గుర్తుంచుకోవడం, నేర్చుకోవడం అన్నవి మెదడు, దాని సంబంధిత కణాలకు మాత్రమే పరిమితమైన పనిగా మనం ఇన్నాళ్లూ భావించాం. కానీ మన శరీరంలోని అన్ని అవయవాల కణాలూ వాటివాటి జ్ఞాపకాలను కలిగి ఉంటున్నాయని ఇటీవలి ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం మళ్లీమళ్లీ కొన్ని రకాల సంకేతాలకు లోనైనప్పుడు సంబంధిత అవయవానికి చెందిన కణాలు అచ్చం మెదడు కణాల్లాగే జ్ఞాపకాలను ఏర్పరచుకుంటున్నాయట. న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. ఇందుకోసం నరాలు, కిడ్నీలకు సంబంధించిన కణాలను సేకరించి ల్యాబొరేటరీలో ప్రత్యేక పరిస్థితుల్లో ఉంచారు. కొత్త విషయాలను నేర్చుకున్నప్పుడు మెదడుకు ఎలాంటి సంకేతాలు అందుతుంటాయో, అలాగే కొన్ని రకాల రసాయన సంకేతాలను ఈ కణాలకు పంపారట.
అప్పుడు ఈ కణాలలోని మెమరీ జీన్ యాక్టివేట్ అయింది. అంటే, వీళ్లు పంపే సంకేతాలను అవి గుర్తుంచుకుంటున్నాయన్నమాట! అది కూడా మనం పరీక్షకు ముందు, చివరి నిమషంలో కంగారు కంగారుగా ఒకేసారి చదివితే ఎలా గుర్తొండవో.. అచ్చం ఇవి కూడా అలాగే ప్రవర్తించాయట. అందుకు భిన్నంగా కొంచెం కొంచెం విరామాలతో… మళ్లీమళ్లీ పునశ్చరణ చేసినట్టు ఇచ్చిన సమాచారాన్ని మాత్రం చక్కగా గుర్తుంచుకున్నాయట. కాబట్టి ఇక ముందు మనం శరీరం మొత్తాన్నీ మెదడులా పరిగణించాలని ఈ పరిశోధన ద్వారా అర్థం అవుతున్నది. అంతేకాదు, బాగా గుర్తుండటం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సంబంధించి, జ్ఞాపకశక్తి తాలూకు రుగ్మతల చికిత్స లాంటి వాటిలో మరింత సమాచారం దొరికినట్టే!