ఒక ఊర్లో పొలం పనులు చేసుకునే యువకుడికి పెళ్లి జరిగింది. ఊరికి కొత్తగా వచ్చిన భార్య, ఊర్లో వాళ్లు సరిగ్గా పలకరించడం లేదని, ఇచ్చి పుచ్చుకోవడాలు తక్కువని భర్తతో చెప్పి బాధపడేది. కొన్నేళ్లు గడిచాక వారికి పుట్టిన కొడుక్కి అక్షరాభ్యాసం చేయించడానికి బాసర వెళ్లారు. గోదావరి నదిలో స్నానం
చేసి సరస్వతీ దేవి సాక్షిగా పిల్లాడికి అక్షరాభ్యాసం చేయించారు. అక్కడ కొన్ని పుస్తకాలు, పెన్నులూ కొన్నాడు భర్త. అన్ని పుస్తకాలు, పెన్నులు దేనికని భార్య అడిగింది. అతను నవ్వి ఊరుకున్నాడు.
ఊరికి వెళ్లగానే భార్యతో.. కొడుకును తోడు చేసుకుని స్థానికంగా ఉన్న బంధువుల ఇంటికి వెళ్లిరమ్మన్నాడు. దగ్గరి బంధువులకు ప్రసాదం, వారి ఇండ్లలో ఉన్న పిల్లలకు పుస్తకం, పెన్నులూ ఇచ్చి రమ్మన్నాడు. ‘ఎవ్వరూ పలకరించరు, సరిగ్గా మాట్లాడారు. కనీసం నవ్వరు. వారికెందుకు బహుమతులు?’ అని ఆమె పెదవి విరిచింది. ‘ఫర్వాలేదు, వెళ్లి ఇచ్చి రా’ అని ఆమెను బలవంతంగా పంపాడు. గంట తర్వాత తల్లీకొడుకులు ఇద్దరూ ఇంటికి వచ్చారు. కొడుకు చేతిలో దండిగా బహుమతులు ఉన్నాయి. ఆమె చేతిలో పండ్లు, పూలు, కొన్ని కూరగాయలు ఉన్నాయి.
ఆమె ముఖం మెరుస్తూ ఉంది. భర్త అమాయకంగా ముఖం పెట్టి ‘ఇవన్నీ ఎక్కడివి?’ అని అడిగాడు. ‘ఏమో అనుకున్నానండీ… మన ఊర్లో వాళ్లు చాలా మంచివాళ్లు. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. పాలు, మజ్జిగలాంటివి తాగమన్నారు. మంచి చెడ్డలు విచారించారు’ అని చెప్పింది. అప్పుడు అతను నవ్వుతూ ‘ఎవ్వరైనా, ఇదిగో అమ్మా ఆకు కూర అంటే తీసుకోమ్మా పుల్లగూర అంటారు. మనం ఇవ్వడం ప్రారంభించాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. మనం దాచిపెడితే వారు కూడా దాచడం చేస్తారు. దూరంగా ఉండిపోతారు. రెండు చేతులూ చరిస్తేనే చప్పట్లు’ అన్నాడు. ‘నిజమేనండీ… ఇచ్చే కొద్దీ వస్తుందని, ఇచ్చుటలో ఉన్న హాయి మరి దేనిలోనూ లేదని గుర్తించాను’ అని చెప్పి పాయసం చేసి బంధువులకు పంచడానికని వంటింట్లోకి వెళ్లింది.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు,
93936 62821