ఆధునిక పోకడలు.. కొందరిలో ఆధిపత్య ధోరణిని పెంచుతున్నాయి. అబ్బాయిలేకాదు.. అమ్మాయిల్లోనూ ఈ రకమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో, ఎదుటివారి గురించి తక్కువగా ఊహించుకుంటున్నారు. తమదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయంలోనూ భాగస్వామిని చిన్నచూపు చూస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎదుటివారు ఆత్మన్యూనతకు లోనవుతారు. ఇలాంటి ధోరణి.. దీర్ఘకాలంలో వారి బంధంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బంధం పదికాలాల పాటు బలంగా ఉండాలంటే.. భాగస్వామిని తమతో సమానంగా చూడాలని సూచిస్తున్నారు. అన్ని విషయాల్లో.. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో భాగస్వామి ప్రాతినిథ్యం ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. దంపతులకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉండాలనీ, ముఖ్యంగా నలుగురిలో భాగస్వామిని ఏమాత్రం అగౌరవంగా చూడొద్దని చెబుతున్నారు. ఏవైనా తెలియని విషయాలు ఉంటే.. కూర్చొని మాట్లాడుకోవాలని, వారికి అర్థమయ్యేలా చెప్పాలని సలహా ఇస్తున్నారు. అంతేగానీ, ‘చెప్పినా అర్థం కాదులే!’ అంటూ కసురుకోవద్దని సూచిస్తున్నారు.
ఇక తమకు నచ్చినట్టే వ్యవహరించడం, తమ అభిప్రాయానికే కట్టుబడి ఉండటం కూడా మంచిది కాదు. ఒకరి ఇష్టాయిష్టాలకు తగినట్లుగానే మరొకరు ప్రవర్తించాలని అనుకోవడం కూడా బంధాలను బలహీనం చేస్తుంది. జంటల్లో ఒకరి ఆధిపత్యమే నడుస్తూ ఉంటే.. చివరికి గొడవలకు దారితీస్తుంది. విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి, భాగస్వామి ఇష్టాలు, అభిప్రాయాలను ఎదుటివారు గౌరవించాలని నిపుణులు చెబుతున్నారు. తమకు ఏం కావాలో చెప్పి చేయించుకోవడంతోపాటు.. ఎదుటివారికి ఏం కావాలో కూడా తెలుసుకొని చేసి పెట్టాలని సలహా ఇస్తున్నారు. అప్పుడే బంధాలు మరింత బలంగా తయారవుతాయని అంటున్నారు.