Usha Mulpuri | మనకు నాలుగేండ్లు ఉన్నప్పుడు అమ్మచేతి వంట తింటాం. చాలా రుచికరంగా ఉంటుంది. ఇరవై నాలుగేండ్లు వచ్చాక తిన్నా అదే అనుభూతి.నలభై ఏండ్లు వచ్చినా ‘ఆహా! ఏం రుచి’ అనిపిస్తూనే ఉంటుంది.అలాంటప్పుడు, ఆ రుచిని నలుగురికీ పరిచయం చేయడానికి అమ్మకు మాత్రం వయసుతో సంబంధం ఏం ఉంటుంది? అందుకే, ఆ అమ్మ పిల్లలకు పెండ్లిళ్లు చేశాక, ఆమె తన సొంత వంటశాలను ప్రారంభించారు. ఇరవై ఏండ్ల నాటి కలను ఇప్పుడు నిజం చేసుకున్నారు. సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినా, కథానాయకుడు నాగశౌర్య తల్లిగా గుర్తింపు ఉన్నా… పాకశాస్త్ర ప్రయోగాలే తనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్నాయని చెబుతున్నారు ఉషా ముల్పూరి.
ఈ రోజుకు కూడా ఎప్పుడు వంటచేసినా ఇదే నా తొలివంట అన్నంత ఇష్టంగా చేస్తా. ఇంట్లోవాళ్లు, స్నేహితులు కూడా తిన్న ప్రతిసారీ బాగుందని చెబుతూనే ఉంటారు. అలా చెప్పినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతూనే ఉంటుంది. నిజంగా నాకు అదే అతిపెద్ద ప్రేరణ.
భారతీయ సంస్కృతిలో కళలు అరవై నాలుగని చెబుతారు. అందులో వంట కూడా ఒకటి. చిత్రకారుడు అందమైన బొమ్మలు ఎలా గీస్తాడో, రచయిత చక్కటి కథలు ఎలా రాయగలడో.. అచ్చంగా అలానే వంట కూడా. ‘మీకు వంట ఎవరు నేర్పారు?’ అంటే నేను చెప్పలేను. ‘ఈ రెసిపీ ఎవరిదీ’ అంటే నా దగ్గర కచ్చితమైన సమాధానాలు ఉండవు. అవన్నీ నేను సొంతంగా చేసుకున్నవే. నాకు నేనుగా నేర్చుకున్నవే. నా వంటశాలకు ‘ఉషా ముల్పూరీస్ కిచెన్’ అని నా పేరే పెట్టుకోవడం వెనుక కారణమూ అదే. ఇలా ఓ వంటశాల పెట్టి.. నా వంటల్ని నలుగురికి రుచి చూపించాలనే ఆలోచన మాత్రం ఇరవై ఏండ్ల క్రితమే వచ్చింది.
మాది ఏలూరు. నాన్న లెక్చరర్. ఆ తర్వాత ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకూ ఉండే విద్యా సంస్థను ఏర్పాటుచేశారు. అమ్మ గృహిణి. మేం నలుగురు పిల్లలం. నేను మా దగ్గర పదోతరగతి పూర్తయ్యాక, విజయవాడలో పాలిటెక్నిక్ చేశాను. తర్వాత పెండ్లయింది. చాలామంది ఆడపిల్లల్లాగే నాకు కూడా పెండ్లికి ముందు వంట పెద్దగా రాదు. అయితే మావారు భోజనప్రియులు. ఆయన కోసమే వంట చేయడం శ్రద్ధగా నేర్చుకున్నా. రోజూ ఆయన కోసం, పిల్లల కోసం.. కోరినవన్నీ గంటా గంటన్నరలో సిద్ధం చేసేస్తా. ఇప్పుడు మా ప్రొడక్షన్ హౌస్ కోసం రోజుకు యాభై మందికి అన్నం, పప్పు, కూర, ఫ్రై, రసం… ఇలా కనీసం అయిదారు రకాలు నేనే చేస్తా. ఆవకాయల సీజన్ వచ్చిందంటే 300 నుంచి 400 మందికి నా పచ్చళ్లు పంపుతా. పిల్లలు, వాళ్ల స్నేహితులైతే… నా ఒక్కో వంట తిన్న ప్రతిసారీ… ‘అమ్మా! ఇది కనుక రెస్టారెంట్లో ఉంటే ఎంతమందికి ఫేవరెట్ అవుతుందో…’, ‘ఆంటీ మీ వంట సూపర్…’ అంటూ కితాబు ఇచ్చేవారు. ‘అవును. నిజంగానే నేను రెస్టారెంట్ పెడితే బాగుంటుంది కదా’ అనిపించేది. అయితే పిల్లలు చిన్నవాళ్లవడంతో ఇంటి పనులతో బిజీగా ఉండేదాన్ని. ఇది కూడా తోడైతే అలసిపోతానని ఎవరూ ఒప్పుకోలేదు.
