధరలకు వస్తువులు విక్రయిస్తున్నాం. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో 14 డొసైల్ స్టోర్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. రానున్న ఏడాదిలో 300 దాకా నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాం. ఒక్కోస్టోర్ ద్వారా కనీసం 60 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా 18 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ కామర్స్ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాం.
ప్రస్తుతం లక్షల్లో ఆర్థిక వనరులను సమర్థంగా నిర్వహిస్తున్న మహిళా సంఘాలను ఈ కామర్స్ రంగంలోకి తీసుకువచ్చేలా ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. ఇందుకోసం మొదటి దశలో టైర్-2 నగరాల్లో ఉండే మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నాం. ఆయా సంఘాల్లో ఉండే మహిళల ఇంటి అవసరాలకు సరిపోను నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తూనే, సంఘం తరఫున ఆంత్రప్రెన్యూర్‌గా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నాం. ఫ్రాంచైజీ ద్వారా ఈ సేవలను విస్తరిస్తున్నాం. వరంగల్ జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టుకు అనూహ్య స్పందన వస్తున్నది. గిరాకీని బట్టి ప్రోత్సాహకాలు, ఫిక్స్డ్ ఇన్‌కం వంటి సదుపాయాలూ కల్పిస్తున్నాం.
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో డొసైల్ కార్ట్ యాప్ అందుబాటులో ఉంది. మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే 40వేలకుపైగా యూజర్లను పొందాం. ఇందులో 60-70 శాతం వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మా టర్నోవర్ రూ.4.5 కోట్లకు చేరింది. ఏడాది నాటికి రూ.45 కోట్లు అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇప్పటికే బడా ఉత్పత్తిదారులు కూడా డొసైల్తో తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏడాదిలోపు పూర్తిస్థాయిలో స్టోర్లను తీసుకువచ్చి ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్)లో నవ శకానికి నాంది పలుకుతాం.