ఎన్ని పనుల్లో ఉన్నా సరే, రెస్టారెంట్ ఆలోచన నా మనసులో ఏదో ఒక పక్క నడుస్తూనే ఉండేది. అలా మూడేండ్ల క్రితం ఒకసారి నా కిచెన్ కోసం అడ్వాన్స్ ఇచ్చాను. అది తెలిసి ఇంట్లో వాళ్లు ససేమిరా అన్నారు. ఇక ఇప్పుడు మాత్రం నేను తగ్గలేదు. వాళ్లూ సహకరించారు. హైదరాబాద్‌లో మేముండే మాదాపూర్ ఏరియాలోనే మొదట క్లౌడ్ కిచెన్ ప్రారంభిద్దామనుకున్నా. తినేందుకు వీలుండేలా పెట్టమని చుట్టుపక్కల వాళ్లు అడగడంతో నేరుగా రెస్టారెంట్ తెరిచాను. దీనికి రెండు నెలల ముందు నుంచీ షెఫ్‌లతో కలిసి పనిచేశాను. వంటల్ని నా మాడల్‌లో ఎలా చేస్తానో, దినుసుల్ని ఎన్ని పాళ్లలో తీసుకుంటానో చెప్పాను. వాళ్లు కూడా అన్నీ చక్కగా అర్థం చేసుకున్నారు. మావాళ్లు నా పలావ్‌ను బాగా ఇష్టపడతారు. కుక్కర్లో చేస్తాన్నేను. కుక్కర్ పలావ్ పేరుతో నేరుగా కుక్కర్‌తోనే ఇక్కడ దాన్ని వడ్డిస్తున్నాను. జనానికి బాగా నచ్చిన వాటిలో ఇది ఒకటి. దీంతోపాటు ఇచ్చే గోంగూర కట్ట అనే కూరకు కూడా బాగా ఫ్యాన్స్ ఉన్నారు. నా వంట తినడానికి జనం గంటసేపైనా వేచి ఉండటం నాకు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగిస్తున్నది. అచ్చం ఇంట్లో చేసినట్టే ఆరోగ్యకరమైన పదార్థాలతోనే శుచిగా నేను వంట చేయాలనుకుంటా. రోజూ తిన్నా పొట్టకి హాయిగా ఉండాలన్నది నా ధ్యేయం. అందుకే అమ్మచేతి వంట రుచి చూడాలనుకుంటే నా కిచెన్‌కి రమ్మంటా!
నా వంటల్లో మా పెద్దబాబుకి చేపల పులుసు ఇష్టం. శౌర్యకు నిమ్మకాయ పులిహోర, దోసకాయ టమాట, వంకాయ టమాటలాంటి కూరలు ఇష్టం. మా వారికైతే నేనేం చేసినా నచ్చుతుంది. మా నాన్నగారు లెక్చరర్ కావడంతో మమ్మల్ని చాలా స్ట్రిక్ట్‌గా పెంచారు. నేనూ నా పిల్లల్ని అలానే పెంచాను. పెద్దవాళ్లను గౌరవించకపోతే అస్సలు ఒప్పుకొనేదాన్ని కాదు. సినిమాలో అయినా బయట అయినా వాడు హుందాగా ఉండటానికి బహుశా అదే కారణం కావచ్చు. తొలినాళ్లలో శౌర్య సినిమాల విషయంలో నా భాగస్వామ్యం ఎక్కువగా ఉండేది కాదు. కానీ ఐరా క్రియేషన్స్ పేరిట మా సొంత బ్యానర్ మీద తీస్తున్నప్పటి నుంచి కథలు వింటున్నా. నా సలహాలను వాళ్లూ గౌరవిస్తారు. మంచి సినిమాలు వండివారుస్తున్నారు.
-లక్ష్మీహరిత ఇంద్రగంటి
-గడసంతల శ్రీనివాస్